ఉద్యోగుల జీతాలు పెరగలేదుకానీ.. సీఈవో శాలరీలు మోత మోగాయి
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సీఈవోలకు మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటోంది.
కరోనా తర్వాత.. గత ఏడాదిగా రంగం ఏదైనా.. ఉద్యోగుల జీతాల్లో పెరుగుదల విషయంలో ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాంద్యం పేరుతో.. సంస్థలు చాలా వరకు జీతాల పెంపు విషయంలో ఉదారంగా వ్యవహరించటం మానేసి చాలా కాలమే అయ్యింది. దీనికి తోడు ఎప్పుడు ఉంటుందో? ఎప్పుడు పోతుందో తెలీని జాబ్ విషయంలో విపరీతమైన టెన్షన్ నెలకొన్న పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సీఈవోలకు మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటోంది. ఇదే విషయాన్ని తాజా అధ్యయనం స్పష్టం చేస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా ఎస్ అండ్ పీ 500 కంపెనీలను నడిపిస్తున్న సీఈవో (కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) వేతనాలు పెరిగిన వైనం చూస్తే.. ఆసూయ చెందాల్సిందే. భారీగా ఉండే వారి శాలరీలకు ఏడాది వ్యవధిలో పెరిగిన శాతం కూడా ఎక్కువనే చెప్పాలి. గత ఏడాది సుమారు 13 శాతం పెరుగుదల వారి జీతాల్లో చోటు చేసుకుంది. అంతేకాదు.. సీఈవోల సగటు వేతన ప్యాకేజీ సుమారు రూ.135 కోట్లకు చేరినట్లుగా చెబుతున్నారు.
ది అసోసియేటెడ్ ప్రెస్ - ఏపీ గణాంకాల ప్రకారం చూస్తే.. ప్రైవేటు కంపెనీల్లో కార్మికుల జీతాల్లో 4.1 శాతం పెరుగుదల మాత్రమే ఉండగా.. కంపెనీల్లోని టాప్ పొజిషన్ లో ఉండే సీఈవోల శాలరీలో మాత్రం పెరుగుదల కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. అమెరికా కేంద్రంగా కార్యకలాపాల్ని సాగించే బహుళజాతి సంస్థ బ్రాడ్ కామ్ సీఈవో హాక్ టాన్ వేతన ప్యాకేజీ గురించి విన్నంతనే ఆసూయ పుట్టేలా ఉండటం ఖాయం. ఆయనకు రూ.1345 కోట్ల వేతన ప్యాకేజీలో టాప్ లో నిలిచారు. డాలర్లలో చూస్తే ఆయన ప్యాకేజీ 162 మిలియన్ డాలర్లుగా ఉంటే.. 160.5 మిలియన్ డాలర్ల మొత్తాన్ని స్టాక్ రూపంలో ఇస్తున్నారు. ప్రస్తుతం బ్రాడ్ కామ్ షేరు ఒక్కొక్కటి 470 డాలర్ల చొప్పున ట్రేడ్ అవుతోంది.
ఆసక్తికరమైన అంశం ఏమంటే.. అత్యధికంగా వేతానాలు తీసుకుంటున్న సీఈవోల్లో మహిళా సీఈవోల సంఖ్య పెరగటం గమనార్హం. అయితే.. పురుషులతో పోలిస్తే మహిళా సీఈవోల జీతాలు తక్కువే. ఏపీ వార్షిక ప్యాకేజీ సర్వేల్లోని 341 మంది సీఈవోల్లో పాతిక మంది మహిళలు ఉన్నారు. 2017లో 21గా ఉంటే.. తాజాగా పాతికకు పెరిగింది. మహిళా సీఈవోల్లో అత్యధిక వేతనం అందుకుంటున్న మహిళా సీఈవోగా అడ్వాన్స్ డ్ మైక్రో డివైజెస్ సీఈవో లీసా సు నిలిచారు. ఆమె అత్యధిక వేతనం 30.3 మిలియన్ డాలర్లు. ఇతర మహిళా సీఈవోల్లో జనరల్ మెటార్స్ సీఈవోగా వ్యవహరిస్తున్న మేరీ బర్రాకు 27.8 మిలియన్ డాలర్లు.. సిటీ గ్రూప్ సీఈవో జేన్ ఫ్రాసెర్ 25.5 మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నారు.
టాప్ సీఈవో వేతనాలు.. వారి సంస్థల్ని చూస్తే..
సీఈవో పేరు సంస్థ పేరు వేతన ప్యాకేజీ (మిలియన్ డాలర్లలో)
విలియం లాన్సింగ్ ఫెయిర్ ఇసాక్ కార్ప్ 66.3
టిమ్ కుక్ యాపిల్ 63.2
ప్రోలాజిస్ హామిద్ మోఘదామ్ 50.9
టెడ్ సారాన్దోస్ నెట్ ఫ్లిక్స్ కో సీఈవో 49.8