పవన్ ఓడేందుకు ఇంటికి రూ.10 వేలు ఇచ్చేస్తున్నారా?
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటింటికి రూ.10వేలు పంచటం అంత సులువైన అంశం కాదని.. ఒకవేళ పంచినా.. ఇప్పటికే ఆ అంశం ప్రధాన మీడియాలో కాకున్నా సోషల్ మీడియాలో రచ్చరచ్చగా మారేందంటున్నారు.
హోరాహోరీగా సాగుతున్న ఏపీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం మీద అందరి చూపు ఉండటం తెలిసిందే. గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి ఒక్క స్థానం నుంచే పోటీ చేస్తున్న పవన్ కల్యాణ్ ను ఓడించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కల్యాణ్ ను అసెంబ్లీలోకి అడుగు పెట్టనీయకుండా చూసేందుకు అధికార వైసీపీ ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో ఏది ఏమైనా ఈసారి ఎన్నికల్లో గెలుపు కోసం పవన్ అండ్ కో ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పిఠాపురం రాజకీయం ఇప్పుడు హాట్ హాట్ గా మారింది.
ఇదిలా ఉంటే.. తాజాగా జనసేన నేతలు కొత్త వాదనను తెర మీదకు తీసుకొస్తున్నారు. పవన్ కల్యాణ్ ను పిఠాపురంలో ఓడించేందుకు వీలుగా అధికార పార్టీ భారీగా ప్లాన్ చేసిందని.. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని ఇంటింటికి రూ.10 వేలు చొప్పున పంచుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. హార్డ్ కోర్ జనసేన అభిమానులున్న ఇళ్లను మినహాయించి.. నియోజకవర్గంలోని వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా ఇంటింటికి రూ.10వేలు చొప్పున పంచే ప్రోగ్రాం పెద్ద ఎత్తున చేపడుతున్నట్లుగా జనసైనికులు ఆరోపిస్తున్నారు.
అయితే.. ఈ వాదనలో వ్యూహం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజంగానే రూ.10వేలు ఇంటింటికి పంచే ప్రోగ్రాం షురూ చేసి ఉంటే.. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన వీడియోలు భారీగా వచ్చేవని.. కానీ అదేమీ లేకుండా నోటి మాటలతో సాగుతున్న ఈ ప్రచారం మొత్తం పవన్ కల్యాణ్ మీద సానుభూతిని పెంచేందుకు వీలుగా సాగుతుందని చెబుతున్నారు. అధికార పార్టీని దెబ్బ తీసేందుకు వీలుగా.. ఈ వాదనను తెర మీదకు తెచ్చారని చెబుతున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటింటికి రూ.10వేలు పంచటం అంత సులువైన అంశం కాదని.. ఒకవేళ పంచినా.. ఇప్పటికే ఆ అంశం ప్రధాన మీడియాలో కాకున్నా సోషల్ మీడియాలో రచ్చరచ్చగా మారేందంటున్నారు. అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ఉన్న ఏ చిన్న అవకాశాన్ని విడవని పవన్ వర్గీయులు.. అధికార పార్టీని టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇంటింటికి రూ.10వేలు పంచుతున్నారన్న ప్రచారం మొత్తం వ్యూహాత్మకమేనని చెబుతున్నారు. రూ.10వేలు పంచుతున్నారన్న మాట వ్యాపింపచేయటం ద్వారా.. పవన్ కు పాజిటివ్ ఓటింగ్ పెంచేందుకు ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.