కూటమి తొలి బడ్జెట్...సూపర్ సిక్స్ అలా ఫిక్స్

మొత్తానికి అధికారం దక్కిన అయిదు నెలల తరువాత టీడీపీ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ని సభలో ప్రవేశపెట్టింది.

Update: 2024-11-11 13:30 GMT

మొత్తానికి అధికారం దక్కిన అయిదు నెలల తరువాత టీడీపీ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ని సభలో ప్రవేశపెట్టింది. అయితే ఈ బడ్జెట్ కోసం రెండు కళ్ళూ కాదు కోటి కళ్ళు అరువు తెచ్చుకుని మరీ ఏపీలోని జనాలు అంతా ఎదురుచూశారు. ఆర్ధిక మంత్రిగా పయ్యావుల కేశవ్ తొలిసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో టీడీపీ అధినేత కూటమి నాయకుడు చంద్రబాబు మీద ప్రశంసలతో ఆయన గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలను జోడించి మరీ ప్రసంగం పూర్తి చేశారు.

దాదాపుగా మూడు లక్షల కోట్లతో బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. కానీ ఈ బడ్జెట్ కేవలం నాలుగు నెలల కోసమే అన్నది గమనించాల్సి ఉంది. అయితే జూన్ నుంచి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆనాటి నుంచి గత అయిదు నెలలుగా చేసిన ఖర్చు వివిధ రంగాలకు పెట్టిన ఖర్చుని కూడా బడ్జెట్ లో చూపించారు.

అదే సమయంలో రానున్న నాలుగు నెలలలో ఏ విధంగా ఖర్చు చేయబోతున్నది కూడా పేర్కొంటూ భారీ అంకెలను చూపించారు. మొత్తానికి బడ్జెట్ లో అన్ని రంగాలకు కేటాయింపులు బాగానే ఉన్నాయి. కానీ టీడీపీ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పేరుతో ఆరు హామీల సంగతేంటి మహానుభావా అంటే దానికి మాత్రం బడ్జెట్ ని ఎంత చూసినా అర్థం కాలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

సూపర్ సిక్స్ లో రెండు హామీలు అయితే ఇప్పటికే నెరవేర్చారు. అవి సామాజిక పెన్షన్ పెంపు, అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ పధకం. అదే విధంగా అన్నార్తుల కోసం ఏపీలో పట్టణాలలో దాదాపుగా రెండు వందల చోట్ల ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లు. వీటి గురించి బడ్జెట్ లో బాగానే చెప్పారు.

ఇక తల్లికి వందనం గురించి ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ అమలు చేస్తామని చెబుతూ త్వరలో అన్నారు. మరి ఆ త్వవలో ఎపుడు అనదే ప్రశ్నగా ఉంది. ఎందుకంటే మరో నాలుగు నెలలలో 2024-24 విద్యా సంవత్సవం ముగిసిపోతోంది.

దాంతో తల్లికి వందనం అమలు ఈ ఆర్థిక సంవత్సరంలో చేస్తారా లేక 2025-26లో చేస్తారా అన్న ధర్మ సందేహాలు అయితే వస్తున్నాయి. ఒక తల్లికి ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ ఒక్కొక్కరికీ ఇరవై వేల రూపాయలు వంతున ఈ పధకం కింద నగదు జమ చేయడం ముఖ్య ఉద్దేశ్యం.

ఇక చూస్తే బడ్జెట్ లో ఉన్నత విద్యా రంగానికి 2,326 కోట్ల రూపాయలు చూపించారు. అదే పాఠశాల విద్యకు మాత్రం 29,909 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇందులో నుంచి తల్లికి వందనం నిధులు ఇస్తారా అన్నది కూడా చర్చకు వస్తోంది.

ఇక రైతులకు భరోసా కింద అన్న దాతా సుఖీభవ పధకం అమలు చేస్తామని చెప్పారు. అది కూడా ఏడాదికి ఇరవి వేల రూపాయలు. బడ్జెట్ లో చెప్పింది ఏంటి అంటే కేంద్రం ఏటా ఇచ్చే పీఎం కిసాన్ పధకం కింద ఆరు వేలతో కలుపుకుని అని. అంటే అది కాకుండా కూటమి ప్రభుత్వం అచ్చంగా ఇచ్చేది 14 వేల కోట్ల రూపాయలు అన్న మాట. మరి అది ఎప్పటి నుంచి ఇస్తారు ఏమిటి అంటే దీనికి కూడా త్వరలో అన్న జవాబే వస్తోంది.

ఇక చూస్తే ఈ పధకం కోసం కేటాయిచింది 4,500 కోట్ల రూపాయలు మాత్రమే అని అంటున్నారు. మొత్తం ఏపీలో రైతులు 52 లక్షల మంది ఉన్నారని వారందరికీ ఈ పధకాన్ని వర్తింపజేయాలి అనుకుంటే పది వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని అందులో సగం కంటే తక్కువే కేటాయింపులు జరిగాయని అంటున్నారు.

ఇక ఉచిత బస్సు పధకం గురించి చూస్తే ఏపీలో కొత్తగా 1400 కి పైగా బస్సులు కొనాల్సి ఉంది. దానికి ఖర్చు అవుతుంది. బడ్జెట్ లో కేటాయింపులు ఏమి జరిగాయో చూడాల్సి ఉంది. ఈ పథకం గురించి మంత్రి పయ్యావుల చెబుతూ త్వరలో అనే పేర్కొన్నారు. సో ఇది కూడా కచ్చితమైన తేదీ అయితే చెప్పలేదు.

ఇక బడ్జెట్ దాకా రాకుండా మిస్ అయిన సూపర్ సిక్స్ హామీలు చూస్తే కనుక ఉద్యోగం అయినా ఇస్తాం లేదా నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి అయినా ఇస్తామని ఒక సూపర్ హామీ కూటమి పెద్దలు ఇచ్చారు. బడ్జెట్ లో చూస్తే ఆ హామీ గురించి ప్రస్తావన అయితే లేదని నిరుద్యోగ యువత పెదవి విరుస్తోంది.

అదే విధంగా 18 నుంచి 59 ఏళ్ళ మధ్య వయసు కలిగిన ప్రతీ మహిళకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని మహా శక్తి పధకంగా కూటమి ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఇపుడు చూస్తే బడ్జెట్ లో ఈ హామీ గురించి ప్రస్తావన లేదని అంటున్నారు. ఇలా సూపర్ సిక్స్ హామీల విషయం ప్రస్తావన లేకుండానే బడ్జెట్ ప్రవేశపెట్టారని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఈ బడ్జెట్ కేవలం నాలుగు నెలలకు మాత్రమే అని అంటున్నారు. అంటే 2025-26 మీదనే ఆశలు పెంచుకోవాలేమో అన్నది బడ్జెట్ సారాంశంగా కనిపిస్తోందని అంటున్నారు.

Tags:    

Similar News