బీజేపీకి షాక్.. ఢిల్లీ మేయర్ పీఠం ఆప్‌దే..
తాజాగా మేయర్ పీఠాన్ని సైతం అందుకోలేకపోయింది. మేయర్ పదవి కూడా ఆప్ ఖాతాలోనే చేరింది.
ఢిల్లీలో మరోసారి బీజేపీకి షాక్ తగిలింది. కేంద్రంలో హ్యాట్రిక్ విజయం సాధించిన బీజేపీకి.. ఢిల్లీ మాత్రం చేజిక్కడం లేదు. ఇప్పటికే అసెంబ్లీని కోల్పోయిన బీజేపీ.. తాజాగా మేయర్ పీఠాన్ని సైతం అందుకోలేకపోయింది. మేయర్ పదవి కూడా ఆప్ ఖాతాలోనే చేరింది. దీంతో ఈ ప్రభావం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ చూపుతుందా అన్న ప్రశ్నలు అప్పుడే బీజేపీ నేతల్లో మొదలయ్యాయి. ఈసారి ఎలా అయినా ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీకి.. ఈ ఓటమి మరింత జీర్ణించుకోకుండా చేసింది.
ఢిల్లీ నగర మేయర్ ఎన్నిక నిన్న హోరాహోరీగా సాగింది. మరోసారి బీజేపీ, ఆప్‌లు తలపడ్డాయి. ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ జరిగింది. ఉత్కంఠకు దారితీసిన ఈ ఎన్నికల్లో చివరకు ఆప్ అభ్యర్థి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నాడు. 256 ఓట్లలో 133 ఓట్లు ఆప్ అభ్యర్థి మహేశ్ ఖిచికి లభించగా.. ప్రత్యర్థి,బీజేపీ అభ్యర్థి కిషన్‌లాల్‌కు 130 ఓట్లు వచ్చాయి. మరో రెండు ఓట్లు చెల్లనివిగా ప్రకటించారు.
ఇక మేయర్ ఎన్నికల్లో ఓటమితో బీజేపీ డిప్యూటీ మేయర్ ఎన్నిక నుంచి తప్పుకుంది. ఫలితంగా డిప్యూటీ మేయర్ పదవి కూడా ఆప్ ఖాతాలోనే పడింది. చివరకు రవీందర్ భరద్వాజ్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఈ ఎన్నికల్లో ఆప్ ఎంపీలు సంజయ్ సింగ్, ఎన్‌డీ గుపా, బీజేపీకి చెందిన ఏడుగురు ఎంపీలు ఓటు వేశారు. మరోవైపు మేయర్, డిప్యూటీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కౌన్సిలర్ సబిలా బేగమ్ ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
వచ్చే ఏడాది ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో జరిగిన మేయర్ ఎన్నికల్లో ఆప్ సాధించిన విజయం ఆ పార్టీకి మరింత బూస్టింగ్ ఇచ్చిందని చెప్పాలి. ఈ విజయం అధికార పార్టీకి భారీ ఊరటనిచ్చే విజయం అనే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల తరుణంలో ఈ విజయాలు గొప్ప సంతోషాన్ని ఇచ్చాయని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అయితే.. ఆప్ తరఫున దళితుడైన మహేశ్ మేయర్ పీఠాన్ని అధిష్టించడంతో.. ఆప్ కౌన్సిలర్లు జై భీమ్ అంటూ నినదించారు. ఈ ఎన్నికల్లో 8 మంది కౌన్సిలర్లు దూరంగా ఉన్నారు. 8 మంది కౌన్సిలర్లు కూడా క్రాస్ ఓటింగ్ చేసినట్లు ఆప్ ఆరోపించింది. వారి ఓట్లతోనే బీజేపీ పెరిగిందని పేర్కొన్నారు. ఈ మేయర్ ఈ ఏడాది ఏప్రిల్‌లోనే జరగాల్సి ఉన్నప్పటికీ.. ఆప్, బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం, ఎన్నికలను కాంగ్రెస్ బాయికాట్ చేయడం వంటి కారణాలతో వాయిదా పడింది. ఎట్టకేలకు ఎన్నిక ప్రక్రియ ముగియడంతో ఆప్ సంబరాల్లో మునిగింది.