ఆది వర్సెస్ రమేష్.. చోద్యం చూస్తున్న బీజేపీ ..!
ఆ ఇద్దరూ ఒకప్పుడు టీడీపీ.. ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఒకరు ఎంపీ అయితే, మరొకరు ఎమ్మెల్యేగా విజయం దక్కించుకున్నారు
ఆ ఇద్దరూ ఒకప్పుడు టీడీపీ.. ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఒకరు ఎంపీ అయితే, మరొకరు ఎమ్మెల్యేగా విజయం దక్కించుకున్నారు. ఇద్దరూ ఒకే జిల్లాకు చెందిన వారు కూడా. కానీ, ఆధిపత్య రాజకీయాలు ఇప్పుడు జిల్లాతోపాటు.. సర్కారు కూడా సెగ పెడుతున్నాయి. వారే.. ఉమ్మడి కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్. ఇద్దరి మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి నెలకొంది.
కారణం ఏంటి.. ?
జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఉన్న ఆది నారాయణరెడ్డి.. ఇక్కడ వ్యాపారాలు, వ్యవహారాల్లో అన్నీ తానై వ్యవహరిస్తున్నారన్నది బహిరంగ రహస్యం. మద్యం నుంచి ఇసుక వరకు అన్ని విషయాల్లోనూ ఆయన వర్గం జోక్యం పెరిగి పోయింది. గతంలో టీడీపీ, వైసీపీలో ఉన్న నేపథ్యంలో ఆయా పార్టీల నాయకులను మచ్చిక చేసుకుని, లేదా బెదిరించి.. ఇక్కడ వ్యవహారాలు నడుపుతున్నారని స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇదిలావుంటే, జమ్మలమడుగులో అదానీ కంపెనీ హైడ్రో పవర్ ప్రాజెక్టును నిర్మిస్తోంది.
ఇది వైసీపీ హయాంలోనే పురుడు పోసుకున్న ప్రాజెక్టు. అయితే.. ఇప్పుడు దానికి సంబంధించిన పనులు ముందుకు సాగుతున్నాయి. వీటిలో సబ్ కాంట్రాక్టును సీఎం రమేష్‌కు చెందిన రుత్విక్ కన్‌స్ట్రక్షన్ సంస్థ దక్కించుకుంది. అయితే.. ఇదే ఇప్పుడు వివాదంగా మారింది. ఈ సబ్ కాంట్రాక్టును సీఎం రమేష్ దక్కించుకోవడాన్ని ఆది కుటుంబ సభ్యుల నుంచి ఆయన అనుచర వర్గం వరకు వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఇక్కడ పనులు ప్రారంభించిన వారిని బెదిరించి.. దాడులకు దిగారు.
అయితే.. ఈ పరిణామం.. ఇప్పటికిప్పుడు జరిగింది కూడా కాదు. గత రెండు మాసాల నుంచి కూడా రగులు తోంది. ఈ క్రమంలో ఇద్దరు నేతలను చంద్రబాబు హెచ్చరించారు. ఆధిపత్య రాజకీయాలు వద్దని కూడా హితవు పలికారు. అయినా.. ఆది వర్గం రెచ్చిపోయి దాడులకు దిగింది. దీనిపై సుమారు 150 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే.. ఇంత జరుగుతున్నా.. బీజేపీ నాయకులు మాత్రం జోక్యం చేసుకోవడం లేదు. పరిస్థితిని సరిదిద్దడం లేదు. అటు ఆది, ఇటు రమేష్ ఇద్దరూ బీజేపీలోనే ఉన్నా.. సర్దుబాటు చేయకపోవడంతో పెట్టుబడులపై ప్రభావం చూపుతుండడం గమనార్హం.