20సీట్లు కూడా రావన్న మాటకు భారీ కౌంటర్ వేసేశాడుగా?
రెండు రోజుల క్రితం జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్.. కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో 20 లోపు సీట్లు మాత్రమే వస్తాయన్న జోస్యం చెప్పటం తెలిసిందే.
గులాబీ బాస్ కమ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి మాటకు మాటగా సమాధానం ఇవ్వటం అంత తేలికైన విషయం కాదు. కేసీఆర్ మాటల్ని ఎదుర్కోవటం అంత ఈజీ కాదు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ ను క్రాక్ చేసినట్లుగా చెప్పాలి. తెలంగాణలోనిమరే కాంగ్రెస్ నేతకు లేని నేర్పు రేవంత్ కు ఉందని చెప్పాలి. ఈ కారణంగానే కాంగ్రెస్ మీద కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలకు.. విమర్శలకు అంతే ధీటుగా బదులిస్తున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్.. కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో 20 లోపు సీట్లు మాత్రమే వస్తాయన్న జోస్యం చెప్పటం తెలిసిందే.
ఈ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మాటకు మాట అనే రీతిలో బదులిచ్చారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో, నిజామాబాద్ జిల్లా ధర్పల్లిలో బుధవారం కాంగ్రెస్ నిర్వహించిన విజయభేరి యాత్ర సభల్లో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రజలకు అబద్ధాలు చెప్పి నమ్మించడంలో దిట్ట అని, ఆయనకు అవకాశం వస్తే దేవుళ్లను కూడా మోసం చేయడానికి వెనుకాడడంటూ విరుచుకుపడ్డారు.
‘‘కేసీఆర్‌కు పదవి పోతుందనే భయం పట్టుకుంది. అందుకనే కాంగ్రె్‌సకు 20 సీట్లు కూడా రావని మాట్లాడుతున్నాడు. ‘నిజామాబాద్ సాక్షిగా కేసీఆర్‌కు చెబుతున్నా ఈ ఎన్నికల్లో 80 సీట్ల కంటే ఒక్క సీటు కూడా తగ్గకుండా ప్రజలు కాంగ్రె్‌సను గెలిపిస్తారు. ఒక్క సీటు తగ్గినా కేసీఆర్ వేసే ఏ శిక్షకైనా సిద్ధమే. కేసీఆర్ కొడుకు, కూతురు, అల్లుడు, సడ్డకుని కొడుకు కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. వారికి ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలి’’ అంటూ పిలుపునిచ్చారు.
వందలాది మంది త్యాగాలు చేసి తెలంగాణను సాధిస్తే, ప్రస్తుతం తెలంగాణ.. దోపిడీదారులు, దగాకోరులు, దొంగల చేతుల్లో చిక్కుకుందన్న రేవంత్.. ‘‘బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలతో స్థానికంగా ఉన్న సాగు భూములను సస్యశ్యామలం చేస్తామని చెప్పి ఇప్పటి వరకూ పనులు కూడా ప్రారంభించలేదు. బీఆర్‌ఎస్ నేతలు ఇచ్చిన ఏ హామీనీ నెరవేర్చలేదు. వంద రోజుల్లో నిజాంషుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పి పదేళ్లయినా ఇప్పటికీ నెరవేర్చలేదు. కవితను ఓడించారనే కోపంతో నిజామాబాద్ రైతులపై కేసీఆర్ ప్రభుత్వం కక్ష కట్టింది’’ అని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా తాను కామారెడ్డిలో పోటీ చేయటానికి కారణాన్ని చెప్పుకున్నారు రేవంత్ రెడ్డి. తాను జిల్లాలో నిర్వహించిన పాదయాత్ర సందర్భంగా ఇక్కడి నుంచి పోటీ చేయాలని రైతులు, ప్రజలు కోరారని, వారి కోరిక ప్రకారమే అధిష్ఠానం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి నుంచి తనను బరిలోకి దింపిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలను కట్టబెట్టాలని ప్రజలకు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. మరి.. ప్రజలు ఎలాంటి తీర్పును ఇస్తారన్నది తేలాలంటే డిసెంబరు 3 వరకు వెయిట్ చేయాల్సిందే.