ఏందయ్యా ఇదే?... వంద మందికి ఒకటే తండ్రి పేరు!
ఈ సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఏపీలో తుది ఓటర్ల జాబితా విడుదల చేశారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటర్ల జాబితాలో పలు విచిత్రాలు చొటు చేసుకుంటూ ఉంటాయి. ఇందులో భాగంగా ఒకే అడ్రస్ మీద సుమారు 50 ఓట్లు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఓట్లు.. ఇలా రకరకాల కథనాలు మీడియాలో దర్శనమిస్తున్నాయి! ఇదే సమయంలో ఏపీలో ప్రధానంగా దొంగ ఓట్లు, ఉన్న ఓట్ల తొలగింపు వంటి అంశాలపై రాజకీయ పార్టీలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఏపీలో తుది ఓటర్ల జాబితా విడుదల చేశారు.
అవును... కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం తుది ఓటర్ల జాబితా విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ఈ సందర్భంగా కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా... అక్టోబర్ 27న జారీ చేసిన ముసాయిదా జాబితా అనంతరం 5.8 లక్షల మంది ఓటర్లు పెరిగారని.. యువ ఓటర్లు సైతం 5 లక్షల మేర పెరిగారని తెలిపారు.
ఈ సందర్భంగా తమకు అందిన ఫిర్యాదులపైనా, తీసుకున్న చర్యలపైనా సీఈవో ముకేశ్ కుమార్ స్పందించారు. ఇందులో భాగంగా.. తప్పుడు చిరునామాలు, అసలు చిరునామా లేని ఓట్లతో పాటు.. ఒకే ఇంట్లో పదికి మించి ఉన్న ఓటర్లు వంటి పలు విషయాలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. వాటిలో చిరునామా లేకుండా 2.51 లక్షల మంది ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ లో సంగతి అలా ఉంటే... తాజాగా తెలంగాణలో ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా... వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో అత్యధిక జనాభా ఉన్న కరణ్ కోట పంచాయతీ ఓటరు జాబితాలో సిర్ర హన్మంతు అనే పేరు వైరల్ గా మారింది. కారణం... వందమందికి పైగా ఓటర్లకు తండ్రి పేరు ఇదే!
అవును... తాండూరు నియోజకవర్గంలో ఇటీవల విడుదల చేసిన ఓటర్ల జాబితాలో 76వ పోలింగ్ కేంద్రంలో వంద మందికిపైగా ఓటర్లకు తండ్రి పేరు సిర్ర హన్మంతుగా నమోదైంది. దీంతో ఈ విషయం ఆసక్తిగా మారింది. అయితే ఇదంతా తప్పుల తడకలో భాగమని, వీటిని సరిచేయాలని తాండూరు తహసీల్దార్ కార్యాలయంలో స్థానిక నాయకులు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.