మిలాఖ‌త్ రాజ‌కీయం: 'ఎంఐఎం' గ‌మ‌నం ఎటు?

ఈ క్ర‌మంలో ఎంఐఎం కూడా.. ముస్లింల కోసం వారి అభ్యున్న‌తి కోసం పుట్టిన పార్టీగా ఇన్నేళ్ల‌లో గుర్తింపు తెచ్చుకుని.. త‌న అస్తిత్వాన్ని నిల‌బెట్టుకునే ప్ర‌య‌త్నం చేసింది.

Update: 2025-02-13 11:30 GMT

ముస్లింల సాధికార‌త‌, వారి హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ‌, ముస్లిం పౌరుల భ‌ద్ర‌త‌కు క‌ట్టుబ‌డ‌తామంటూ.. హైద‌రాబాద్ కొన్ని ద‌శాబ్దాల కింద‌ట పుట్టిన మ‌జ్లిస్ పార్టీ.. ఎంఐఎం.. ఏ దిశ‌గా అడుగులు వేస్తోంది? ఎటు వైపు ప‌య‌నిస్తోంది? ఇవీ.. గ‌త నాలుగు రోజులుగా మీడియాలో జ‌రుగుతున్న‌ చ‌ర్చ‌. ముఖ్యంగా హైద‌రాబాద్ స‌హా యూపీ, మ‌హారాష్ట్ర‌, ఢిల్లీలోనూ.. ఆ పార్టీ నాయ‌కుల మ‌ధ్య జ‌రుగుతున్న చ‌ర్చ కూడా ఇదే. ఎటు ప్ర‌యాణించాలన్న అంశంపై ప్ర‌తి పార్టీకీ ఒక నిర్దేశం ఉంటుంది.

ఏ రాజ‌కీయ పార్టీ అయినా.. ప‌క్కా లెక్క‌ల‌తోనే ముందుకు సాగుతుంది. ఈ క్ర‌మంలో ఎంఐఎం కూడా.. ముస్లింల కోసం వారి అభ్యున్న‌తి కోసం పుట్టిన పార్టీగా ఇన్నేళ్ల‌లో గుర్తింపు తెచ్చుకుని.. త‌న అస్తిత్వాన్ని నిల‌బెట్టుకునే ప్ర‌య‌త్నం చేసింది. కానీ, గ‌త రెండు మూడేళ్లుగా.. ఆ పార్టీ అనుస‌రిస్తున్న వ్యూహాలు.. వేస్తున్న అడుగులు.. మైనారిటీ వ‌ర్గాల్లోనే చ‌ర్చ‌కు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. దీనికి కార‌ణం.. బీజేపీతో ఎంఐఎం అనుస‌రిస్తున్న మిలాఖ‌త్ రాజ‌కీయ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇటీవ‌ల వ‌చ్చిన ఢిల్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ఎంఐఎం ఒక్క సీటును కూడా ద‌క్కించుకోలేదు.కానీ, పోటీ చేసిన స్థానాలు మాత్రం 22 వ‌ర‌కు ఉన్నాయి. వీటిలో ఒంట‌రి పోరుకు దిగిన ఎంఐఎం.. స‌గానికిపైగా.. నియోజ‌క‌వ‌ర్గాల్లో డిపాజిట్ల‌ను కూడా ద‌క్కించుకోలేక పోయింది. ఇది ఆ పార్టీకి పెద్ద దెబ్బే. పైగా.. పోటీలో ఉన్న‌వారు చిన్నా చిత‌కా నాయ‌కులు కాదు. మైనారిటీ వ‌ర్గాల్లో మంచి పేరు సంపాయించుకున్న‌వారే కావ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. ఆర్థికంగా కూడా బ‌లంగాఉన్న‌వారే.

ఒక్క ఢిల్లీనే కాదు.. గ‌త ఏడాది జ‌రిగిన మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ.. ఎంఐఎం ఇదే వ్యూహంతో ముందుకు సాగింది. ఒంట‌రిపోరునే ఎంచుకుంది. దీంతో అక్క‌డ కూడా చ‌తికిల ప‌డింది. మైనారిటీ వ‌ర్గాల‌కే ఇప్పుడు ఎంఐఎం దూరం అవుతున్న ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. దీనికి కార‌ణం.. పార్టీ త‌న వ్య‌వ‌స్థాగ‌త సిద్ధాంతాల‌ను వ‌దిలి పెట్టి.. బీజేపీతో మిలాఖ‌త్ కావ‌డం.. ఆ పార్టీ ప్రయోజ‌నాల‌కు గొడుగు ప‌డుతోంద‌న్న అపప్ర‌ద‌ను మూట‌గ‌ట్టుకోవ‌డం.

ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఢిల్లీలో 8 కీల‌క మైనారిటీ స్థానాల్లో బీజేపీ గెలిచిందంటే.. దీనికి కార‌ణం.. అక్క‌డి మైనారిటీ వర్గాలు.. ఎంఐఎం ను విశ్వ‌సించ‌క‌పోవ‌డ‌మేన‌న్న విశ్లేష‌ణ‌ల‌పై అస‌దుద్దీన్ మౌనం దాల్చారు. ఇక‌, మ‌హారాష్ట్ర‌లోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. ఎలా చూసుకున్నా.. గ‌త ప్రాభ‌వం కోల్పోతున్న ప‌రిస్థితి అయితే క‌ళ్ల‌కు క‌డుతోంది. ``ఒక‌ప్పుడు మ‌జ్లిస్ వేరు. ఇప్పుడు వేరు`` అనే టాక్ సొంత నేత‌ల నుంచే వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇదే బ‌ల‌ప‌డితే.. పార్టీ అస్తిత్వానికే పెను ప్ర‌మాదం ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News