న్యూ లుక్ లో ఎయిర్ ఇండియా ఫ్లైట్స్... పిక్స్ వైరల్!
ఇందులో భాగంగా... ఇటీవల సంస్థ లోగోలో మార్పులు చేసిన టాటా గ్రూప్... ఎయిర్ క్రాఫ్ట్ లివరీ లోనూ మార్పులు చేసింది.
ఎయిర్ ఇండియా ను కొనుగోలు చేసిన నాటి నుంచి వివిధ మార్పులకు శ్రీకారం చుడుతోంది టాటా గ్రూప్. ఇందులో భాగంగా... ఇటీవల సంస్థ లోగోలో మార్పులు చేసిన టాటా గ్రూప్... ఎయిర్ క్రాఫ్ట్ లివరీ లోనూ మార్పులు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా మార్పు చేసిన తన విమానం ఫస్ట్ లుక్ ను ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
అవును... ఫ్రాన్స్ లోని టౌలౌస్ లోని పెయింట్ షాప్ లో పార్క్ చేసిన తన ఏ350 విమానం ఫోటోలను ఎయిర్ ఇండియా పోస్ట్ చేసింది. ఈ వింటర్ సీజన్ లో ఈ విమానం భారత్ కు చేరుకోనుందని వెల్లడించింది. "టౌలౌస్ లోని పెయింట్ షాప్ లో మా కొత్త లివరీలో ఏ350 ఫస్ట్ లుక్ ఇదిగో ఉంది. మా ఏ350 లు ఈ శీతాకాలంలో ఇంటికి రావడం ప్రారంభిస్తాయి" అని ఎయిర్ ఇండియా ఎక్స్ లో పేర్కొంది.
"ద విస్టా"గా వ్యవహరించే కొత్త లోగోలో పసిడి వన్నె మహారాజా మస్కట్ విండో ఫ్రెం ను ఉంచారు. ప్రగతిశీలత, భవిష్యత్తుపై విమానయాన సంస్థకు ఉన్న విశ్వాసం, ధైర్యానికి సంకేతంగా ఈ కొత్త లోగోను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఇందులో భాగంగా.. కొత్త లోగోను ఆవిష్కరించిన టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఈ కొత్త లోగో అపరిమిత అవకాశాలను సూచిస్తుంది అని తెలిపారు.
లోగోలో ఎయిరిండియా ఫాంట్ ను కూడా మార్చారు. దీనికోసం సొంతంగా "ఎయిర్ ఇండియా శాన్స్" అనే ఫాంట్ ను డిజైన్ చేశారు. అదేవిధంగా... ఎరుపు, ఊదారంగు, గోల్డ్ కలర్ డిజైన్ లతో విమానాల డిజైన్ ను మార్చారు. ఈ విధంగా ఎయిర్ ఇండియా తొలి ఏ350 విమానాన్ని నయా లుక్ లో తీర్చిదిద్దారు.
ఈ సందర్భంగా... తమ పాత విమానాలన్నింటినీ కూడా ఈ కొత్త డిజైన్ లోకి మార్చనున్నట్లు సంస్థ తెలిపింది. దీనికోసం సుమారు 400 మిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకూలంగా జరిగితే... ఈ ఏడాది డిసెంబరు నుంచి కొత్త లోగోతో విమాన సర్వీసులు మొదలుకానున్నాయి.
కాగా... టాటా సన్స్ ఎయిర్ ఇండియాను జనవరి 2022లో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం... ఎయిర్ ఇండియా, టాటా సన్స్ మరొక అనుబంధ సంస్థ విస్తారా ను విలీనం చేసింది. ఫలితంగా మరింత ఏకీకృత సంస్థను రూపొందించనున్నట్లు ప్రకటించింది. ఈ విలీనం మార్చి 2024 నాటికి పూర్తవుతుందని అంచనా వేశారు.