జగన్ ధర్నాకు అఖిలేష్ యాదవ్ సపోర్ట్... హస్తినలో సరికొత్త చర్చ!

ప్రధానంగా వినుకొండ ఘటన వీడియో చూసి అఖిలేష్ షాకైనట్లు చెబుతున్నారు. అనంతరం అఖిలేష్ యాదవ్ మాట్లాడారు.

Update: 2024-07-24 07:59 GMT

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచీ ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయని, భయానక వాతావరణం నెలకొందని అంటూ వైసీపీ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో వీరికి నిరసనగా ఢిల్లీలో ధర్నా చేపట్టింది. ఈ ధర్నాకు సమాజ్ వాదీ పార్టీ సంఘీభావం తెలిపింది.

అవును... అటు ఎన్డీఏ కూటమికీ, ఇటు ఇండియా కూటమికీ చెందని వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీలో చేపట్టిన ధర్నాకు ఎవరి మద్ధతు లభిస్తుంది అనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా జరిగింది. అయితే... ఢిల్లీలో జగన్ చేపట్టిన ధర్నాకు సమాజ్ వాదీ పార్టీ అధినేత, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సంఘీబావం తెలిపారు.

ఈ సందర్భంగా ఏపీలో అరాచకాలు జరిగాయంటూ వైసీపీ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను అఖిలేష్ యాదవ్ కు జగన్ చూపించి, వివరించారని తెలుస్తుంది! ప్రధానంగా వినుకొండ ఘటన వీడియో చూసి అఖిలేష్ షాకైనట్లు చెబుతున్నారు. అనంతరం అఖిలేష్ యాదవ్ మాట్లాడారు.

ఇందులో భాగంగా... ప్రజాస్వామ్యంలో బుల్డోజర్ సంస్కృతి మంచిది కాదని చెప్పిన అఖిలేష్... విపక్షాలే లక్ష్యంగా పాలక పక్షాలు దాడులకు పాల్పడటం సరైన చర్య కాదని అన్నారు. ప్రజాస్వామ్యంలో అధికార మార్పిడి సర్వసాధారణమైన విషయమని.. ఈరోజు చంద్రబాబు సీఎంగా ఉండోచ్చు, రేపు మళ్లీ జగన్ అధికారంలోకి రావొచ్చని అఖిలేష్ చెప్పుకొచ్చారు.

ఇక ఉత్తరప్రదేశ్ లో కూడా బుల్డోజర్ పాలనే సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేసిన అఖిలేష్ యాదవ్... తాను బుల్డోజర్ సంస్కృతికి పూర్తిగా వ్యతిరేకమని అన్నారు. ఇదే సమయంలో... ఏ పార్టీకి అయినా కార్యకర్తలే బలమని, వారిని కాపాడుకోవడానికి జగన్ పోరాటం చేస్తున్నారని తెలిపారు.

కాగా... ఇండియా కూటమిలో సమాజ్ వాదీ పార్టీ కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ పార్టీకి లోక్ సభలో 37, రాజ్యసభలో ముగ్గురు ఎంపీలు ఉన్నారు. అలాంటి అఖిలేష్ యాదవ్.. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన జగన్ ధర్నాకు మద్దతు ఇవ్వడం జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుందని అంటున్నారు.

మరోపక్క... వైసీపీ చేపట్టిన ధర్నాకు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐ.యూ.ఎం.ఎల్) కూడా మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆ పార్టీ ఎంపీ వహాబ్... ప్రభుత్వ టెర్రరిజాన్ని సహించమని.. వైసీపీ ఎంపీలతో కలిసి రాజకీయ టెర్రరిజంపై పోరాడతామని.. ఈ విషయంలో జగన్ కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు!

Full View
Tags:    

Similar News