ఆళ్ళ నాని సైకిలెక్కేస్తున్నారా ?
ఆళ్ల నాని మొదట తన పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఆ తరువాత ఆయన ఏకంగా వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి ఒకనాడు పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చిన మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్ కుటుంబానికి వీర విధేయుడు అయిన ఆళ్ళ నాని వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన చాలా సైలెంట్ గానే పొలిటికల్ గా ప్రకంపనలు సృష్టించారు. ఆళ్ల నాని మొదట తన పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఆ తరువాత ఆయన ఏకంగా వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఈ విధంగా ఆళ్ల నాని ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారారు. మరీ ముఖ్యంగా గోదావరి జిల్లాలలో ఆయన రాజీనామాలు సంచలనం రేపాయి. ఆళ్ళ నాని తాను వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లుగా చెప్పారు. ఒక విధంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటారని చర్చ కూడా నడిచింది.
అయితే ఇపుడు మరో ప్రచారం సాగుతోంది. ఆళ్ల నాని చూపు టీడీపీ వైపు ఉందనేదే ఆ పొలిటికల్ టాక్. ఆళ్ల నాని పక్కా కాంగ్రెస్ వాది. ఆయన రాజకీయ జీవితం కాంగ్రెస్ నుంచే మొదలైంది. ఆ తరువాత వైసీపీ వైపుగా టర్న్ తీసుకుంది. మూడు సార్లు ఎమ్మెల్యేగా ఒక సారి ఎమ్మెల్సీగా ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆళ్ల నాని ది రెండున్నర దశాబ్దాల రాజకీయ జీవితం.
ఆయన అయిదున్నర పదుల వయసులో ఉన్నారు. ఆయన ఇంకా రాజకీయం చేసే సత్తా కలిగి ఉన్నారు. దాంతో ఆళ్ల ఏదో ఒక పార్టీలో చేరాలని అనుచరుల ఒత్తిడిగా ఉంది. ఆళ్ల నాని జనసేనలో చేరుతారు అని ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగింది. కానీ ఆళ్ల నాని లేటెస్ట్ డెసిషన్ టీడీపీ వైపే అని మరో ప్రచారం మొదలైంది.
టీడీపీలో బలమైన బడేటి కుటుంబం ఉంది. ఆ కుటుంబానికి సంబంధించి బడేటి రామారావు 2014లో గెలిచారు. 2019లో ఆయన ఓటమి చెందారు. ఇక 2024లో అదే కుటుంబం నుంచి బడేటి రాధాకృష్ణయ్య రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యారు. గత దశాబ్దన్నర కాలంలో బడేటి ఆళ్ల ఫ్యామిలీల మధ్యనే రాజకీయ సమరం సాగుతోంది.
బడేటి ఫ్యామిలీ టీడీపీలో స్ట్రాంగ్ గా ఉన్న వేళ ఆళ్ల ఆ పార్టీలోకి వెళ్తే లభించే ప్రాముఖ్యత ఏమిటి అన్న చర్చ ఉంది. అయితే టీడీపీ అధినాయకత్వం నుంచి తగిన హామీ ఉంటే టీడీపీలో చేరడమే బెటర్ అన్న చర్చ కూడా ఉందిట.
మరో వైపు చూస్తే తాజాగా రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన మోపిదేవి వెంకట రమణ కూడా టీడీపీ వైపే చూస్తున్నారు. ఈ ఇద్దరూ కలసే టీడీపీ తీర్ధం పుచ్చుకుంటారు అని ఒక చర్చ సాగుతోంది. మొత్తం మీద చూస్తే ఆళ్ళ నాని టీడీపీలో చేరడం మూలంగా ఏలూరు నియోజకవర్గంలో టీడీపీ వెరీ స్ట్రాంగ్ అవుతుంది అన్న అంచనాలు ఉన్నాయి. అదే టైం లో వైసీపీ అనాధగా మారుతుందని కూడా అంటున్నారు. ఏది ఏమైనా అధికార టీడీపీలోకి వలసల పర్వం గోదావరి జిల్లాలలో మరిన్ని ఉంటాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.