మోడీ, షా మాటలన్నీ ఉత్త సొల్లేనా ?

ఇంతకీ అమిత్ ఏమి చెప్పారంటే తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి రాగానే కేసీయార్ ఫ్యామిలి మొత్తాన్ని జైలుకు పంపుతుందట.

Update: 2023-11-22 07:00 GMT

ఆచరణ సాధ్యంకాని, జరగని పనిగురించి మాట్లాడటాన్ని జనాలు ఉత్త సొల్లు అనే అంటారు. ఇపుడీ విషయం ఎందుకంటే తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పిన మాటలు సొల్లుగా ఉన్నాయనే టాక్ పెరిగిపోతోంది. ఇంతకీ అమిత్ ఏమి చెప్పారంటే తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి రాగానే కేసీయార్ ఫ్యామిలి మొత్తాన్ని జైలుకు పంపుతుందట. కేసీయార్ తో పాటు కుటుంబం పాల్పడిన అవినీతిపై ప్రత్యేకంగా కమిటి వేస్తారట.

కరప్షన్ చేయటంలో దేశంమొత్తంమీద కేసీయార్ నెంబర్ వన్ అని అమిత్ షా తేల్చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో భారీ కుంభకోణాలు జరిగినట్లు అమిత్ ఆరోపించారు. అవినీతికి పాల్పడిన కేసీయార్, కుటుంబాన్ని జైలుకు పంపేంతవరకు బీజేపీ ప్రభుత్వం ఊరుకోదని అమిత్ చాలా గొప్పగా చెప్పారు. ఇక్కడే అమిత్ చెప్పిందంతా సొల్లని అందరికీ అర్ధమైపోయింది. ఎలాగంటే కేసీయార్ అవినీతికి పాల్పడినట్లు గతంలో స్వయంగా నరేంద్రమోడీనే చెప్పారు. నిజంగానే కేసీయార్ అవినీతికి పాల్పడి ఉంటే మరి కేంద్రప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు.

కేసీయార్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపేందుకు కేంద్రప్రభుత్వానికి కావాల్సినంత అవకాశముంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతంటారు, మేడిగడ్డ బ్యారేజి నిర్మాణంలో అవినీతంటారు. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణంలో కేంద్రప్రభుత్వం పాత్ర కూడా ఉంది. కాబట్టి ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని నిజంగానే ఆధారాలుంటే వెంటనే సీబీఐతో విచారణ చేయించచ్చు. కానీ మోడీ అయినా అమిత్ అయినా కేవలం బెదిరింపులు, ఆరోపణలకు మాత్రమే పరిమితమవుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత సూత్రదారిగా ఈడీ కోర్టులో రిమాండు రిపోర్టులోనే చాలాసార్లు ప్రస్తావించింది.

లిక్కర్ స్కామ్ లో ఈడీ చెప్పింది నిజమే అయితే కవితను ఎందుకు అరెస్టుచేయలేదు ? కవితను ఈడీ అరెస్టు చేసుంటే తెలంగాణాలో బీజేపీ పరిస్ధితి వేరే విధంగా ఉండేది. బీజేపీ, బీఆర్ఎస్ రెండింటి మధ్య లోపాయికారీ ఒప్పందాలు జరిగాయన్న కాంగ్రెస్ ఆరోపణలను జనాలు కూడా నమ్ముతున్నారు. అందుకనే బీజేపీ గ్రాఫ్ పడిపోయింది. కాబట్టి కేసీయార్ ను జైల్లో పెడతాం, కుటుంబాన్ని ఖైదుచేస్తాం అని మోడీ, అమిత్ చెబుతున్నదంతా సొల్లని జనాలు ఎప్పుడో డిసైడ్ అయిపోయారు.

Tags:    

Similar News