ఒక్క వీడియో బన్నీపై వ్యతిరేకత పెంచిందా?
ఈ సంఘటనకు బాధ్యుడిని చేస్తూ హీరో అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం, ఆ వెంటనే బెయిల్ రావడం, బెయిల్ వచ్చినా ఒక రోజు జైలులో గడపాల్సిరావడంతో హీరోపై సానుభూతి పెంచింది.
పుష్ప సినిమా రిలీజై ఎంతటి సంచలనం సృష్టించిందో.. ఆ సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్లో చోటుచేసుకున్న తొక్కిసలాట సంఘటన అంతకుమించిన సంచలనంగా మారింది. ఈ సంఘటనకు బాధ్యుడిని చేస్తూ హీరో అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం, ఆ వెంటనే బెయిల్ రావడం, బెయిల్ వచ్చినా ఒక రోజు జైలులో గడపాల్సిరావడంతో హీరోపై సానుభూతి పెంచింది. అయితే ఈ ఎపిసోడ్ పై అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత, అల్లు అర్జున ప్రతిస్పందించడం, ఆయనకు కౌంటర్ గా తెలంగాణ పోలీసులు పది నిమిషాల నిడివిగల వీడియోను రిలీజ్ చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత వచ్చిందని విశ్లేషణలు వినిపిస్తున్న సమయంలో ఈ వివాదం చోటుచేసుకుంది. అల్లు అర్జున్ ను అరెస్టును బీఆర్ఎస్, వైసీపీతోపాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఖండించడం, పలువురు కేంద్ర మంత్రులు అల్లు అర్జున్ కు బాసటగా నిలిచేలా ప్రకటనలు చేయడంతో అల్లు అర్జున్ కు నైతిక మద్దతు లభించినట్లైంది.
అయితే ఈ వివాదంపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. తొక్కిసలాటలో తన అభిమాని చనిపోయారని సమాచారమిస్తే, అయితే సినిమా హిట్టు అయినట్లేనని హీరో అర్జున్ వ్యాఖ్యానించినట్లుగా జరిగిన ప్రచారాన్ని సామాన్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే సమయంలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అల్లు అర్జున్ రోడ్ షో చేయడం వల్ల, ఒకేసారి పది వేల మంది జనం థియేటర్లోకి చొచ్చుకురావడం వల్ల పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారని వివరణ ఇచ్చారు.
హీరో థియేటర్లో ఉన్నప్పుడు కూడా ఆయనతో షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు బాల్కానిపైకి ఎగబడ్డారని, ఆ సమయంలోనే రేవతి మరణించడం, ఆమె కుమారుడు అపస్మారకస్థితికి వెళ్లిపోయినట్లు చెప్పారు. ఈ సంఘటనపై పోలీసులు చెప్పినా, హీరో వినిపించుకోలేదని, థియేటర్ మేనేజ్మేంట్ హీరోను కలిసేందుకు అనుమతించలేదని అసెంబ్లీలో ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి.
అయితే దీనికి కౌంటర్గా అదే రోజు మీడియాతో మాట్లాడిన హీరో అర్జున్ తనకు పోలీసులు ఏ విషయం చెప్పలేదని, రేవతి మరణించినట్లు మరునాడు తెలిసిందని చెప్పారు. అంతేకాకుండా తాను రోడ్ షో చేయలేదని సీఎం ఆరోపణలను ఖండించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి తప్పు ఎక్కడ జరిగింది? బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది ఎవరు? అన్న విషయాలను పూసగుచ్చినట్లు వివరిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవ్వడమే కాకుండా, అల్లు అర్జున్ రోడ్ షో చేసుకుంటూ వచ్చినట్లు ధ్రువీకరించింది.
తెలంగాణ పోలీసులు రిలీజ్ చేసిన వీడియోతో ఇప్పుడు పుష్పపై స్పందనలు, ప్రతిస్పందనల తీరు మారిపోయింది. తొక్కిసలాటకు అల్లు అర్జున్ ను బాధ్యుడిని చేయడమేంటని నిలదీసిన స్వరాలు తగ్గిపోగా, ఆయనకు వ్యతిరేకంగా నిరసన స్వరాలు ఎక్కువవుతున్నాయి. ఆదివారం ఓయూ జేఏసీ నేతలు హీరో ఇంటి ముందు ధర్నాకు దిగడం ఇందులో భాగమనే చెబుతున్నారు. ఇదే సమయంలో ఏడాది పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఏర్పడిన అసంతృప్తికి కాస్త బ్రేక్ పడిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చట్టం ముందు ఎవరైనా సమానమనే విధంగా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని తటస్థులు ప్రశంసిస్తున్నారు.
పుష్ప వివాదంతో చాలా ప్రజాసమస్యలు పక్కకుపోయాయని అంటున్నారు. ఈ ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాలేదని చర్చ జరుగుతున్న సమయంలో అల్లు అర్జున్ వివాదం మొత్తం సీన్ మార్చేసింది. ప్రతిపక్షాలు సైతం పుష్ప ఎపిసోడ్ పైనే చర్చించడంతో ముఖ్యమంత్రి కూడా ఇందులో ప్రభుత్వం తప్పేమీ లేదని నిరూపించుకునేందుకు సంధ్య థియేటర్ వద్ద ఉన్న సీసీ పుటేజీని, స్థానికులు పోలీసులు సెల్ ఫోన్ ద్వారా చిత్రీకరించిన విజువల్స్ ను చక్కగా వాడుకున్నారు. వన్ షాట్ టూ బర్డ్స్ అన్నట్లు ఏడాది పాలనపై వ్యతిరేకతను అధిగమించడంతోపాటు తాను అనుకున్నది చేయగలనని నిరూపించారు సీఎం రేవంత్ రెడ్డి.