సత్తెనపల్లికి సెలవంటూ భారంగా అంబటి
వైసీపీలో పెద్ద గొంతుక అంబటి రాంబాబుది. ఆయన వైఎస్సార్ కుటుంబానికి వీర విధేయుడు. ఆయన మొదట వైఎస్సార్ వెంట ఆ తరువాత జగన్ వెంట నడిచారు.
వైసీపీలో పెద్ద గొంతుక అంబటి రాంబాబుది. ఆయన వైఎస్సార్ కుటుంబానికి వీర విధేయుడు. ఆయన మొదట వైఎస్సార్ వెంట ఆ తరువాత జగన్ వెంట నడిచారు. జగన్ కాంగ్రెస్ నుంచి వేరు పడినప్పుడు ఆయనతో తన రాజకీయ ప్రయాణం ఏ విధంగా సాగుతుందో కూడా అర్ధం కానపుడు సైతం నడచిన తొలి సైనికుడుగా అంబటి రాంబాబుకు పేరుంది.
ఆయన గెలిచినా ఓడినా వైసీపీని అట్టేబెట్టుకుని కొనసాగే నాయకుడు. ఇక గత ఏడాది పార్టీ ఓటమి పాలు అయ్యాక అంబటి పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఈ రోజుకీ సామాజిక మాధ్యమాల ద్వారా అధికార కూటమి మీద నేరుగా విమర్శలు చేస్తూ వస్తున్నారు.
అటువంటి అంబటికి ఆయన మూడు సార్లు వైసీపీ నుంచి పోటీ చేసిన సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంతో రుణం తీరిపోయింది అని అంటున్నారు. ఆయన 2014లో వైసీపీ నుంచి పోటీ చేస్తే 924 ఓట్ల తేడాతో ఓడారు. ఇక 2019లో అదే సీటు నుంచి 20 వేల 876 ఓట్ల తేడాతో గెలిచారు. ఇక 2024లో ఏకంగా 27 వేల 836 ఓట్ల తేడాతో ఓటమిని చూశారు
ఇలా సత్తెనపల్లి ఆయనకు మూడు రకాల అనుభవాన్ని మిగిల్చింది. సత్తెనపల్లిలో అంబటి రాంబాబు సామాజిక వర్గం బాగానే ఉంది. ఆయనకంటూ ఒక బలమైన అనుచర గణం ఉంది. అయితే ఆయనను వ్యతిరేకించే వారూ ఎక్కువగానే ఉన్నారు. ఇక ఎన్నికలకు ముందే అంబటిని ఈ సీటు నుంచి తప్పించాలని ప్రయత్నాలు జరిగాయి. ఒక దశలో ఆయనను వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని కూడా అధినాయకత్వం చూసింది అని అంటారు.
ఏదైతేనేమి అంబటికి సత్తెనపల్లి టికెట్ అయితే దక్కింది కానీ విజయం మాత్రం వరించలేదు. ఆయన మొత్తం మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో రెండే రెండు సార్లు గెలిచారు. ఒకసారి రేపల్లె నుంచి మరోసారి సత్తెనపల్లె నుంచి.
ఏడు పదులకు చేరువలో ఉన్న అంబటికి 2024 ఎన్నికలే చివరిని అని అన్న వారూ ఉన్నారు. అయితే ఆయన గుంటూరు జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ గా ప్రస్తుతం ఉన్నారు. రాజకీయంగా యాక్టివ్ గా ఉన్నారు. ఆయనను తప్పించి సత్తెనపల్లిలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని వైసీపీ నిర్ణయించిన నేపథ్యంలో పార్టీ కార్యకర్తల సమావేశం పెట్టిన అంబటి భారంగానే మాట్లాడారు.
తాను అధినాయకత్వానికి విధేయుడిని అని ఆయన మరోసారి ప్రకటించుకున్నారు. తాను పార్టీ నిర్ణయాన్ని శిరసా వహిస్తాను అన్నారు. అయితే తాను ఏ తప్పూ చేయలేదని ఆయన చెప్పారు. తనకు సత్తెనపల్లి, కార్యకర్తలను వదిలి వెళుతున్నందుకు బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వైఎస్సార్ కుటుంబ విధేయుడిగా జగన్ ఆదేశాలను శిరసా వహిస్తానని ఆయన చెప్పుకొచ్చారు.
తాను మాట తప్పేది లేదని తప్పు చేసినది కూడా లేదని అంబటి ఒకింత ఎమోషనల్ అయి కామెంట్స్ చేశారు. మొత్తానికి చూస్తే సత్తెనపల్లితో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు రుణం తీరినట్లే అంటున్నారు మరి ఆయన రాజకీయం ఏ తీరున ముందుకు సాగుతుందో చూడాల్సి ఉంది.