పట్టపగలు పాతిక కోట్ల దోపిడీ, ఎన్ కౌంటర్!... సంచలన వీడియో!
అవును... బీహార్ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని తాజాగా మరోసారి కళ్లకు కట్టినట్లు చూపించే ఘటన తాజాగా జరిగింది.;
పట్టపగలు, పోలీస్ స్టేషన్ కు సమీపంలో ఓ బంగారు దుకాణంలో దోపిడీ జరిగింది. పట్టపగలు దుకాణంలోకి చొరబడిన దుండగులు.. అక్కడున్న సిబ్బందిని తుపాకీతో బెదిరించారు.. భారీ ఎత్తున బంగారం దోచుకుని దర్జాగా వెళ్ళిపోయారు! ఆ తర్వాత పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సంచలనంగా మారింది.
అవును... బీహార్ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని తాజాగా మరోసారి కళ్లకు కట్టినట్లు చూపించే ఘటన తాజాగా జరిగింది. దీనికి సంబంధించిన వీడియో.. ఏదో సినిమా షూటింగ్ తరహాలోనిది అన్నట్లుగా అనిపిస్తుందని చెబుతున్నా.. ఇది పట్టపగలు జరిగిన ఓ దోపిడీ ఘటనకు సంబంధించిందని తెలియడంతో నెటిజన్లు షాకవుతున్నారు.
బీహార్ రాష్ట్రంలోని అర్రాలోగల తనిష్క్ స్టోర్ లో ఈ ఘటన జరిగింది. ఈ తాజా ఘటన.. అక్కడి వ్యాపారుల భయాందోళనలను మరోసారి బహిర్గతం చేస్తోందని చెబుతున్నారు. ఈ ఘటన జరిగిన ప్రదేశానికి సమీపంలోనే పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ.. దోపిడీ మొత్తం జరిగి, దుండగులు పారిపోయిన తర్వాతే పోలీసులు రావడంపైనా విమర్శలు వస్తున్నాయని అంటున్నారు.
ఈ విషయాలపై స్పందించిన భోజ్ పూర్ ఎస్పీ రాజ్... సోమవారం గోపాలి చౌక్ లోని తనిష్క్ షోరూమ్ తెరిచిన అనంతరం ఆరుగురు వ్యక్తులు లోపలికి వచ్చారని తెలిపారు. వారిలో ఇద్దరు ఉదయం 10:30 గంటల ప్రాంతంలో కస్టమర్లుగా నటిస్తూ ప్రవేశించారని.. మిగిలినవారు కాసేపటి తర్వాత ఎంటరయారని వివరించారు.
ఈ సమయంలో... ఆ వ్యక్తులు గార్డును కొట్టి, అతడి నుంచి తుపాకీ లాక్కుని, ఇద్దరు సిబ్బందిపై దాడి చేసి, దుకాణంలోని షట్టర్లను దించారని.. అనంతరం పిస్టల్ బయటకు తీసి, షోరూమ్ సిబందిని, కస్టమర్లను ఓ మూలకు చుట్టుముట్టారని.. తర్వాత షెల్ఫ్ లు, డిస్ ప్లే యూనిట్ల నుంచి నగలు తీసి బ్యాగుల్లోకి వేసుకున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా స్పందించిన షోరూమ్ మేనేజర్ కుమార్ మృత్యుంజయ్... ఈ సమయంలో ఓ ఉద్యోగి 112 పోలీస్ నెంబర్ కు కాల్ చేశాడని.. అయితే వారు వెంటనే స్పందించలేదని వెల్లడించారు.
అయితే... ఘటన అనంతరం అలర్ట్ అయిన పోలీసులు పెట్రోలింగ్ సిబ్బందిని అలర్ట్ చేశారు. ఈ సమయంలో బైక్ పై వెళ్తోన్నవారిని వెంబడించారు. ఈ సమయంలో బైకర్లలో ఒకరు పోలీసులపై కాల్పులు జరిపారని.. దీంతో.. పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో ఇద్దరు గాయపడ్డారని.. వారిని అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు.
ఈ సమయంలో వారి నుంచి ఇద్దరు అనుమానితులు, రెండు పిస్టళ్లు, రెండు పెద్ద పెద్ద బ్యాగుల్లో దోచుకున్న ఆభరణాలు, ఒక పల్సర్ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. మిగిలినవారి కోసం ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయని ఎస్పీ తెలిపారు. అరెస్తైనవారిని సరన్ జిల్లాలోని దిగ్వారాకు చెందిన విశాల్ గుప్తా, సోనేపూర్ లోని సెమ్రాకు చెందిన కునాల్ గా గుర్తించారు.
ఇక ఈ ఘటన అనంతరం బీహార్ లోని శాంతిభద్రతలపై ప్రతిపక్షాలు మరోసారి విరుచుకుపడ్డాయి. బీహార్ లో శాంతిభద్రతలు ఏ స్థాయిలో దిగజారిపోయాయని చెప్పడానికి పరిస్థితికి ఇంతకు మించిన ఉదాహరణ ఉంటుందా అని ఫైరవుతున్నాయి. ఈ ఏడాది చివర్లో ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.