'మీకు అలుపొస్తాదేమో.. నాకు ఊపొస్తాది'.. ట్రంప్ తగ్గడం లేదు!
తాజాగా ఉక్కు, అల్యూమినియంపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే.;
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి సుంకాల విషయంలో ట్రంప్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆ దేశం, ఈ దేశం అనే తారతమ్యాలేమీ లేకుండా సుంకాలు విధిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ సమయంలో ట్రంప్ కు ఐరోపా కూటమి (ఈయూ) షాకిచ్చింది. అయితే... సుంకాలు పెంచే కొద్దీ మీకు అలుపొస్తాదేమో.. నాకు మాత్రం ఊపొస్తాది అన్నట్లుగా ట్రంప్ స్పందిస్తున్నారు.
అవును... తాజాగా ఉక్కు, అల్యూమినియంపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో... యూరోపియన్ యూనియన్ స్పందించింది. ట్రంప్ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే అమెరికాపై 28 బిలియన్ డాలర్ల సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో... ఈయూ తాజా నిర్ణయంపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.
వివరాల్లోకి వెళ్తే.. అల్యూమినియం, ఉక్కుపై పాతిక శాతం సుంకాలు అమల్లోకి వచ్చాయని ట్రంప్ బుధవారం ప్రకటించారు. ఈ తాజా నిర్ణయం వల్ల అమెరికాలోని ఇండస్ట్రీస్ లో స్థానికులకు ఉద్యోగాలు వస్తాయని ఆయన తెలిపారు. దీంతో... అమెరికా 28 బిలియన్ డాలర్ల సుంకాలను విధించిందని.. అందువల్ల తాము అదే స్థాయిలో దానిపై $28 బిలియన్ సుంకాన్ని విధిస్తున్నామని ఈయూ తెలిపింది.
ఈ మేరకు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్ లెయెన్ ప్రకటించారు. ఈ సుంకాలు.. అల్యూమినియం, ఉక్కుతో పాటు దుస్తులు, గృహోపకరణాలు, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ పై కూడా వర్తిస్తాయని.. అవి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. ఇదే సమయంలో.. అమెరికాపై 20 బిలియన్ డాలర్ల సుంకాలను విధిస్తున్నట్లు కెనడా ప్రకటించింది.
ఈ సమయంలో స్పందించిన డొనాల్డ్ ట్రంప్... వాళ్లు మా దగ్గర ఎంత వసూలు చేస్తే.. తాము కూడా వాళ్ల దగ్గర నుంచి అంతే వసూలు చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా... యూరోపియన్ యూనియన్ వస్తువులపై మరిన్ని సుంకాలు విధిస్తామని, ప్రపంచ వాణిజ్య యుద్ధాన్ని తెస్తామని ట్రంప్ హెచ్చరించారు. త్వరలో రాగిపైనా సుంకాలు ఉంటాయని వెల్లడించారు!