బీహార్ సీఎం నితీష్ కి ఏమైంది...ఆ ప్రచారం వెనక ?
బీహార్ ని గత రెండు దశాబ్దాలుగా నిరాటంకంగా పాలిస్తున్నారు జేడీయూ అధినేత ముఖ్యమంత్రి నితీష్ కుమార్.;
బీహార్ ని గత రెండు దశాబ్దాలుగా నిరాటంకంగా పాలిస్తున్నారు జేడీయూ అధినేత ముఖ్యమంత్రి నితీష్ కుమార్. ఆయన మేధావి రాజకీయ నేతగా గుర్తింపు పొందారు. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్, సోషలిస్ట్ నేత రాం మనోహర్ లోహియాల ప్రభావంతో డెబ్బై దశకంలో రాజకీయ రంగ ప్రవేశం చేసిన నితీష్ చట్ట సభలలో ప్రవేశించింది 1985 నుంచి మాత్రమే.
ఆయన ఎమ్మెల్యేగా ఎంపీగా ఎమ్మెల్సీగా అనేకసార్లు పనిచేశారు. కేంద్రంలో రైల్వే వంటి కీలక శాఖలకు మంత్రిగా సమర్ధంగా వ్వవహరించి వాజ్ పేయి వంటి ఉద్ధండున మన్ననలు అందుకున్నారు. నిజానికి నితీష్ కి ఈ దేశానికి ప్రధాని అయ్యే నాయకత్వ లక్షణాలు ఉన్నాయని అంతా భావిస్తారు.
అయితే రాజకీయ లెక్కలు చిక్కుల వల్ల ఆయనకు ఆ అవకాశం అయితే దక్కడం లేదు. ఎన్డీయేలో ఆయనే తదుపరి ప్రధాని అని 2014 కి ముందు ప్రచారం సాగింది. అయితే గుజరాత్ నుంచి నరేంద్ర మోడీ అనూహ్యంగా రంగ ప్రవేశం చేయడంతో నితీష్ ఆశలు అవకాశాలూ పూర్తిగా పక్కకు పోయాయి.
ఆయన ఇండియా కూటమి ఏర్పాటులో కీలకమైన పాత్ర పోషించారు. ఆ కూటమికి కన్వీనర్ గా ఉండాలని అనుకున్నారు. కానీ ఇండియా కూటమి పార్టీలలో కొన్ని ఆయన ఎదుగుదలకు బ్రేకులు వేయడంతో తిరిగి ఎన్డీయేను ఆశ్రయించారు. ఇక ఈ ఏడాది అక్టోబర్ లో జరిగే బీహార్ శాసనసభ ఎన్నికల్లో జేడీయూ బీజేపీల కూటమిని మరోసారి గెలిపించాలని నితీష్ తన వంతుగా కృషి చేస్తున్నారు.
ఈ క్రమంలో నితీష్ మీద వింత విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. ఆయన మీద రాజకీయ విమర్శల కంటే వ్యక్తిగత విమర్శలే ఎక్కువగా ఉండడం విశేషం. అంతే కాదు నితీష్ ప్రవర్తన సరిగ్గా లేదని బీహార్ లో ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ అంటోంది. ఆయన స్పృహ లేకుండానే పాలన చేస్తున్నారని ప్రతిపక్ష నాయకుడు అయిన తేజస్వి యాదవ్ ఘాటు విమర్శలే చేశారు. ఆయన బీహార్ ని పాలించేందుకు తగిన విధంగా లేరని ఫిట్ గా కూడా లేరని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక ఆయన తరచూ మహిళలను అవమానిస్తున్నారు అని తేజస్వి యాదవ్ విమర్శించారు. నితీష్ అందువల్ల వెంటనే తన పదవికి రాజీనామా చేసి ఏ ఆశ్రమానికైనా వెళ్ళాలని తేజస్వి సూచిస్తున్నారు. ఆయన అక్కడకు వెళ్తే విశ్రాంతి దొరుకుతుందని కూడా అంటున్నారు.
దీని కంటే ముందు ఎన్నికల వ్యూహకర్త జనసురాజ్ పార్టీ అధినేత అయిన ప్రశాంత్ కిశోర్ కూడా నితీష్ మానసికంగా చాలా అలసిపోయారని ఆయన బీహార్ ని పాలించే సామర్థ్యాన్ని కలిగి లేరని హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఈ తరహా విమర్శలు నితీష్ మీద ఏంటి అన్న చర్చ సాగుతోంది.
నిజంగా నితీష్ ఫిట్ గా లేరా, ఆయన మానసికంగా అలసిపోయారు అంటే అర్థం ఏమిటి అన్నది కూడా చర్చ సాగుతోంది. ఇక ఆయన స్పృహ లేకుండా పాలించడం ఏంటి అన్న దాని మీద విపక్షాలే తగిన వివరణ ఇచ్చి జవాబు చెప్పాలేమో. ఇవన్నీ చూస్తూంటే ఏడున్నర పదుల వయసులో ఉన్న నితీష్ ని రాజకీయంగా పనిచేసేందుకు తగిన వారు కారన్న భావను ప్రజలలోకి పంపుతున్నారా అన్నది అంతా ఆలోచిస్తున్నారు.
నితీష్ కుమార్ వయసు ప్రభావం వల్ల ఏమైనా ఒకటి రెండు సందర్భాలలో తడబడి ఉంటే ఉండొచ్చేమో అని అంటున్నారు. దేశంలో ఏడు పదులు దాటిన చాలా మంది సీఎం లలో కొందరు మరచిపోవడమో తడబాటు పడడమో జరుగుతూ ఉంటోంది. అది పెద్ద వ్యాధి కాదు, ప్రమాదం అంతకంటే కూడా కాదు.
మరి నితీష్ ని ఈ విధంగా కార్నర్ చేసి ఆయన వయసు అయిపోయిందని సీఎం గా ఇక పనిచేయలేరని జనంలోకి సంకేతాలు పంపించడం ద్వారా లాభపడాలని విపక్షాలు చూస్తున్నాయా లేక నిజంగానే నితీష్ మానసికంగా అలసిపోయి ఉన్నారా అన్నది చర్చగా ఉంది. మొత్తం మీద చూస్తే నితీష్ కుమార్ ని ముందు పెట్టి బీజేపీ అక్కడ రాజకీయంగా పాగా వేయాలని చూస్తోంది. రేపటి రోజున ఎండీయే గెలిస్తే విపక్షాల ఈ విమర్శలే బీజేపీకి ఆయుధంగా మారి నితీష్ ప్లేస్ లో బీజేపీ ముఖ్యమంత్రి వస్తారని అంటున్నారు. మరి వీటిని తిప్పికొట్టాల్సింది జేడీయూ నేతలే అని అంటున్నారు. ఏది ఏమైనా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి మీద ఈ తరహా విమర్శలు రావడం విశేషంగాన చెప్పాలి.