స్టాలిన్ టీం లో జగన్ ?
ఈ క్రమంలో దేశంలో ఉన్న రెండు బలమైన రాజకీయ శిబిరాలలో తాను ఏ వైపు అన్నది జగన్ మాత్రమే తేల్చుకోవాలని అంటున్నారు.;
ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ ను దేశంలోని ఇండియా కూటమి పక్షాలు తమతో కలుపుకోవాలని చూస్తున్నాయి. ఎందుకంటే ఆయన ఎన్డీయే అయితే బయటకు తెలిసి లేరు. ఇక ఏపీలో చూస్తే ఎన్డీయేతో దోస్తీ పరోక్షంగా చేయాలని చూసినా పరిస్థితులు అయితే అనుకూలించేలా లేవు.
ఇంకా విడమరచి చెప్పుకోవాలంటే 2014 నుంచి 2019 మధ్య జగన్ అవసరం బీజేపీకి ఉండేది. ఏపీలో బాబుకు యాంటీగా మరో పార్టీని ప్రోత్సహించడం ద్వారా ఆయనను తన నియంత్రణలో ఉంచుకునే వ్యూహంలో భాగంగానే జగన్ ని చేరదీశారు తప్ప అందులో బీజేపీకి ప్రత్యేకించి జగన్ మీద వైసీపీ మీద వేరే ప్రత్యేక అభిమానాలు లేవు అన్నది ఒక విశ్లేషణగా చెబుతారు.
ఇక 2019 నాటికి బాబు ఎటూ ఎదురుతిరిగి ఎన్డీయే కూటమి నుంచి వెళ్ళిపోయారు, పైగా ఓటమి పాలు అయ్యారు. దాంతో 22 ఎంపీ సీట్లు ఉన్న జగన్ బీజేపీకి మరింత రాజకీయ అవసరం అయ్యారనుకోవాలి. ఇక 2024 నాటికి చూస్తే ఏపీలో మూడు పార్టీలు కలసి కూటమిని కట్టాయి. అందులో జనసేనతో బీజేపీకి మంచి బంధమే ఉంది. బాబు కాదంటే జనసేనతో ముందుకు సాగాలన్న వ్యూహం కూడా ఉంది.
అంటే ఏపీలో పవన్ ఉన్నంతవరకూ జగన్ అవసరం అన్నది బీజేపీకి పడదు అని భావించాలి. పైగా పవన్ సినీ నటుడు, బలమైన సామాజిక నేపథ్యం ఉన్న వారు. బీజేపీ పట్ల విధేయత ఉంది. ఆయన కూడా హిందూత్వను అనుసరిస్తున్నారు. ఇలా ఎన్నో భావసారూప్యాలు కలగలసిన పవన్ తోనే బీజేపీ ప్రయాణం చేస్తుంది, ఏపీలో తన రాజకీయ గమ్యస్థానం చేరుకునేందుకు పవన్ తోనే బలమైన స్నేహ బంధాన్ని కొనసాగిస్తుంది అని అంటున్నారు.
ఇక జగన్ అవసరం బీజేపీకి లేదా అంటే బయట ప్రత్యర్థిగా ఆ పార్టీ ఉంది. బాబుకు వైసీపీ ఢీ కొట్టే పరిస్థితి వస్తే అపుడు బీజేపీ కూడా ఈ వైపు చూసే చాన్స్ ఉంటుంది. అంతవరకూ మాత్రం వైసీపీతో ఎలాంటి బంధాలు ఉండవనే అనుకోవాలని అంటున్నారు.
ఈ క్రమంలో దేశంలో ఉన్న రెండు బలమైన రాజకీయ శిబిరాలలో తాను ఏ వైపు అన్నది జగన్ మాత్రమే తేల్చుకోవాలని అంటున్నారు. దేశంలో ఎండీయేను వ్యతిరేకించే శక్తులన్నీ కలసి ఇండియా కూటమిగా కట్టాయి. అయితే జగన్ కాంగ్రెస్ ని కూడా ఎంతగానో వ్యతిరేకిస్తారు కాబట్టి ఆ కూటమి వైపు చూడడం లేదు అన్న చర్చ ఒకటి ఉంది.
అయితే ఇపుడు దక్షిణ భారతాన ఇండియా మిత్రులను సమీకరించే పనిలో తమిళనాడు సీఎం స్టాలిన్ చేస్తున్నారు. దానికి రాజకీయ కారణాల కంటే సౌత్ స్టేట్స్ అస్తిత్వం అన్న కీలకమైన విషయం ఉంది. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే కచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి.
ఆ విధంగా చూస్తే ఏపీకి మూడు ఎంపీ సీట్లు మాత్రమే పెరుగుతాయి. తమిళనాడులో రెండు మాత్రమే పెరుగుతాయి. తెలంగాణాలో కూడా రెండో మూడో అదనం అవుతాయి. కేరళ విషయం అయితే ఉన్నవి తగ్గిపోతాయని అంటున్నారు. కర్ణాటక మాత్రం కొన్ని సీట్లు మిగిలిన వాటి కంటే పెంచుకుంటుంది అన్నది ఒక అంచనా ఉంది.
ఈ క్రమంలో దక్షిణాది రాష్ట్రాలు అన్నీ ఐక్యంగా ఉండి కేంద్రంలోని బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అమలు చేయబోతున్న డీలిమిటేషన్ ని వ్యతిరేకించాలని స్టాలిన్ గట్టిగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన దక్షిణాది రాష్ట్రాల ఎండీయేతర రాజకీయ పార్టీల అధినేతలను ముఖ్యమంత్రులను పిలుస్తున్నారు.
ఈ నెల 22న చెన్నైలో జరితే దక్షిణ భారత అఖిలపక్ష నేతల సమావేశానికి హాజరు కావాలని జగన్ ని కోరుతూ తన మంత్రిని కూడా పంపించారు. ఈ మేరకు తాడేపల్లిలోని జగన్ కార్యాలయంలో తమిళనాడు మంత్రి ఈవీ వేలు, ఎంపీ విల్సన్ భేటీ అయి ఈ సమావేశం గురించి వివరించారు. అంతే కాదు జగన్ ని తప్పనిసరిగా హాజరు కావాలని స్టాలిన్ తరఫున ఆహ్వానించారు.
అంతే కాదు స్టాలిన్ జగన్ కి రాసిన లేఖను కూడా ఆయనకు అందచేశారు. దీంతో వైసీపీ విషయంలో ఇది కీలకమైన విషయంగా మారుతోంది. ఈ మీటింగ్ కి జగన్ హాజరైనా హాజరు కాకపోయినా అది రాజకీయంగా సంచలనమే అవుతుంది అని అంటున్నారు. ఆయన హాజరైతే ఇండియా కూటమికి దగ్గర అవుతున్నారు అని వార్తలు వస్తాయి. హాజరు కాకపోతే ఇంకా బీజేపీ వైపే ఉన్నారని కూడా విమర్శలు వస్తాయి. మొత్తానికి వైసీపీ ఈ విషయంలో తేల్చుకోవాల్సి ఉంది. జాతీయ రాజకీయాల్లో ఇపుడు అన్ని పార్టీలు ఒక స్టాండ్ తీసుకున్నాయి. వైసీపీ న్యూట్రల్ స్టాండ్ తో ఉంది.
కానీ దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని మీటింగ్ పెడితే దానికి కూడా దూరంగా ఉంటే వైసీపీ మీద విమర్శలు కూడా వస్తాయని అంటున్నారు. చూడాలి మరి జగన్ స్టాలిన్ టీం లోకి వస్తారా లేదా అన్నది తొందరలో తేలనుంది అంటున్నారు.