జనసేన 'జయకేతనం'కు సర్వం సిద్ధం... ప్రత్యేకతలు ఇవే!

ఏపీలో అధికార కూటమి పార్టీల్లో కీలకంగా ఉన్న జనసేన రాజకీయ వైభవం... 2024 ఎన్నికలకు ముందు వరకూ ఒక లెక్క, ఆ ఎన్నికల ఫలితాల అనంతరం మరో లెక్క అన్నట్లుగా మారిపోయిన సంగతి తెలిసిందే.;

Update: 2025-03-13 08:21 GMT

ఏపీలో అధికార కూటమి పార్టీల్లో కీలకంగా ఉన్న జనసేన రాజకీయ వైభవం... 2024 ఎన్నికలకు ముందు వరకూ ఒక లెక్క, ఆ ఎన్నికల ఫలితాల అనంతరం మరో లెక్క అన్నట్లుగా మారిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలతో పాటు కేంద్రంలోని ఎన్డీయే కూటమిలోనూ జనసేన కీలకంగా మారిందని అంటున్నారు.

గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ తో జనసేన విజయకేతనం ఎగురవేసింది.. తన బలాన్ని చాటి చెప్పింది.. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తోంది. ఈ సమయంలో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ ఆవిర్భావ సభ జరుపుకోనుంది. దీనికి సంబంధించిన చర్చ ఇప్పుడు వైరల్ గా మారింది.

అవును... ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు జనసేన పార్టీ అత్యంత కీలకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పార్టీ ఆవిర్భావ సభ ఈ నెల 14 (శుక్రవారం) జరగనుంది. ఈ ఆవిర్భావ సభ పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ గ్రామం వద్ద 50 ఎకరాల ప్రాంగణంలో "జయకేతనం" పేరుతో జరగనుంది.

జనసేన అనేది ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ.. జాతీయ స్థాయిలో ప్రభావం చూపగలదనే సంగతి తెలిసిందే. ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లోనూ పవన్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో ఫలితాలే అందుకు నిదర్శనం అని అంటారు. ఈ ఆవిర్భావ సభకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి కార్యకర్తలు తరలిరానున్నారని అంటున్నారు.

ఇక జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రత్యేక కమిటీల ద్వారా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. సుమారు 250 మంది ఆశీనులయ్యేలా ఈ సభావేదిక ఉండగా.. ఆహుతుల కోసం గ్యాలరీల్లో కుర్చీలు, ఎల్ఈడీ తెరలు, విద్యుత్ దీపాలు ఏర్పాట్లు చేశారు. దీనికోసం ఆరు చోట్ల పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు.

ఇక నాలుగు చోట్ల భోజన వసతులు ఏర్పాట్లు చేస్తున్నారు. జనసేన డాక్టర్స్ వింగ్ ఆధ్వర్యంలో ఏడు చోట్ల వైద్యశిబిరాలు, 12 అంబులెన్సులను సిద్ధం చేస్తున్నారు. సుమారు 1,600 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే క్రమంలో 70 సీసీ కెమెరాలు, 15 డ్రోన్ల నిఘా ఉండనుంది.

500 మంది జనసేన వాలంటీర్లు సేవలందించనున్నారు. వీరిలో 100 మంది మహిళా వాలంటీర్లు ఉన్నారు. ఈ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ సాయంత్రం 4 గంటలకు చేరుకుంటారు. రాత్రి 9 గంటల వరకూ ఈ కార్యక్రమం జరగనుంది. దీంతో... ఈ సభ అనంతరం జనసేన పేరు వేరే లెవెల్లో మారుమ్రోగే అవకాశం ఉందని అంటున్నారు.

Tags:    

Similar News