కాంగ్రెస్ లో కర్నాటకం.. డీకేకు సిద్ధూ షాక్!

కన్నడ నాట కాంగ్రెస్ రాజకీయాలు రక్తికడుతున్నాయి. 2023 ఎన్నికల్లో రికార్డు మెజార్టీతో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ అప్పటి పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ను ఒప్పించి ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యను ఎంపిక చేసింది.;

Update: 2025-03-13 07:57 GMT

కన్నడ నాట కాంగ్రెస్ రాజకీయాలు రక్తికడుతున్నాయి. 2023 ఎన్నికల్లో రికార్డు మెజార్టీతో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ అప్పటి పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ను ఒప్పించి ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యను ఎంపిక చేసింది. ప్రతిపక్షంలో ఉండగా బీజేపీపై రాజీలేని పోరాటం చేసిన డీకే శివకుమార్ కు డిప్యూటీ సీఎం పోస్టుకు పరిమితం చేసింది. ఇక ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల తర్వాత అధికార మార్పిడి జరుగుతుందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమయ్యే సరికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొత్త రాగం ఆలపించడంతో హస్తం రాజకీయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

కొడిగడుతున్న కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక జీవం పోసింది. 2023లో రాష్ట్రంలో అధికారం దక్కించుకున్న తర్వాత కాంగ్రెస్ లో మంచి జోష్ వచ్చింది. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ ఎన్నికల్లోనూ గెలిచి సొంత పార్టీ ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. ఇక 2024 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి దీటుగా పోటీ ఇచ్చినా, అధికారానికి కొద్ది దూరంలో ఆగిపోవాల్సివచ్చింది. అయితే ఆ తర్వాత ఆ పార్టీ తిరోగమనంలో పయనిస్తున్నా, కర్ణాటకలో మాత్రం స్ట్రాంగుగానే కనిపిస్తోంది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో మూడుచోట్ల గెలిచి సత్తా చాటింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని, తానే మళ్లీ ముఖ్యమంత్రిని అవుతానని సిద్ధరామయ్య అసెంబ్లీలో ప్రకటించడం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. కర్ణాటక ఎన్నికల సమయంలో సిద్ధూ, డీకే మధ్య అధికార బదిలీకి ఒప్పందం జరిగిందని ప్రచారం జరిగింది. తొలి ఆరు నెలలు సిద్ధూకు ఆ తర్వాత డీకేను ముఖ్యమంత్రిగా చేయాలని ఆ పార్టీలో చర్చ జరిగిందని చెబుతున్నారు. అయితే ఈ ప్రతిపాదనకు సిద్ధూ వర్గం అంగీకరించకపోవడంతో చెరి సగం కాలం ముఖ్యమంత్రి పదవిని పంచుకోవాలని ఒప్పందం కుదిరిందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ ప్రతిపాదనకు కట్టుబడిన డీకే శివకుమార్ కొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి అవుతానని కలలు కంటున్నారు. అయితే తాజాగా సిద్ధరామయ్య చేసిన ప్రకటనతో డీకే అనుచరులు కంగుతిన్నారని చెబుతున్నారు.

ఇప్పటికే డీకేతో బీజేపీ టచ్ లో ఉందనే ప్రచారం జరుగుతోంది. డీకేను బీజేపీలోకి తీసుకుని కాంగ్రెస్ సర్కార్ ను పడగొట్టాలని కమలనాథులు స్కెచ్ వేస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ అధిష్టానానికి విధేయుడిగా చెప్పుకునే డీకే బీజేపీ నేతల గాలానికి చిక్కడం లేదంటున్నారు. తనకు పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందని ఆశిస్తున్నారని అంటున్నారు.అయితే ముఖ్యమంత్రి సిద్ధూ మాత్రం తన పదవిని వదులుకోడానికి సిద్ధంగా లేరని టాక్ వినిపిస్తోంది. ఆయన సీఎంగా కొనసాగే ఆలోచనల్లో భాగంగానే మరో ఐదేళ్లు నేనే సీఎం అన్న ప్రకటన చేస్తున్నారని చెబుతున్నారు. దీంతో కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ గా చెప్పే డీకే శివకుమార్ తాజాగా ఎదుర్కొంటున్న ఈ ట్రబుల్ నుంచి ఎలా బయటపడతారనేది ఆసక్తి రేపుతోంది.

Tags:    

Similar News