లోకేశ్ మాటిస్తే.. తిరుగుండదు అంతే..
రాజకీయ నాయకుల మాటలకు అర్థాలే వేరంటారు. వారు చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి అనే విమర్శలు వినిపిస్తుంటాయి.;
రాజకీయ నాయకుల మాటలకు అర్థాలే వేరంటారు. వారు చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి అనే విమర్శలు వినిపిస్తుంటాయి. కొందరు నేతలు ఇచ్చిన హామీలు గాలికి వదిలేస్తారు. మరికొందరు కాస్త ఆలస్యంగానైనా పూర్తి చేస్తారు. కానీ, ఏపీలో యువనేత, మంత్రి నారా లోకేశ్ విషయంలో మాత్రం ఈ అభిప్రాయాలకు అసలు చోటే ఉండదని అంటున్నారు. ఆయన మాట ఇచ్చారంటే ఏ పని అయినా 24 గంటల్లో పూర్తి అవ్వాల్సిందేనని అభిప్రాయమే వినిపిస్తోంది. గతంలో విదేశాల్లో ఇరుక్కుపోయిన రాష్ట్ర వాసులను వెనక్కి రప్పించడంలో ఆగమేఘాలపై స్పందించినట్లే.. రాష్ట్రంలోని అక్కడక్కడ చోటుచేసుకుంటున్న తప్పులపైనా మంత్రి లోకేశ్ స్పందిస్తున్నారు. అంతేకాదు ఆయన ఏ విషయంలోనైనా జోక్యం చేసుకున్నారంటే ఆ పని వెంటనే పూర్తి అయ్యేవరకు వెంటపడతారని అంటున్నారు.
తాజాగా కడప జిల్లాలోని బద్వేలు నియోజకవర్గం పరిధిలో నల్లమట అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్న శ్రీ కాశినాయన అన్నదాన సత్రం విషయంలోనూ మంత్రి లోకేశ్ స్పందన ఆకట్టుకుంటోంది. అటవీ భూముల్లో కొనసాగుతున్న ఆ సత్రాన్ని ఆ శాఖ అధికారులు తొలగించారు. అధికారులు నిబంధనల ప్రకారం నడుచుకున్నా, అటవీ ప్రాంతంలో వేలాది మందికి అన్నదానం చేస్తున్న సత్రాన్ని తొలగించడం సరికాదని అభిప్రాయపడిన మంత్రి లోకేశ్ స్పందించారు. అధికారుల చర్యకు తాను క్షమాపణ చెప్పడమే కాకుండా, తన సొంత ఖర్చులతో తొలగించిన భవనాన్ని పునర్నిర్మిస్తానని హామీ ఇచ్చారు.
మంత్రి లోకేశ్ అలా మాట ఇచ్చారో లేదో వెంటనే ఆయన టీమ్ రంగంలోకి దిగిపోయింది. కాశినాయన అన్నదాన సత్రం వద్దకు వచ్చి తొలగించిన భవనం పునర్ నిర్మాణానికి పనులు మొదలు పెట్టింది. లోకేశ్ మాటిచ్చిన 24 గంటల్లోనే పనులు ప్రారంభమవడంపై ఆశ్రమ నిర్వాహకులు, భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా యువనేత లోకేశ్ ప్రత్యేకతే వేరంటూ కితాబునిస్తున్నారు. బుధవారం మంత్రి లోకేశ్ తన సొంత డబ్బుతో భవనాన్ని నిర్మిస్తానని మాట ఇచ్చారు. ఆ వెంటనే తన టీమును బద్వేలు పంపి సత్రం నిర్మానానికి అవసరమైన యాక్షన్ తీసుకోవాలని సూచించారు. ఇక గురువారం తెల్లారేసరికి భవన నిర్మాణానికి పునాదుల తవ్వకానికి మార్కింగ్ వేశారు. మధ్యాహ్నానికల్లా మట్టి తవ్వకం కూడా పూర్తవుతుందని చెబుతున్నారు.