జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలతో భగ్గుమన్న అసెంబ్లీ

జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో ఉద్రిక్తతను మరింత పెంచాయి.;

Update: 2025-03-13 09:33 GMT

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రవేశపెట్టిన అనంతరం, చర్చలో మాజీ మంత్రులు, ప్రస్తుత మంత్రుల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది.

జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో ఉద్రిక్తతను మరింత పెంచాయి. ఆయన మాట్లాడుతూ, 36 నిమిషాల గవర్నర్ ప్రసంగంలో 360 అబద్ధాలు చెప్పించారని ఆరోపించారు. గవర్నర్ ప్రసంగాన్ని చదివేటప్పుడు ఆమె మనసు ఎంత నొచ్చుకుందోనని వ్యాఖ్యానించారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. దీనికి అధికారపార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ క్రమంలో ప్రభుత్వ విప్ శ్రీనివాస్ స్పందించి, గవర్నర్ కు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని, జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు అనుచితమని అన్నారు. అయితే, జగదీశ్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీ గవర్నర్ ప్రసంగాన్ని తప్పుదోవ పట్టించిందని ప్రతిపక్షాన్ని తప్పుబట్టారు. దీనిపై మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ, గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ చేయలేనిది కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క సంవత్సరంలో సాధించిందని ప్రకటించారు.

సభలో ఉద్రిక్తత పెరుగుతున్న నేపథ్యంలో, స్పీకర్ జోక్యం చేసుకొని గవర్నర్ ప్రసంగంలోని అంశాలకే పరిమితం కావాలని సూచించారు. అయితే, జగదీశ్ రెడ్డి దీనికి అభ్యంతరం వ్యక్తం చేస్తూ, సభ స్పీకర్ సొంతం కాదని, ఇది అందరిదని అన్నారు. స్పీకర్ దీనికి కౌంటర్ ఇస్తూ, తనను ప్రశ్నించడం సభా సంప్రదాయాలకు విరుద్ధమని తెలిపారు. ఈ వ్యాఖ్యలతో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం మరింత పెరిగింది.

కాంగ్రెస్ సభ్యులు జగదీశ్ రెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని, ఆయనను సభ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీనితో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడటంతో, స్పీకర్ కొద్దిసేపు సభను వాయిదా వేశారు. అనంతరం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్ తదితరులు మంత్రి శ్రీధర్ బాబుతో సమావేశమై, అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై చర్చించారు.

అయితే, జగదీశ్ రెడ్డి క్షమాపణలు చెప్పకపోతే, ఆయనపై సస్పెన్షన్ చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి మంత్రి శ్రీధర్ బాబు తీసుకెళ్లారు.

ఇక, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, గంగుల కమలాకర్, సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్ తదితరులు స్పీకర్ ను కలిసి, జగదీశ్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా స్పీకర్ సీటును అవమానించలేదని, గౌరవంతోనే మాట్లాడారని వివరణ ఇచ్చారు.

Full View
Tags:    

Similar News