కాప్ 30... పర్యావరణ సదస్సు కోసమని ఇదేం పాడు పని?
ఇలా.. బ్రెజిల్ తీరు వాతావరణ సదస్సు అసలు ఉద్దేశానికి విరుద్ధంగా ఉందని అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.;
మద్యపాన వ్యతిరేక ఉద్యమం కోసమని జనాలను తరలిస్తూ.. వారికి బిర్యానీ పాకెట్ తో పాటు మద్యం బాటిల్ అందించాడంట ఓ ప్రభుద్ధుడు! అలా ఉంది తాజాగా తెరపైకి వచ్చిన ఓ విషయం! ఇందులో భాగంగా... పర్యావరణాన్ని రక్షించుకోవడం కోసం చేపట్టాల్సిన చర్యలపై ప్రపంచ దేశాలన్నీ ఒక దగ్గర కూర్చొని జరిపే చర్చ కోసం చెట్లను నరికేశారు.
అవును... భూగోళం వేడేక్కుతోందని.. దృవాల వద్ద మంచు కరిగిపోతోందని.. పర్యావరణ విపత్తుకు సమయం ఆసన్నమవ్వబోతోందని.. ప్రధానంగా ఓజోన్ పొర దెబ్బతింటోందని ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో కాప్ (క్లైమేట్ సమిట్) సదస్సుకు ఆతిథ్యమివ్వబోతోన్న బ్రెజిల్ లో ఓ షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది.
అంతర్జాతీయ మీడియాలో వస్తోన్న కథనాల ప్రకారం... ఈ నవంబర్ లో కాప్ 30 వాతావరణ సదస్సు బ్రెజిల్ లో జరగనుంది. అమెజాన్ వర్షారణ్యం వాతావారణంలోని కర్బన ఉద్గారాలను గ్రహించి, భూమి వేడెక్కకుండా చూడటంలో జీవవైవిధ్యంలో కీలకపాత్ర పోషిస్తోంది. అయితే... ఇప్పుడు ఈ ఫారెస్ట్ లో బ్రెజిల్.. చెట్లను నరికి, రోడ్లు వేస్తోంది. ట్రాఫిక్ చిక్కులు తలెత్తకుండా ఈ పనికి పూనుకున్నట్లు చెబుతున్నారు.
ప్రధానంగా.. ఈ సదస్సులో పాల్గొనేందుకు 50వేల మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉందని.. అందువల్లే ఈ నిర్ణయమని చెబుతున్నారు. అయితే... ఈ కొత్త రోడ్లు తమ జీవనాధారాన్ని దెబ్బతీస్తున్నాయని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. ఇదే సమయంలో.. ఈ పని కారణంగా వన్యప్రాణులకు ప్రమాదకారంగా మారవచ్చని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇలా.. బ్రెజిల్ తీరు వాతావరణ సదస్సు అసలు ఉద్దేశానికి విరుద్ధంగా ఉందని అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా స్పందించిన ఆ దేశ అధ్యక్షుడు, పర్యావరణ మంత్రి... అమెజాన్ అడవుల్లో కాప్ నిర్వహిస్తున్నాం కానీ.. అమెజాన్ అడవుల కోసం కాప్ కాదు కదా అని తమ చర్యను సమర్థించుకుంటున్నారు!
ఈ సందర్భంగా స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఈ వాతావరణ మార్పులను బూటకమని అన్నారు. అందువల్లే ఈ వాతావరణ మార్పు పరిహార నిధి నుంచి అమెరికా వైదొలిగినట్లు వెల్లడించారు. కాగా... ప్రకృతి వైపరిత్యాల సమయంలో పేద దేశాలకు ఆర్థికసాయం కోసం 72 కోట్ల డాలర్లతో నిధిని ఏర్పాటు చేయాలని కాప్ 29 నిశ్చయించింది.
అయితే... ఇందులో సుమారు 1.75 కోట్ల డాలర్లను అందిస్తామని నాడు అమెరికా వాగ్దానం చేసింది. అయితే.. ట్రంప్ ప్రెసిడెంట్ అయిన అనంతరం ఆ ఒప్పందం నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించింది.