ఇదే గోల్డెన్ ఛాన్స్... లేదంటే ఇంటికెళ్లి ఫ్లూట్ ఊదుకోవడమే!
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కూడా రచ్చ రచ్చ గా మారిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టీడీపీ నాయకులు స్పికర్ పోడియం వద్దకు చేరి నినాదాలు చేశారు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కూడా రచ్చ రచ్చ గా మారిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టీడీపీ నాయకులు స్పికర్ పోడియం వద్దకు చేరి నినాదాలు చేశారు. అనంతరం సీట్లెక్కి, విజిల్స్ వేసి వికృత చేష్టలకు పాల్పడ్డారు. ఈ సమయలో నందమూరి బాలకృష్ణను ఉద్దేశించి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు.
అవును... టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇప్పటికైనా మేలుకోవాలని మంత్రి అంబటి రాంబాబు సూచించారు. ఆయన మీసం తిప్పాల్సింది అసెంబ్లీలో కాదని, అసెంబ్లీలో మీసం తిప్పితే ఉపయోగం లేదని, తెలుగుదేశం పార్టీలో తిప్పితే ప్రయోజనం ఉంటుందని సూచించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచినప్పటి సంఘటనలను గుర్తుచేసుకోమని రాంబాబు తెలిపారు.
ఇదే క్రమంలో... "మీ తండ్రికి వెన్నుపోటు పొడిచిన సందర్భాన్ని గుర్తు తెచ్చుకుని అక్కడ మీసం తిప్పండి" అని బాలయ్యకు సూచించిన అంబటి రాంబాబు... "జన్మనిచ్చిన తండ్రికి, క్లిష్ట సమయంలో అండగా నిలవలేదనే అపవాదు మీ మీద, మీ అన్నదమ్ముల మీద ఉంది" అని గ్రుతుచేశారు. ఈ సమయంలో ఆ అపవాదును తొలగించుకునే అవకాశం వచ్చిందని, మీ బావ జైల్లో.. అల్లుడు ఢిల్లీలో ఉన్నారని, ఇదే మీకు సరైన సమయం కాబట్టి పోయిన పగ్గాలు తీసుకోండని అంబటి రాంబాబు సూచించారు.
కాగా, రెండో రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరయిన సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన అంబటి... చంద్రబాబు అరెస్ట్ పై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే టీడీపీ నేతలకు మాత్రం చర్చ వద్దని, వారికి కావాల్సింది రచ్చ అని, అందుకే శాసనసభలో గందరగోళం సృష్టించాలనేదే వారి ఉద్దేశ్యం అని మండిపడ్డారు.
ఇదే సమయంలో చంద్రబాబు అరెస్ట్, స్కిల్ స్కాం పై ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపిన అంబటి... ఈరోజైనా సరైన ఫార్మాట్ లో చర్చకు రావాలని కోరుతున్నామని అన్నారు. చర్చ జరిగితే అసలు వాస్తవాలు ప్రజలకు తెలిసిపోతాయనే భయం ఉండటం వల్లే చర్చకు టీడీపీ సభ్యులు సహకరించడం లేదని ఎద్దేవా చేశారు.
అనంతరం... చంద్రబాబు తప్పు చేయలేదని నిజంగా నమ్మితే చర్చలో పాల్గొనండి పారిపోవద్దు.. టీడీపీ సభ్యులను కోరిన అంబటి.. ఆ స్కాం గురించి అందరికంటే ఎక్కువగా టీడీపీ ఎమ్మెల్యేలకే తెలుసని అన్నారు. ఇక, అసెంబ్లీలో నిన్న తాను లేచి నిలబడకపోతే స్పీకర్ మీద దాడి చేసేవారని.. పేపర్ లో వార్తల కోసం టీడీపీ సభ్యులు వ్యవహరించినట్లుగా అనిపిస్తోందని విమర్శించారు.
ఇదే క్రమంలో చంద్రబాబు సీట్లోకి ఎక్కి బాలకృష్ణ నిల్చుంటున్నారని... ఆయనకు ఆ సీట్లో కూర్చోవాలని, గట్టిగా ఆ సీటుని పట్టుకోమని తాము కోరుకుంటుంటే వినడం లేదని అన్నారు. గతంలో ఎంతో అవినీతి చేసిన టీడీపీ సభ్యులు వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని తెలిపారు.
ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో 23 సీట్లు కూడా టీడీపీకి రావని, ఈసారి సింగిల్ డిజిట్ కే పరిమితం అని, ఈదఫా బాలకృష్ణకు కూడా ఓటమి తప్పదని అంబటి రాంబాబు జోస్యం చెప్పారు. అనంతరం ఇంట్లో కూర్చుని ఫ్లూటు ఊదుకోవడమే అని, విజిల్ వేసుకోవడమే అని అంబటి ఎద్దేవా చేశారు.