మంత్రి అంబటికి ముగ్గుతో షాకిచ్చిన బాలిక
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై అదే పనిగా విరుచుకుపడే మంత్రి అంబటి రాంబాబుకు కలలోకూడా ఊహించని రీతిలో షాక్ తగిలింది
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై అదే పనిగా విరుచుకుపడే మంత్రి అంబటి రాంబాబుకు కలలోకూడా ఊహించని రీతిలో షాక్ తగిలింది. అంతటి ఫైర్ బ్రాండ్ మంత్రికి ఎదురుదెబ్బా? అని ఆశ్చర్యపోవచ్చు. కానీ.. జరిగింది తెలుసుకుంటే మాత్రం ఆశ్చర్యానికి గురి కావటమే కాదు.. సదరు బాలిక ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేరు. ఇంతకూ జరిగిందేమంటే..
సంక్రాంతి వచ్చిందంటే చాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ముగ్గుల పోటీ నిర్వహించే విషయం తెలిసిందే. అందరి మాదిరే ఏపీ మంత్రి అంబటి రాంబాబు తాను ప్రాతినిధ్యం వహించే సత్తెనపల్లి నియోజకవర్గంలో ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఊర్లోనూ ఈ ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా రాజుపాలెం మండలం బీరవల్లిపాయ గ్రామంలోనూ ముగ్గుల పోటీ నిర్వహించారు మంత్రి అంబటి వర్గీయులు. ఈ సందర్భంగా ఒక బాలిక వేసిన ముగ్గు సంచలనంగా మారింది. సదరు బాలిక వేసి ముగ్గు.. జనసేన పార్టీ లోగో. అంతేకాదు.. పార్టీ గుర్తును ముగ్గుగా వేసిన సదరు బాలిక..ఆ ముగ్గు కింద 'వైసీపీ వద్దు.. జనసేన ముద్దు' అంటూ క్యాప్షన్ కూడా రాసేసింది. దీంతో.. ఈ ముగ్గు వ్యవహారం మండలంలో చర్చగా మారటమే కాదు.. మంత్రి అంబటికి కోలుకోలేని షాక్ గా చెబుతున్నారు. అంతటి అంబటిని తన ముగ్గుతో షాకిచ్చిన బాలిక ధైర్యాన్ని పలువురు చర్చించుకుంటున్నారు.