అంబటి రాయుడు.. జనసేన స్టార్ క్యాంపైనర్
గుంటూరు ఎంపీ టికెట్ ఆశించి అది దక్కకపోవడం వల్లే వైసీపీకి టాటా చెప్పాడని ప్రచారం జరిగింది.
ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు పేరు కొన్ని నెలల కిందట రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఐపీఎల్ సహా అన్ని రకాల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన అతను.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే దిశగా గ్రౌండ్ లెవెల్లో కొన్ని నెలల పాటు తిరగడం.. చివరికి ఆ పార్టీ తీర్థం పుచ్చుకోవడం.. వారం తిరిగేసరికే పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశం అయింది.
గుంటూరు ఎంపీ టికెట్ ఆశించి అది దక్కకపోవడం వల్లే వైసీపీకి టాటా చెప్పాడని ప్రచారం జరిగింది. కానీ తాను వైసీపీని వీడడంలో టికెట్‌తో సంబంధం లేదని.. తన భావజాలానికి సరిపోదన్న ఉద్దేశంతోనే ఆ పార్టీ నుంచి బయటికి వచ్చానని తర్వాత అతను వివరణ ఇచ్చాడు. అంతే కాక జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిశాడు. ఆ తర్వాత రాయుడి రాజకీయం గురించి వార్తలు లేవు.
ఐతే ఇప్పుడు అంబటి రాయుడు జనసేన కోసం ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యాడు. జనసేనకు స్టార్ క్యాంపైనర్‌గా ఆ పార్టీ అంబటి రాయుడిని అధికారికంగా ప్రకటించింది.
రాయుడితో పాటు నాగబాబు, హైపర్ ఆది, గెటప్ శీను, డ్యాన్స్ మాస్టర్ జానీ, కమెడియన్ పృథ్వీ, టీవీ నటుడు సాగర్‌లను తమ పార్టీ స్టార్ క్యాంపైనర్లుగా నియమించినట్లు పవన్ కళ్యాణ్ పేరుతో ఈ రోజు జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది. కాపు సామాజిక వర్గానికి చెందిన రాయుడు.. ఆంధ్రా ప్రాంతంలో యువతపై బాగానే ప్రభావం చూపగలరని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో జనసేన గురించి.. అలాగే అధికార వైసీపీ గురించి ఎన్నికల ప్రచారంలో రాయుడు ఏం మాట్లాడతాడన్నది ఆసక్తికరం. ప్రస్తుతం రాయుడు ఐపీఎల్ మ్యాచ్ విశ్లేషకుల్లో ఒకడిగా వ్యవహరిస్తున్నాడు. త్వరలోనే అతను ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నాడు.