10 లక్షల వీసాలు.. అమెరికా కాన్సులేట్ సరికొత్త రికార్డు
అంతేకాదు మరో 50 లక్షల మంది యూఎస్ ను సందర్శించేందుకు వలసేతర వీసాలు పొంది ఉన్నట్లుగా చెప్పింది.
గత ఏడాది మాదిరి ఈ ఏడాది కూడా పది లక్షల వీసాల జారీలో అమెరికా కొత్త రికార్డును క్రియేట్ చేసింది. వరుసగా రెండో ఏడాది ఇదే తీరును ప్రదర్శించింది. భారతీయులకు రికార్డు స్థాయిలో 10 లక్షలకు పైగా వలసేతర వీసాలను మంజూరు చేసినట్లుగా పేర్కొంది. నాన్ ఇమిగ్రెంట్ వీసాల జారీ విషయంలో అమెరికా కమిట్ మెంట్ తో పని చేస్తున్నట్లుగా వెల్లడించింది. ఈ ఏడాది జారీ చేసిన అమెరికా వీసాల్లో రికార్డు స్థాయిలో టూరిస్టు వీసాలు ఉన్నట్లుగా వెల్లడించింది.
విద్య.. వ్యాపారం.. పర్యాటకంకోసం అమెరికాకు వచ్చే భారతీయుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని పేర్కొన్న కాన్సులేట్.. గడిచిన నాలుగేళ్లలో దాదాపు ఐదు రెట్లు పెరిగినట్లుగా వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నుంచి నవంబరు వరకు దాదాపు 20 లక్షల మంది భారతీయులు అమెరికా ప్రయాణాలు చేశారని.. 2023తో పోలిస్తే ఇది 26 శాతం ఎక్కువగా పేర్కొంది.
అంతేకాదు మరో 50 లక్షల మంది యూఎస్ ను సందర్శించేందుకు వలసేతర వీసాలు పొంది ఉన్నట్లుగా చెప్పింది. రోజూ వేల సంఖ్యలో కొత్త వీసాలు జారీ అవుతున్నాయని.. ఈ ఏడాది అమెరికాలోనే హెచ్ 1 బీ వీసాలు రెన్యువల్ చేసే ప్రయోగాత్మక కార్యక్రమాన్ని డిపార్టుమెంట్ ఆఫ్ స్టేట్ విజయవంతంగా అమలు చేసినట్లుగా వెల్లడించింది. ఇక.. అమెరికాలో నివసిస్తూ.. భారత్ కు వచ్చిన భారత అమెరికన్ పౌరుల్లో 24 వేల మందికి పైనే వీసాలు జారీ చేసినట్లుగా వెల్లడించింది.
ప్రతి వారం ఇంటర్వ్యూ మినహాయింపు ఉన్న వేల కొద్దీ వలసేతర వీసాల దరఖాస్తుల్ని ప్రాసెస్ చేసిన కారణంగా తమ వీసాల్ని గతం కంటే వేగంగా.. సలువుగా రెన్యువల్ చేసుకున్నట్లుగా వెల్లడించింది. ఈ ఏడాది విద్యార్థి వీసాలు పెద్ద ఎత్తున పొందినట్లుగా వెల్లడించింది. 2008-09 అకడమిక్ ఇయర్ తర్వాత అమెరికాకు అంతర్జాతీయ విద్యార్థుల్ని ఎక్కువగా పంపే దేశంగా భారత్ నిలిచింది. దాదాపు 3.31 లక్షల మంది భారతీయులు అమెరికాలో చదువుతున్నారు. అమెరికాలో భారత గ్రాడ్యుయేట్ విద్యార్థుల సంఖ్య 19 శాతం పెరిగింది.