జగన్ ఇకనైనా క్యాడర్ ని ముద్దు చేస్తారా ?

వారి పార్టీలలో కార్యకర్తగా చేరిన వారు కీలక పార్టీ పదవులు అందుకున్నది ఎంతో ఉంటుంది.;

Update: 2025-03-29 02:45 GMT
జగన్ ఇకనైనా క్యాడర్ ని ముద్దు చేస్తారా ?

కార్యకర్త అంటే పార్టీకి జీవకర్ర అని చెబుతారు. పార్టీ జెండా ఎగుగుతుంది కానీ దానికి ఊతమిచ్చే కర్రనే కార్యకర్త అని అంటారు. క్యాడర్ కి ఎక్కువ విలువ కామ్రేడ్స్ ఇస్తారు. వారి పార్టీలలో కార్యకర్తగా చేరిన వారు కీలక పార్టీ పదవులు అందుకున్నది ఎంతో ఉంటుంది. ఇక ఇతర పార్టీలలో మాత్రం క్యాడర్ ని అలాగే ఉంచేస్తారు.

కొన్ని పార్టీలు అయితే వారికి అవసరమైన ప్రయోజనాలకు కల్పిస్తూ ఉంటారు. అయితే మధ్యేవాద పార్టీలలో కార్యకర్త నుంచి లీడర్ స్థాయికి ఎదిగే వారు బహు కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఏపీలో చూస్తే క్యాడర్ ని బాగా చూసుకునే పార్టీగా టీడీపీకి పేరు ఉంది. వారి పేరుతో లక్షల బీమా కూడా ఇస్తూ ఆ పార్టీ.ధీమాను పెంచింది

మిగిలిన పార్టీలు క్యాడర్ ని జెండా ఎత్తమని కోరుతూ వస్తూంటాయి. అయితే క్యాడర్ కి గౌరవం ఇవ్వాల్సి ఉంది. అది అధినాయకత్వం నుంచి అలవాటు చేస్తేనే దిగువ స్థాయిలో పదవులలో ఉన్న వారు సైతం అనుసరిస్తారు. వైసీపీలో అయితే క్యాడర్ ని బాగా విస్మరించారు అన్న పేరు అయితే 2019 నుంచి 2024 మధ్యలో వచ్చింది. పార్టీని అధికారంలోకి తేవడం కోసం పదేళ్ళ పాటు ఇల్లూ ఒళ్ళూ గుళ్ల చేసుకుని సర్వం సున్నం చేసుకుని పాటుపడిన క్యాడర్ కి ఇది మా ప్రభుత్వం అని చెప్పుకునే చాన్స్ లేకుండా చేశారు అన్న బాధ వారిలో ఉంది.

ఎంతైనా క్యాడర్ కదా. అందుకే నమ్ముకున్న పార్టీని వీడిపోలేదు. అలాగని పార్టీ కోసం భుజాలు గజాలు చేసుకుని పని చేయలేదు. తమ వరకూ ఓటు వేసి ఊరుకున్నారు. అందువల్లనే 2024 ఎన్నికల్లో దారుణమైన దెబ్బ వైసీపీకి తగిలింది. దాంతో ఆ పార్టీకి ఇపుడు క్యాడర్ విలువ తెలిసి వచ్చింది అని అంటున్నారు.

ఓటమి తరువాత సమీక్షలలో ఇదే విషయం వెల్లడి అయింది. క్యాడర్ కోసం జిల్లా టూర్లు చేస్తాను అని అధినేత జగన్ ప్రకటించారు. బహుశా అది రానున్న కాలంలో ఉండవచ్చు. అయితే ఇపుడు ఏపీలో జరిగిన పలు స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైసీపీ మంచిగానే గెలిచింది. గుడ్ నంబర్ ఆ పార్టీ దక్కించుకుంది.

దాంతో క్యాడర్ కి జై అని జగన్ కితాబు ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడుతున్నారని మెచ్చుకున్నారు. నిజంగా వైసీపీ క్యాడర్ ని తట్టిలేపింది కూటమి రెడ్ బుక్ అని అంటున్నారు. వారంతా ఇపుడు కూటమి సర్కార్ మీద తమదైన శైలిలో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సమయంలో వారికి కావాల్సింది నైతిక స్థైర్యం. అలాగే అండ దండ.

వాటిని అధినాయకత్వం సమకూర్చి మేమున్నామని వెన్ను తట్టితే వైసీపీకి మంచి రోజులు వచ్చినట్లే అని అంటున్నారు. మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ క్యాడర్ ని గుర్తించి ఆదరిస్తే అందులో మెరికల్లాంటి వారిని పోటీకి దించితే వైసీపీకి క్యాడర్ బేస్డ్ పార్టీగా పూర్వ వైభవం దక్కుతుందని అంటున్నారు. మరి వైసీపీ అధినాయకత్వాన్ని సమస్య ఏమిటో తెలిసింది. పరిష్కారమూ తెలిసింది ఇక మిగిలింది అమలు చేయడమే అని అంటున్నారు.

Tags:    

Similar News