అమెరికాలో ఎక్కడికక్కడ నేలపై భారీ బీటలు.. ఎందుకంటే?
తాజాగా అలాంటి తీరే ఇప్పుడు చోటు చేసుకుంటుంది. ఇటీవల కాలంలో అమెరికాలోని పలు చోట్ల భూమికి పగుళ్లు చోటు చేసుకుంటున్నాయి.
ప్రపంచానికి పెద్దన్నలా వ్యవహరించే అమెరికా తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ప్రయోజనాలకు తగ్గట్లుగా అందరిపై పెత్తనం చేస్తూ.. తాను, తన ప్రజలు బాగుండటం కోసం దేశాలకు దేశాల్ని ఇబ్బంది పెట్టే అగ్రరాజ్యంపై ప్రక్రతి ఎప్పటికప్పుడు తన ఆగ్రహాన్ని ప్రదర్శించటం కనిపిస్తుంటుంది. తాజాగా అలాంటి తీరే ఇప్పుడు చోటు చేసుకుంటుంది. ఇటీవల కాలంలో అమెరికాలోని పలు చోట్ల భూమికి పగుళ్లు చోటు చేసుకుంటున్నాయి. అవి కూడా చిన్నా చితకా కాదు. కిలోమీటర్ల కొద్దీ వెడల్పు.. పొడవు ఉన్న ఈ బీటలతో అగ్రరాజ్యం ఇప్పుడు కిందామీదా పడుతోంది.
దేశంలోని పలు ప్రాంతాల్లో నేలపై పుట్టుకొస్తున్న భారీ పగళ్లు కొత్త టెన్షన్ ను తెప్పిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఎదురయ్యే పెను ఉత్పాతాలకు బహుశా ఇదో ముందస్తు సంకేతంగా శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.
అమెరికాలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే వాయువ్య రాష్ట్రాల్లో ఎక్కడ పడితే అక్కడ నేల నిలువునా చీలిపోతోంది. ఫిషర్స్ గా పేర్కొనే ఈ చీలికలకు కారణం ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. శాస్త్రవేత్తలు షాకింగ్ వివరాల్ని వెల్లడిస్తున్నారు.
దశాబ్దాలుగా భూగర్భ జలాల్ని విపరీతంగా తోడేయటం తాలుకూ దుష్పరిణామమే తాజా పరిస్థితి అని చెబుతున్నారు. ఇదే విషయాన్ని భౌతిక శాస్త్రవేత్తలు సైతం నిర్దారిస్తున్నారు. అమెరికాలోని అరిజోనా.. ఉతా.. కాలిఫోర్నియా రాష్ట్రాల్లో ఈ పగుళ్ల సమస్య ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.
అరిజోనాలో 2002నుంచే ఈ పగుళ్లు ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో ఏర్పడుతున్న తీరుపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. ఇలా చోటు చేసుకుంటున్న పరిణామాల సంఖ్య అంతకంతకూ పెరిగిపోవటమే.ఈ పగుళ్లు ఇప్పుడు జాతీయ సంక్షోభం స్థాయికి చేరుకున్నట్లుగా న్యూయార్క్ టైమ్స్ మీడియా సంస్థ వ్యాఖ్యానిస్తోంది.
ప్రపంచ దేశాలకు పర్యావరణం గురించి సుద్దులు చెప్పే అమెరికా.. తన వరకు వచ్చేసరికి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించటం ఆ దేశానికి అలవాటే. భూగర్భం నుంచి నీటిని విచ్చల విడిగా తోడేయటంతో నేల కుంగిపోతోంది. అది కాస్తా చివరకు పగుళ్లుగా బయటపడుతోంది. ఈ భారీ పగుళ్ల కారణంగా ఊహించనంత ప్రాణ నష్టం చోటు చేసుకునే వీలుందని హెచ్చరిస్తున్నారు. ఈ పగళ్లు మొత్తం మానవ తప్పిదాలేనని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందరిపై పెత్తనం చేసే అమెరికాకు.. ఈ పగుళ్ల ఇష్యూకు సొల్యూషన్ ఏమిటో అర్థం కాక తల పట్టుకుంటున్న పరిస్థితి.