అమెరికా విద్యా సంస్థల్లో వందలాది మంది విద్యార్థుల అరెస్టు ఎందుకు?

ఇజ్రాయెల్‌ పౌరులపై హమాస్‌ తీవ్రవాదులు దాడి చేసి వందలాది మందిని కాల్చిచంపడంతోపాటు బందీలుగా పట్టుకున్న సంగతి తెలిసిందే.

Update: 2024-04-25 11:09 GMT

ఇజ్రాయెల్‌ పౌరులపై హమాస్‌ తీవ్రవాదులు దాడి చేసి వందలాది మందిని కాల్చిచంపడంతోపాటు బందీలుగా పట్టుకున్న సంగతి తెలిసిందే. దీంతో రెచ్చిపోయిన ఇజ్రాయెల్‌.. హమాస్‌ పర్యవేక్షణలో ఉన్న పాలస్తీనాపై విరుచుకుపడింది. ఆరు నెలల క్రితం మొదలుపెట్టిన ఈ యుద్ధంలో ఇప్పటివరకు దాదాపు 40 వేల మంది పాలస్తీనా ప్రజలు మృత్యువాత పడ్డారు. వీరిలో అత్యధికులు మహిళలు, చిన్నారులే.

కాగా ఇజ్రాయెల్‌ కు అమెరికా అన్ని రకాలుగా సాయం అందిస్తోందని ఆరోపిస్తూ అమెరికాలోని విద్యా సంస్థల్లో పాలస్తీనా అనుకూల విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయెల్‌ కు అమెరికా ఆర్థిక, సైనిక సహకారాన్ని ఉపసంహరించుకోవాలని వీరు డిమాండ్‌ చేస్తున్నారు. వేలాది మంది ప్రజల ప్రాణాలు తీసిన ఇజ్రాయెల్‌ ను ఉగ్రవాద దేశంగా అంతర్జాతీయ న్యాయస్థానం మెట్లెక్కించాలని కోరుతున్నారు. అంతేకాకుండా ఇజ్రాయెల్‌ తో అమెరికా సంబంధాలను తెంచుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఐవీ లీగ్‌ కొలంబియా యూనివర్సిటీలో గత వారం మొదలైన నిరసనలు అమెరికా అంతటా వ్యాపించాయి. దీంతో ఇప్పటివరకు 100 మంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. సాధారణంగా పోలీసులు విద్యా సంస్థల్లోకి ప్రవేశించరు. అయితే విద్యార్థుల నిరసనలు ఎగసిపడటంతో పోలీసులు రంగప్రవేశం చేయక తప్పలేదు.

ఈ నేపథ్యంలో ఇప్పటివరకు పోలీసులు అమెరికాలో ప్రముఖ విద్యా సంస్థలయిన యూనివర్శిటీ ఆఫ్‌ టెక్సాస్‌–ఆస్టిన్, న్యూయార్క్‌ యూనివర్శిటీ, యేల్‌ యూనివర్సిటీ, ఒహియో స్టేట్‌ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియాలో విద్యార్థులను అరెస్టు చేశారు.

ఐవీ లీగ్‌ కొలంబియా యూనివర్సిటీలో నిరసనల మాదిరిగానే టాప్‌ యూనివర్సిటీలయిన హార్వర్డ్, మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ), యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా–బెర్కిలీ సహా అనేక విశ్వవిద్యాలయాల్లో నిరసన శిబిరాలను విద్యార్థులు నిర్వహించారు.

కాగా కొలంబియా యూనివర్సిటీకి వచ్చిన ప్రతినిధుల సభ స్పీకర్‌ మైక్‌ జాన్సన్‌ నిరసనలను ఖండించారు. అంతేకాకుండా కొలంబియా యూనివర్సిటీ ప్రెసిడెంట్‌ నెమట్‌ మినోచే షఫిక్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో రెచ్చిపోయిన విద్యార్థులు నిరసన శిబిరాలను తిరిగి ఏర్పాటు చేశారు.

అలాగే రిపబ్లికన్‌ పార్టీకి చెందిన జాన్సన్‌... విద్యార్థులను నియంత్రించకపోతే ప్రభుత్వం అందించే నిధులను కోల్పోతాయని విశ్వవిద్యాలయాలను హెచ్చరించారు. విద్యార్థుల నిరసనలను అణిచివేసేందుకు ప్రభుత్వం జాతీయ భద్రతా సిబ్బందిని మోహరించవచ్చన్నారు. అంతేకాకుండా ఈ వ్యవహారంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ జోక్యం చేసుకోవాలని కోరారు.

యూదులను లక్ష్యంగా చేసుకుని కొందరు విద్యార్థులు దాడికి ప్రయత్నించడం కూడా ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది. కొంతమంది నిరసనకారులు ఇజ్రాయెల్‌ జాతీయ పతాకాలను దహనం చేశారు. హమాస్‌ కు అనుకూలంగా నినాదాలు చేశారు.

Tags:    

Similar News