అమెరికా కొత్త వీసా రూల్స్.. మనపైనే అత్యధిక ప్రభావం!
ముఖ్యంగా హెచ్1బీ వీసా నిబంధనలను మరింత కఠినతరం చేస్తే దాని వల్ల ప్రధానంగా నష్టపోయేది భారతీయులేనని చెబుతున్నారు.
అమెరికా ప్రభుత్వం హెచ్1బీ, ఎల్1 వీసాల నిబంధనల్లో మార్పులు తీసుకురానుందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా హెచ్1బీ వీసా నిబంధనలను మరింత కఠినతరం చేస్తే దాని వల్ల ప్రధానంగా నష్టపోయేది భారతీయులేనని చెబుతున్నారు.
అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునేవారికి హెచ్1బీ వీసా ఇస్తారనే విషయం తెలిసిందే. ఈ వీసాను పొందడం ద్వారానే భారత్ నుంచి ఏటా భారీ సంఖ్యలో సాఫ్టువేర్ ఇంజనీర్లు, ఇతర నిపుణులు అమెరికా వెళ్తున్నారు. ఏటా అమెరికా విడుదల చేస్తున్న హెచ్1బీ వీసాల కోటాలో అత్యధికం భారతీయులే దక్కించుకుంటున్నారు.
ప్రస్తుతం అమెరికాలో శాశ్వత నివాసం (పౌరసత్వం) పొందిన భారతీయులను మినహాయిస్తే ఉద్యోగాలు చేస్తున్నవారిలో అత్యధికం హెచ్1బీ వీసా తీసుకుని వెళ్లినవారే కావడం గమనార్హం.
అయితే ఇప్పుడు హెచ్1బీ వీసాల విషయంలో యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) కొత్త నిబంధనలను ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోందని వార్తలు వచ్చాయి. ఏయే నిబంధనలను ప్రతిపాదించనున్నారో జూలై 8న వెల్లడి కానుంది. ఆ రోజు హెచ్1బీ వీసాలకు సంబంధించి ప్రతిపాదన నిబంధనలను యూఎస్‌సీఐఎస్ విడుదల చేయనుంది.
హెచ్1బీ వీసాలకు సంబంధించి అమెరికా ప్రభుత్వం పలు నిబంధనలను తీసుకురానుందని తెలుస్తోంది. మీడియా వర్గాల సమాచారం మేరకు
హెచ్–1బీ వీసాల పొడిగింపునకు 4,000 డాలర్లు, కంపెనీలు స్పాన్సర్ చేసే ఉద్యోగులకు ఇచ్చే ఎల్–1 వీసాల పొడిగింపునకు 4,500 డాలర్ల రుసుము విధించనున్నారని చెబుతున్నారు.
అలాగే 9/11 రెస్పాన్స్, బయోమెట్రిక్ ఎంట్రీ–ఎగ్జిట్ ఫీజులను కూడా ప్రవేశపెట్టే ప్రతిపాదనలు ఉన్నాయంటున్నారు. బయోమెట్రిక్ ఎంట్రీ–ఎగ్జిట్ ఫీజు ప్రస్తుతం ప్రారంభ వీసా దరఖాస్తులు, కంపెనీల మార్పులకు మాత్రమే వర్తిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ కొత్త వీసా నిబంధనలను ఈ ఏడాది చివరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత అమల్లోకి తీసుకురావచ్చని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
హెచ్1బీ వీసాకు సంబంధించి కొత్త నిబంధనలను అమెరికా ప్రభుత్వం అమల్లోకి తెస్తే భారతీయులకు ఇబ్బందులు తప్పవంటున్నారు. ఇప్పటికే ఈ వీసాలు పొంది అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నవారు తమ వీసా పొడిగింపునకు మరింత రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
అలాగే హెచ్1బీ వీసా కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే లక్షలాది మంది భారతీయులు కూడా ఈ పెరిగే రుసుమును చెల్లించకతప్పదు. అమెరికా కొత్త నిబంధనలు అమెరికా వెళ్లాలనుకునే వేలాది మంది భారతీయులపై ప్రభావం చూపుతాయని అంటున్నారు.
అలాగే ఉద్యోగులకు కంపెనీలు స్పాన్సర్ చేయడం ద్వారా అందించే ఎల్–1 వీసా పొడిగింపుల కోసం కంపెనీలపై గణనీయమైన ఫీజులు విధించాలని ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ఎల్–1 వీసాలకు సంబంధించి కంపెనీలపై మరింత రుసుములు విధించాలని యోచిస్తున్నారు. అదే జరిగితే కంపెనీలు ఉద్యోగులను స్పాన్సర్ చేసి అమెరికాకు పంపడానికి ఒకటి రెండుసార్లు ఆలోచించుకుంటాయి. అధిక రుసుములు చెల్లించడానికి బదులుగా ఆ కంపెనీలు ఉద్యోగులను స్పాన్సర్ చేయడానికి ముందుకు రాకపోవచ్చని అంటున్నారు. కంపెనీలకు కూడా అంత ఫీజు చెల్లించడం ఆర్థికంగా భారమవుతుందని చెబుతున్నారు.