పోర్ట్ బ్లెయిర్ పేరు మార్చిన కేంద్రం... కొత్త పేరేమిటో తెలుసా?
ఈ సందర్భంగా పోర్ట్ బ్లెయిర్ ను ఇకపై "శ్రీ విజయపురం" గా వ్యవహరించాలని వెల్లడించారు.
అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరును కేంద్రం మార్చింది. ప్రధాని నరేంద్ర మోడీ ఆశయాలకు అనుగుణంగా పోర్ట్ బ్లెయిర్ పేరు మారుస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోర్ట్ బ్లెయిర్ ను ఇకపై "శ్రీ విజయపురం" గా వ్యవహరించాలని వెల్లడించారు.
అవును... ఇకపై అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ ను "శ్రీ విజయపురం" గా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వలసవాద ఆనవాళ్ల నుంచి బయటపడేందుకు ఈ పేరు మార్చినట్లు వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా "ఎక్స్" వేదికగా ఈ విషయాలు తెలిపారు.
ఇందులో భాగంగా... వలసవాద గుర్తుల నుంచి దేశానికి విముక్తి కల్పించాలన్న ప్రధాని మోడీ ఆశయాలకు అనుగుణంగా పోర్ట్ బ్లెయిర్ పేరు శ్రీ విజయపురంగా మార్చాలని నిర్ణయించాం అని తెలిపిన షా... పాత పేరు వలసవాద వారసత్వాన్ని సూచిస్తోందని అన్నారు. శ్రీ విజయపురం అనేది భారత స్వాతంత్ర పోరాటంలో సాధించిన విజయానికి గుర్తని తెలిపారు.
ఇదే సమయంలో... నాటి స్వాతంత్ర పోరాటంలో అండమాన్ నికోబార్ పాత్ర ఎంతో ప్రత్యేకమని, మరెంతో అసామాన్యమని అమిత్ షా పేర్కొన్నారు. ఈ సందర్భంగా... చోళ సామ్రాజ్యంలో నౌకాదళ స్థావరంగా ఉన్న ఈ ప్రాంతం.. ప్రస్తుతం భారతదేశ వ్యూహాత్మక, అభివృద్ధి ఆశయాలకూ కీలక కేంద్రంగా పని చేస్తుందని తెలిపారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ మొట్టమొదటిసారిగా మువ్వన్నెల జెండాను ఇక్కడే ఎగరేశారని అమిత్ షా గుర్తు చేశారు. ఇదే క్రమంలో... వీర్ సావర్కర్ తో పాటు అనేకమంది స్వాతంత్ర్య సమరయోధులను బంధించిన జైలు కూడా ఇక్కడే ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో... ఇకపై పోర్ట్ బ్లెయిర్ పేరును "శ్రీ విజయపురం"గా వ్యవహరించాలని ట్వీట్ చేశారు.