ఎన్డీయే సర్కార్ కూలుతుందా...అమిత్ షా షాకింగ్ కామెంట్స్!
దేశాంలో ఎన్డీయే సర్కార్ మూడవసారి ఏర్పాటు అయి ఈ నెల 9వ తేదీకి రెండు నెలలు పూర్తి అవుతుంది.
దేశాంలో ఎన్డీయే సర్కార్ మూడవసారి ఏర్పాటు అయి ఈ నెల 9వ తేదీకి రెండు నెలలు పూర్తి అవుతుంది. ఎన్డీయే సర్కార్ కి పార్లమెంట్ లో మ్యాజిక్ ఫిగర్ అయిన 273 కంటే ఇరవై ఒక్క మంది ఎంపీల బలం అధికంగా ఉంది. అయితే ఎన్డీయే కూటమికి ఆక్సిజన్ అందిస్తున్న తెలుగుదేశం జేడీయూల మీదనే ఆధారపడాల్సి ఉంటోంది.
ఇందులో టీడీపీతో ఇబ్బంది లేకపోయినా జేడీయూతోనే అసలు చిక్కు అని అంటున్నారు. దాని అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ ఏ సంచలన నిర్ణయం తీసుకుంటారో అన్నదే అందరి ఆలోచన. ఇండియా కూటమి కూడా నితీష్ వైపే చూస్తోంది.
అందుకే ఎన్డీయే సర్కార్ కూలుతుంది ఎక్కువ కాలం అధికారంలో ఉండదని పదే పదే ఇండియా కూటమి నేతలు జోస్యాలు వదులుతున్నారు. అయితే ఈ ప్రచారాలను జ్యోతీష్యాలను ఎన్డీయే కూటమిలో నంబర్ టూ అయిన కేంద్ర మంత్రి అమిత్ షా కొట్టిపారేశారు. ఆయన ఒక పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ ఎన్డీయే కూలుతుందని అనుకోవద్దని ఇండియా కూటమి నేతలకు షాక్ ఇచ్చారు.
మూడవసారి ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. అయిదేళ్ల పాటు కొనసాగుతుందని అమిత్ షా అంటున్నారు. అంతే కాదు కాంగ్రెస్ కి ఏమి పెద్ద సీట్లు పెరిగాయని ఎద్దేవా చేశారు. 2014, 2019, 2024 మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ కి వచ్చిన సీట్లు కలుపుకున్నా 2024లో బీజేపీకి వచ్చిన 240 సీట్ల కంటే కూడా ఆమడ దూరంలో ఉందని గుర్తు పెట్టుకోవాలని సెటైర్లు వేశారు.
ఎన్డీయే సర్కార్ నానాటికీ ఆదరణ పెంచుకుంటోందని, ఇపుడే కాదు 2029లోనూ మరోసారి గెలుస్తుందని ఆయన జోస్యం చెప్పారు. మళ్లీ నాలుగవ సారి ఈ దేశానికి మోడీ ప్రధాని అవుతారని కూడా ఆయన చెప్పారు. అంటే 2029 నాటికి ఎనభై ఏళ్ళ వయసులో కూడా మోడీ ప్రధాని అవుతారా అన్నది కూడా ఇక్కడ చర్చకు వస్తోంది.
బీజేపీ 2047 టార్గెట్ పెట్టుకుంది. 2014 నుంచి 2047 దాకా కొనసాగాలని వందేళ్ళ దేశ స్వాతంత్ర్యం పండుగను కూడా కాషాయం పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండగానే జరుపుకోవాలని ఆశపడుతోంది. ఇక మోడీ చురుకుగా ఉన్నంతవరకూ ఆయనే ఎన్డీయే తరఫున ప్రధానిగా ఉంటారని కూడా అమిత్ షా సహా నేతలు అంతా నమ్ముతున్నారని అనుకోవాలి.
మరో వైపు చూస్తే దేశంలో ఇండియా కూటమి తన గ్రాఫ్ ని పెంచుకుంటోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీల ఉప ఎన్నికల్లోనూ ఇండియా కూటమి ఎక్కువ సీట్లు గెలుచుకుంది. ఇక ఉత్తర భారతాన గాలి మారుతోంది అన్న విశ్లేషణలు ఉన్నాయి. అదే విధంగా చూస్తే కనుక ఈ ఏడాది చివరలో మహారాష్ట్ర ఎన్నికలు ఉన్నాయి. జార్ఖండ్, హర్యానా ఎన్నికలు జరగనున్నాయి.
వచ్చే ఏడాది నవంబర్ లో బీహార్ కి ఎన్నికలు ఉన్నాయి. మరి ఈ ఎన్నికల్లో ఇండియా కూటమిని ఓడించి బీజేపీ గెలిస్తే అపుడు 2029 ఎన్నికల్లో మేమే గెలుస్తామని చెప్పినా బాగుంటుందని అంటున్నారు. ఏది ఏమైనా ఎన్డీయేకు కేంద్రలో ఢోకా లేదని అమిత్ షా అంటున్న మాటలు బీజేపీ క్యాడర్ కి ఉత్సాహం ఇస్తాయేమో కానీ దేశంలో మారుతున్న రాజకీయ వాతావరణం గమనిస్తున్న వారు మాత్రం ఆలోచించాల్సిందే అని అంటున్నారు.