అమ్మ ఆగ్రహం.. ఎన్నికల్లో నామినేషన్ వేసే వరకు వెళ్లింది
చివరకు కోర్టుకు వెళ్లినా ఫలితం లేకపోవటంతో.. వ్యవస్థల మీద విసుగు చెందిన ఆమె తాజా ఎన్నికల్లో పోటీకి దిగాలని నిర్ణయించుకున్నారు.
తెలంగాణలో జరుగుతున్న తాజా అసెంబ్లీ ఎన్నికల వేళ చోటు చేసుకున్న ఒక పరిణామం అందరిని ఆకర్షించటమే కాదు.. చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల జిల్లాకు చెందిన 80 ఏళ్ల పెద్ద వయస్కురాలు తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేయటానికి సిద్ధం కావటమే కాదు.. నామినేషన్ వేసిన తీరు ఆశ్చర్యకరంగా మారింది. హాట్ టాపిక్ గా మారిన ఈ ఉదంతంలో సదరు పెద్ద వయస్కురాలికి ఎదురైన ఇబ్బందికర పరిస్థితే తాజా నిర్ణయానికి కారణంగా చెబుతున్నారు.
జగిత్యాల అసెంబ్లీ రేసులోకి దిగారు 80 ఏళ్ల సీటీ శ్యామల. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమె ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నారు. ఇంతవరకు ఎలాంటి రాజకీయ బ్యాక్ గ్రౌండ్ లేని ఆమె.. తాజాగా ఎన్నికల్లో పోటీకి దిగే వరకు ఎందుకు వెళ్లారన్న విషయంలోకి వెళితే.. ఆమె నుంచి వచ్చే సమాధానం విన్నప్పుడు అయ్యో అనుకోకుండా ఉండలేం. ఇంతకూ జరిగిందేమంటే.. శ్యామలను ఆమె కొడుకు ఇంట్లో నుంచి గెంటేశాడు. ప్రస్తుతం జగిత్యాలలో ఉంటున్నారు.
తప్పుడు ధ్రువపత్రాల్ని చూపించి.. తన ఇంటిని తన ఇల్లుగా తన కొడుకు చెబుతున్నాడన్నది ఆమె ఆరోపణ. ఈ అంశం మీద తాను ఇప్పటికే పలువురిని సంప్రదించినా తనకు న్యాయం జరగలేదని వాపోతున్నారు. చివరకు కోర్టుకు వెళ్లినా ఫలితం లేకపోవటంతో.. వ్యవస్థల మీద విసుగు చెందిన ఆమె తాజా ఎన్నికల్లో పోటీకి దిగాలని నిర్ణయించుకున్నారు.
కేసు విచారణ అంతకంతకూ ఆలస్యమవటాన్ని ప్రశ్నిస్తునన ఆమె.. వ్యవస్థల్లోని లోపాల్ని ప్రశ్నించాలన్న ఉద్దేశంతోనే తాను బరిలోకి దిగినట్లుగా చెబుతున్నారు. ఆమె తీసుకున్న నిర్ణయం.. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయటంతో ఆమె ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలోనూ.. మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది.