ఏపీ ఫైబర్ నెట్ కు కొత్త ఎండీ.. 24 గంటల్లోనే నియామకం

ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ఆదిత్యను ప్రభుత్వం నియమించింది.

Update: 2025-02-25 13:33 GMT

ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ఆదిత్యను ప్రభుత్వం నియమించింది. ఏపీ ఫైబర్ నెట్ లో చైర్మన్, ఎండీల మధ్య వివాదం రేగడంతో నిన్న ఇద్దరినీ తప్పించిన విషయం తెలిసిందే. ఫైబర్ నెట్ చైర్మన్ హోదాలో జీవీ రెడ్డి గత ఎండీ దినేశ్ కుమార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రభుత్వ క్రమశిక్షణ కట్టుతప్పారనే కోణంలో జీవీ రెడ్డితో రాజీనామా చేయించిన ప్రభుత్వం ఆ వెంటనే ఎండీ దినేశ్ కుమార్ పై వేటు వేసింది. నాలుగు శాఖల నుంచి ఆయనను తప్పించడమే కాకుండా ఎక్కడా పోస్టింగు ఇవ్వకుండా జీఏడీలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది.

ఇక కొత్త ఎండీగా ప్రవీణ్ ఆదిత్యను ఆగమేఘాలపై నియమించిన ప్రభుత్వం ఫైబర్ నెట్ ప్రక్షాళనకు నడుంబిగించింది. గత ప్రభుత్వంలో ఫైబర్ నెట్ లో అనేక అవకతవకలు జరిగాయని ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. అదేవిధంగా అడ్డుగోలుగా నియమాకాలు జరిగాయని, వాట్సాప్ సూచనలతో ఉద్యోగాలు ఇచ్చేశారని ఫిర్యాదులు ఉన్నాయి. ఈ అంశాలపైనే గత చైర్మన్, ఎండీ మధ్య విభేదాలు తలెత్తాయి. అయితే ఇద్దరూ క్రమశిక్షణ తప్పారనే కోణంలో చర్యలు తీసుకున్న ప్రభుత్వం ఫైబర్ నెట్ ను సంస్కరించాల్సిందిగా కొత్త ఎండీ ప్రవీణ్ ఆదిత్యను సూచించింది.

Tags:    

Similar News