రేవంత్, చంద్రబాబు లకు అదృష్టం కలసి రావడం లేదా?

సోషల్ మీడియా శక్తివంతమైపోయిన తరువాత ప్రభుత్వాలు ఎంత చేసినా ప్రజలు సంతృప్తి చెందడం లేదు.

Update: 2025-02-25 13:30 GMT

సోషల్ మీడియా శక్తివంతమైపోయిన తరువాత ప్రభుత్వాలు ఎంత చేసినా ప్రజలు సంతృప్తి చెందడం లేదు. రేవంత్ రెడ్డి తనదైన చాతుర్యంతో కేసీఆర్ లాంటి శక్తివంతమైన నాయకుడిని రాజకీయం పరంగా ఓడించి అధికారంలోకి వచ్చినా, ఆ తర్వాత తన పరిపాలనలో నిరంతర దూకుడు ప్రదర్శించినా... ప్రజల నుంచి ఆశించినంత పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ రావడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్ లో హైడ్రాతో విధ్వంసం... ఈ దెబ్బకు రియల్ ఎస్టేట్ పడిపోవడం, సంక్షేమ పథకాలు ప్రకటించి అమలు చేయకపోవడం లాంటి అంశాలు రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత తెచ్చిపెట్టాయి. ప్రజల దగ్గరకు పథకాలు వెళ్లకపోవడంతో రేవంత్ రెడ్డి పెద్దగా ప్రభావం చూపించడం లేదు. దీంతో ప్రజలకు రేవంత్ పాలన పట్ల అప్పుడే వ్యతిరేకత వచ్చిపడుతోందని క్షేత్రస్థాయిలో పరిస్థితులను బట్టి తెలుస్తోంది.

అలాగే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు "సూపర్ సిక్స్" అని గొప్పగా ప్రచారం చేసినా, జగన్ ప్రభుత్వాన్ని ఓడించగలిగినా, ఇప్పటివరకు పెద్దగా ప్రజాదరణను సంపాదించలేకపోయారు. జగన్ హయాంలో ప్రజలకు నేరుగా డబ్బు అందించడం వల్ల ఆయనకు అనుకూలంగా ఉన్న మానసిక భావన, ఇప్పుడు చంద్రబాబు పాలనలో మారడం లేదు. పైగా సంపద సృష్టిస్తాను ప్రజలకు పంచుతనన్న పెద్దమనిషి చంద్రబాబు ఇప్పుడు "మా దగ్గర డబ్బులు లేవు, సంపాదించే మార్గం చెవిలో చెప్పండి" అని అడిగిన వీడియోలు సోషల్ మీడియాలో రోజుకో ఒకటి వైరల్ అవుతోంది. దీంతో చంద్రబాబు మరోసారి మోసం చేశాడని.. ఆయన ఏమీ చేయడం లేదన్న భావన ప్రజల్లో పాతుకుపోతోంది. చంద్రబాబు ప్రభుత్వం కూడా ఇప్పటివరకు పెద్దగా ప్రభావం చూపించలేకపోయడన్నది వాస్తవం. ముఖ్యంగా "సూపర్ సిక్స్" విధానాలు ఇప్పటివరకు అమలులోకి రాకపోవడం ప్రజలలో నిరాశ కలిగించే అంశంగా మారింది.

ఈ పరిణామాల మధ్య ప్రజలకు ప్రతీరోజూ ఏదో ఒకటి అందించకపోతే, వారు సంతృప్తి చెందలేరు. ఈ నేపథ్యంలో మోదీ తన హయాంలో పెద్దగా కొత్త కార్యక్రమాలు అమలు చేయకపోయినా, హిందుత్వ భావజాలాన్ని బలంగా నిలబెట్టడంతోనే అనేక ఎన్నికల్లో గెలుస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మోదీ నాయకత్వం ప్రజల్లో ఒక ప్రత్యేకమైన భావజాలాన్ని ముద్రవేయగలిగిన కారణంగా, ప్రజలు అభివృద్ధి కంటే భావజాలానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే వాదన వినిపిస్తోంది.

ఇక రేవంత్ రెడ్డి, చంద్రబాబు లాంటి నాయకులు, ప్రజలను ఆకట్టుకోవడానికి నిరంతరం వినూత్న చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే, వారి పాలనపై పెరుగుతున్న అసంతృప్తిని తట్టుకుని నిలబడటం కష్టమవుతుంది

Tags:    

Similar News