తెలంగాణ ప్రజలకు, ఏపీ జనాలకు తేడా చెప్పిన పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. "తెలంగాణ వాళ్లకి 'నా తెలంగాణ' అనే భావం ఉంది. మా ఆంధ్రప్రదేశ్ వాళ్లకి కులాలు అనే భావన తప్ప, మేము ఆంధ్రులం అనే భావన మాకు లేదు. విశాఖ స్టీల్ ప్లాంటు దగ్గర మాత్రమే మాకు ఆంధ్రులనే భావన వస్తుంది" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివిధ వర్గాల్లో ప్రతిస్పందన తెచ్చుకున్నాయి.
- కుల రాజకీయాల ప్రభావం
ఆంధ్రప్రదేశ్‌లో కుల రాజకీయాలు గడచిన ఎన్నో దశాబ్దాలుగా ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా కూడా కులాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఒక వాస్తవాన్ని సూచిస్తున్నాయనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో అక్కడ ఒక ప్రత్యేకమైన తెలంగాణ గుర్తింపుతో అభివృద్ధి చెందింది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఈ స్థాయిలో ప్రాంతీయ భావోద్వేగం అంతగా కనిపించడం లేదన్నది పవన్ సహా అందరూ అంగీకరించాల్సిన వాస్తవంగా చెప్పొచ్చు.
-విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల ఐక్యానికి ప్రతీక
పవన్ కళ్యాణ్ ‘విశాఖ స్టీల్ ప్లాంట్’ ఉదాహరణ ఇవ్వడం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, రాజకీయ నాయకులు, కార్మికులు విశాఖ ఉక్కు కోసం ఏకతాటిపై నిలబడ్డారు. దీని వెనుక ప్రత్యేక కారణం ఉంది. విశాఖ ఉక్కు "ఆంధ్రులకు" చెందినది అనే భావన కాకుండా, ఇది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతికి అవసరమైన పారిశ్రామిక ప్రాజెక్ట్ అని ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టే, ఈ ఉద్యమం ప్రాంతీయ, కుల సంబంధిత పరిమితులను దాటి అందరినీ ఒకే చోటకు తీసుకువచ్చింది. ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కుగా’ మారింది. అదే ఆంధ్రులను ఆ విషయంలో ఏకతాటిపై కి తీసుకొచ్చింది.
పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ, సామాజిక వ్యవస్థపై లోతైన చర్చకు తావిస్తున్నాయి. కులాల ప్రభావం తగ్గి, ప్రాంతీయతా భావన పెరిగితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజమైన ఏకతా భావనను పొందగలుగుతారు. ఈ మార్పు కేవలం రాజకీయ నేతల నుంచే కాకుండా, ప్రజలు కూడా ఆలోచనా ధోరణిలో మార్పు తీసుకురావడం ద్వారా సాధ్యమవుతుంది.