నిర్మలమ్మ బడ్జెట్...బాబును టార్గెట్ చేసిన వైసీపీ

అయితే కేంద్రం ఒక వైపు మెడికల్ సీట్లను ఎక్కువగా చేస్తామని చెబుతూంటే ఏపీలో మాత్రం తమకు మెడికల్ సీట్లు వద్దే వద్దని ఉన్న వాటిని రద్దు చేయాలని కేంద్రానికి చంద్రబాబు లేఖ రాసిన దుస్థితి ఉందని అన్నారు.

Update: 2025-02-01 13:05 GMT

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ని ప్రవేశపెట్టింది. 2025-26 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఏపీకి ఏమి దక్కింది అని అంతా చర్చించుకుంటున్నారు. అయితే దీని మీద విపక్ష వైసీపీ హాట్ కామెంట్స్ చేసింది. ఏపీకి దక్కింది గుండు సున్నా అని పేర్కొంది. ఆ విధంగా బడ్జెట్ లో ఏమీ సాధించలేని వైఫల్యాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు మూటకట్టుకున్నారని విమర్శలు గుప్పించింది. కేంద్ర బడ్జెట్ మీద వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి టీడీపీని టార్గెట్ చేశారు. ఏపీకి భారీ నిధులను కానీ ప్రాజెక్టులను కానీ తీసుకుని రావడంలో చంద్రబాబు దారుణంగా విఫలం అయ్యారని అన్నారు.

బీహార్ రాష్ట్రానికి బొనాంజాను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఏపీకి మాత్రం రిక్త హస్తం ఇచ్చిందని ఆయన అన్నారు. బడ్జెట్ లో ఏపీకి తీరని అన్యాయం జరిగిందని అన్నారు. ఈ విషయంలో చంద్రబాబు టీడీపీ కూటమి ప్రభుత్వం అంతర్మధనం చేసుకోవాలని మిధున్ రెడ్డి సూచించారు.

నిజానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో ఎన్డీయేకు తెలుగుదేశం పార్టీ జనతాదళ్ యునైటెడ్ కీలకంగా వ్యవహరిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. మరి బీహార్ సీఎం జేడీయూ అధినేత నితీష్ కుమార్ కేంద్ర ప్రభుత్వం వద్ద తన పట్టుని పెంచుకుని బడ్జెట్ కేటాయింపులను బాగా రాబట్టుకున్నారని ఆయన గుర్తు చేశారు. ఒక విధంగా బడ్జెట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం వద్ద పై చేయి సాధించారని అన్నారు. మరి తెలుగుదేశం పార్టీ ఎందుకు విఫలం అవుతోందని నిలదీశారు.

ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసిందని ఆయన అన్నారు. జాతీయ స్థాయిలో భారీగా మెడికల్ సీట్లను పెంచుతామంటూ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారని అన్నారు. అయితే కేంద్రం ఒక వైపు మెడికల్ సీట్లను ఎక్కువగా చేస్తామని చెబుతూంటే ఏపీలో మాత్రం తమకు మెడికల్ సీట్లు వద్దే వద్దని ఉన్న వాటిని రద్దు చేయాలని కేంద్రానికి చంద్రబాబు లేఖ రాసిన దుస్థితి ఉందని అన్నారు. దీని వల్ల కూడా ఏపీకి ఎలాంటి ఉపయోగం ఉండదని ఆయన అన్నారు.

మరో వైపు చూస్తే ఏపీలో 15 శాతం గ్రోత్ రేటుని సాధిస్తామని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు. ఎనిమిది నెలల టీడీపీ కూటమి పాలనలో ఏ ఒక వర్గం సుఖంగా లేదని ఆయన విమర్శించారు. సూపర్ సిక్స్ హామీలను కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని అన్నారు. ప్రజల చేతిలలో సొమ్ము లేకపోవడం వల్లనే జీఎస్టీ కూడా తగ్గిపోయిందని అన్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే ఏపీకి కేంద్రం ప్రకటించినవి తక్కువగా ఉన్నాయని బీహార్ తో పోలుస్తూ వైసీపీ చేసిన విమర్శలు చర్చనీయాంశం అయ్యాయి. మరో వైపు చూస్తే ఈ బడ్జెట్ వల్ల ఏపీకి ఎంతవరకూ లాభమన్న దాని మీద నిపుణులతో సహా అంతా విశ్లేషిస్తున్నారు. ఇక టీడీపీ కూడా ఈ బడ్జెట్ విషయంలో అంతర్మధనం చేసుకుంటుందా అన్న చర్చ సాగుతోంది.

Tags:    

Similar News