'పెట్టుబడుల రాజకీయం'లో కూటమి పయనం ఎటు.. ?
ఇటీవల ముగిసిన స్విట్జర్లాండ్‌లోని దావోస్ పెట్టబడుల సదస్సులో ఆశించిన విధంగా పెట్టుబడులు రాలేదు.
ఏపీకి పెట్టుబడులు సాధించే విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహారం అంతర్గతంగా ఇబ్బందిలో పడింది. ఇటీవల ముగిసిన స్విట్జర్లాండ్‌లోని దావోస్ పెట్టబడుల సదస్సులో ఆశించిన విధంగా పెట్టుబడులు రాలేదు. అయితే.. ఇప్పటికిప్పుడు పెట్టుబడులు రాకపోయినా.. త్వరలోనే ఎంవోయూలు కుదురుతాయని సీఎం చంద్రబాబు సహా.. మంత్రి నారా లోకేష్ ధీమాగా ఉన్నారు. కానీ, జాతీయ మీడియాలో వరుసగా వస్తున్న కొన్ని కథనాలను పరిశీలిస్తే.. కూటమి సర్కారులో పెట్టుబడుల వ్యవహారం చర్చకు వస్తందని తెలుస్తోంది.
వచ్చే 2029 నాటికి రాష్ట్రాన్ని పెట్టుబడులకు కేంద్రంగా మార్చాలనేది సీఎం చంద్రబాబు ఉద్దేశం. ఈ క్రమంలోనే దావోస్ పర్యటనను చాలా సీరియస్‌గా తీసుకున్నారు. కానీ, కారణాలు ఏవైనా కూడా.. పెట్టుబడులు అందుబాటులోకి రాలేదు. ఈ క్రమంలోనే గత ఏడు మాసాల్లో చేసుకున్న ఒప్పందాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే.. అంతర్గత వ్యవహారం వేరేగా ఉందని జాతీయ మీడియా చెబుతోంది. పెట్టుబడుల వ్యవహారంలో కూటమి పార్టీలు సహకరించలేదన్నది ఈ వార్తల సారాంశం.
అయితే.. ఈ విషయంలో కూటమి పార్టీల నాయకులు ఎవరూ స్పందించడం లేదు. పెట్టుబడులు వస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. కానీ, వాస్తవానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. రాష్ట్ర పెట్టుబడుల విషయంలోదావోస్ కేంద్రంగా ఏమాత్రం సహకరించలేదని.. కూటమి సర్కారును ప్రమోట్ చేసే విషయంలోనూ కేంద్రం పట్టించుకోలేదన్నది తెలుస్తోంది.దీనిపై కూటమిలో అంతర్గత చర్చ సాగుతోంది. ఇక, రాష్ట్ర స్థాయిలో బీజేపీ నాయకులు కూడా పెట్టుబడులతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా నే ఉన్నారు.
ఇక, జనసేన కూడా.. పెట్టుబడుల వ్యవహారం టీడీపీ చూసుకుంటుందన్న వాదనలోనే ఉండిపోయింది. అంతేకాదు.. పెట్టుబడుల విషయంలో జనసేన శైలి భిన్నంగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. వెరసి కూటమిలో పెట్టుబడుల ఆకర్షణపై తీవ్రస్థాయిలో కీలక నేతల మధ్య చర్చ సాగుతోంది. ఇది కూటమి ప్రభుత్వంపై ప్రభావం చూపించకపోయినా.. పెట్టుబడులు వచ్చేందుకు ఉన్న అవకాశాలను ప్రచారం చేయడంలోనూ.. రాష్ట్రానికి మేలు చేయడంలోనూ కలిసి రావడం లేదన్న సంకేతాలను అయితే బలంగానే పంపించినట్టు అయిందని జాతీయ మీడియా పేర్కొనడం గమనార్హం.