2000 బస్సులు, 11,500 అదనపు సిబ్బంది అవసరం

మరోవైపు ముగ్గురు మంత్రుల కమిటీ కూడా ఇతర రాష్ట్రాల్లో ఈ పథకం అమలు తీరును అధ్యయనం చేయనుంది.

Update: 2024-12-24 09:30 GMT

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకంపై ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఇతర రాష్ట్రాల్లో ఈ పథకంపై అధ్యయనం చేసిన అధికారులు ఏపీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ పథకం అమలు చేయాలంటే ఏయే చర్యలు తీసుకోవాలో సూచిస్తూ ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించారు. మరోవైపు ముగ్గురు మంత్రుల కమిటీ కూడా ఇతర రాష్ట్రాల్లో ఈ పథకం అమలు తీరును అధ్యయనం చేయనుంది.

ఎన్నికల ముందు కూటమి నేతలు హామీ ఇచ్చిన ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే అదనంగా రోజుకు సగటున 10 లక్షల మంది ప్రయాణించే అవకాశాలు ఉన్నాయని ఆర్టీసీ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఇప్పటికే ఈ పథకం అమలు చేస్తున్న తెలంగాణ, కర్ణాటకల్లో అధ్యయనం చేసిన అధికారులు కొన్ని సూచనలు చేస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారని సమాచారం. తెలంగాణ, కర్ణాటకల్లో అక్కడి ప్రభుత్వాలు ఎలాంటి ముందస్తు ప్రణాళికలు లేకుండా ఆగమేఘాల మీద ఈ పథకాన్ని అమలు చేయడంతో కొన్ని సమస్యలు తలెత్తాయని, ఏపీలో అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండాలంటే ప్రస్తుతం ఉన్న బస్సు సర్వీసులను పెంచాల్సివుందని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం కనీసం రెండు వేల కొత్త బస్సులు సమకూర్చుకోవాలని, అదనంగా 11,500 మంది సిబ్బందిని నియమించుకోవాలని ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.

ఎంత రాబడ తగ్గుతుంది? ఏయే రూట్లలో ఏయే సర్వీసులకు డిమాండ్ పెరుగుతుంది? వంటి విషయాలపైనా సమగ్ర నివేదిక సిద్ధం చేశారు. తమ నివేదికను రాష్ట్ర రవాణా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డికి అందజేశారు. ఈ నివేదికను ముగ్గురు మంత్రుల కమిటీ పరిశీలించి ప్రభుత్వానికి నివేదించనుంది. ప్రస్తుతం ఏపీలోని ఆర్టీసీ సర్వీసుల్లో సగటున 44 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో ఉచిత, రాయితీ పాసులపై ప్రయాణించే వారు సుమారు 17 లక్షల మంది ఉంటారని అంచనా. సూపర్ లగ్జరీ, ఆల్ట్రా డీలక్స్, ఏసీ సర్వీసుల్లో ప్రయాణించేవారు 3 లక్షలు ఉంటుంది. మిగిలిన 24 లక్షల మంది పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, మెట్రో, సిటీ సర్వీసుల్లో ప్రయాణిస్తుంటారు. ఉచిత బస్సు అందుబాటులోకి తెస్తే ఈ సర్వీసుల్లోనే భారీగా ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ప్రయాణికుల సంఖ్యకన్నా అదనంగా మరో 10 లక్షల మంది మహిళా ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చని లెక్కగడుతున్నారు.

పెరగనున్న ప్రయాణికుల సంఖ్యను గమనించి ఆ మేరకు బస్సులు, డ్రైవర్లు, కండకర్లు, మెకానిక్స్, ఇంజనీరింగ్ సిబ్బందిని పెంచుకోవాల్సివుందని అధికారులకు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ పథకం ద్వారా మిగిలిన ప్రయాణికులు ఇబ్బందులు తలెత్తకుండా, అమలు విధానంపై అసంతృప్తి తలెత్తకుండా ఉండాలంటే ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఉచిత ప్రయాణం వల్ల ఆర్టీసీలో ఆక్యుపెన్సీ రేషియో పెరిగే అవకాశం ఉందని గుర్తించారు. ప్రస్తుతం ఆర్టీసీలో ఓఆర్ 68 నుంచి 69 శాతం ఉంది. తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేయడం ద్వారా ఓఆర్ 95% పెరిగింది. దీన్నిద్రుష్టిలో పెట్టుకుని ప్రయాణికులు పెరిగే అవకాశం ఉన్న రూట్లలో అదనంగా రెండువేల సర్వీసులు పెంచాలని అధికారులు సూచించారు. అంతేకాకుండా ఈ పథకం వల్ల ఆర్టీసీ నెలకు కనిష్టంగా రూ.200 కోట్లు ఆదాయం కోల్పోవాల్సివుంటుందని నివేదించారు. ప్రస్తుతం మహిళా ప్రయాణికుల ద్వారా ఆర్టీసీకి రోజుకు ఆరు నుంచి ఏడు కోట్ల రూపాయలు వసూలు అవుతోంది. ఈ మొత్తం నష్టపోయే అవకాశం ఉందని ప్రభుత్వానికి నివేదిక అందింది.

Tags:    

Similar News