ఏపీలో వలంటీర్లు ఎవరి వాళ్లు...?
కానీ, రెండు మాసాలు అయినప్ప టికీ.. ఇప్పటి వరకు చంద్రబాబు కానీ.. కూటమిలోని బీజేపీ, జనసేనలు కానీ, వలంటీర్ల వ్యవహారంపై పెదవి విప్పడం లేదు. వారిని పలకరించడమూ లేదు.
రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హయాంలో నియమితులైన వలంటీర్ల వ్యవహారం.. రోజు రోజుకు అనేక మలుపులు తిరుగుతోంది. వారిని కొనసాగిస్తామనే కాదు.. వారికి జగన్ ఇస్తున్న రూ.5000 లను కాకుండా..తాము అధి కారంలోకి వస్తే.. రూ.10 వేలను పెంచి ఇస్తామని చంద్రబాబు చెప్పారు. కానీ, రెండు మాసాలు అయినప్ప టికీ.. ఇప్పటి వరకు చంద్రబాబు కానీ.. కూటమిలోని బీజేపీ, జనసేనలు కానీ, వలంటీర్ల వ్యవహారంపై పెదవి విప్పడం లేదు. వారిని పలకరించడమూ లేదు.
దీంతో వలంటీర్ల వ్యవహారానికి చంద్రబాబు సర్కారు ఇక, ఫుల్ స్టాప్ పెట్టిందనే అనుకోవాల్సి వస్తోంది. అయితే.. ఇక్కడే ఒక ప్రశ్న తెరమీదికి వచ్చింది. వలంటీర్లను ఎందుకు వద్దను కుంటున్నారు? అనే. వలంటీర్లు అనేది వైసీపీ హయాంలో తీసుకువచ్చారు కాబట్టి.. వారిని కొనసాగిస్తే.. జగన్ పేరు, ఊరు కూడా ప్రజల మధ్య అలానే ఉంటుందని చంద్రబాబు సహా పవన్ కల్యాణ్ అనుకుంటున్నట్టు భావించాలి. అందుకే వారి విషయాన్ని ప్రస్తుతానికి బుట్టదాఖలు చేశారు.
అయితే.. వాస్తవం ఏంటంటే.. వలంటీర్ వ్యవస్థ అనేది మాత్రమే జగన్ తీసుకువచ్చారు. ఇక్కడ జగన్ అంటే.. సొంతం గా తీసుకువచ్చారా? లేక ప్రభుత్వం పరంగా తీసుకువచ్చారా? అంటే.. ప్రభుత్వ పరం గానే వారిని నియమించారు. దీనికి ఒక ప్రత్యేక వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు.. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని కూడా నియమించారు. అంటే ప్రభుత్వ నిర్ణయమే కదా! చంద్రబాబు గతంలో చెప్పిన దాని ప్రకారం.. ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తర్వాత ప్రభుత్వం కొనసాగించాలి.
కానీ, ఇప్పుడు అది జరగడం లేదు. వలంటీర్లపై జగన్ ముద్ర వేశారు. కానీ, ఇక్కడ వారంతా ప్రభుత్వం నియమించుకుంటేనే నియమితులయ్యారన్న వాదనను మరిచిపోతున్నారు. అంతేకాదు.. వలంటీర్ వ్యవస్థను నిలిపివేయడం వల్ల 2 లక్షల మందిని ఒక లూప్‌లైన్‌లోని నెట్టేసినట్టు అయింది. దీనివల్ల వారిపై ఆధారపడిన కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. నెలకు వచ్చే రూ. 5000లతోనే తమ ఖర్చులు జరుపుకొన్న నిరుద్యోగుల వ్యవహారాన్ని కూడా వదిలేశారు. ఇది సమంజసం కాదనేది నిపుణుల మాట.