అమెరికాలో ఇంకో దారుణం.. భారతీయ కళాదర్శకుడి దారుణ హత్య!

ఇలా వరుస ఘటనలు అందరిలో ఆందోళనలు నింపుతున్నాయి.

Update: 2024-03-02 06:03 GMT

అమెరికాలో వరుసగా చోటు చేసుకుంటున్న భారతీయుల మరణాలు కలకలం రేపుతున్నాయి. ప్రమాదాల్లో మరణిస్తున్నవారితోపాటు ఇటీవల కాలంలో హత్యలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గత నెలలో భారతీయ కుటుంబం హత్యకు గురయింది. రెండు రోజుల క్రితం ఒక భారతీయ సంగీతకారుడిని కాల్చిచంపారు. ఇటీవల ఒక విద్యార్థిని ఆశ్రయం ఇవ్వనందుకు ఒక దేశదిమ్మరి దారుణంగా కొట్టి హత్య చేశాడు. ఇలా వరుస ఘటనలు అందరిలో ఆందోళనలు నింపుతున్నాయి.

ఇవి చాలవన్నట్టు తాజాగా అమెరికాలో మరో దారుణ హత్య చోటు చేసుకుంది. ప్రముఖ భరతనాట్య, కూచిపూడి కళాకారుడు అమర్‌ నాథ్‌ ఘోష్‌ ను గుర్తు తెలియని దుండగులు కాల్చిచంపారు.

ఈ విషయాన్ని ప్రముఖ బుల్లితెర నటి దేవోలీనా భట్టాచార్జీ సోషల్‌ మీడియాలో తెలిపారు. తన స్నేహితుడైన అమర్‌ నాథ్‌ అమెరికాలో హత్యకు గురయ్యారని ఆమె పోస్టు పెట్టారు. తన స్నేహితుడి మృతదేహాన్ని భారత్‌ కు తీసుకురావడానికి సహాయం చేయాలని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం, విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్, ప్రధాని నరేంద్ర మోదీలకు దేవోలీనా విన్నవించారు. భారత రాయబార కార్యాలయం అమర్‌ నాథ్‌ ఘోష్‌ హత్యకు గల కారణాన్ని తెలుసుకోవాలని ఆమె కోరారు.

కాగా ఫిబ్రవరి 27న సాయంత్రం మిస్సోరిలోని సెయింట్‌ లూయిస్‌ లో అమర్‌నాథ్‌ ఘోష్‌ హత్యకు గురయ్యారు. ఆయన ఈవినింగ్‌ వాక్‌ చేస్తుండగా, గుర్తు తెలియని దుండగులు అకస్మాత్తుగా ఆయనపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన అక్కడికక్కడే మరణించారు.

పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌ కతాకు చెందిన అమర్‌ నాథ్‌ కు చిన్నతనంలోనే తండ్రి మరణించారు. తల్లి మూడేళ్ల క్రితం మృతి చెందారు. ప్రస్తుతం పీహెచ్‌డీ చేస్తూ, కూచిపూడి, భరతనాట్యంలో అమర్‌ నాథ్‌ అద్భుతంగా రాణిస్తున్నారు. ఈ సమయంలో ఆయన హత్యకు గురికావడం పట్ల ఆయన బంధువులు, స్నేహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అమెరికాలోని అమర్‌ నాథ్‌ స్నేహితులు మృతదేహాన్ని భారత్‌ కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే హత్య విషయమంతా అమర్‌ నాథ్‌ స్నేహితురాలు దేవోలీనా భట్టాచార్జీ సోషల్‌ మీడియా పోస్టు ద్వారానే బయటపడింది. మరోవైపు అమర్‌ నాథ్‌ హత్యకు చికాగోలోని భారత రాయబార కార్యాలయం సంతాపం తెలిపింది.

Tags:    

Similar News