జగన్ వర్సెస్ లోకేష్ : ఈయన బెంగళూరు...ఆయన హైదరాబాద్

జగన్ ఇపుడు ఎక్కడ ఉన్నారు అంటే బహుశా వైసీపీ నేతలకు కూడా తెలియదేమో.

Update: 2024-09-08 11:47 GMT

స్పర్ధ ఉంటే విద్య బాగా వస్తుందని ఒక సామెత ఉంది. అలాగే రాజకీయాల్లో పోటీ ఉంటేనే అన్నీ తెలుస్తాయి. అంతే కాదు ఒకరి గుట్టు మరొకరు బయటపెట్టుకుంటారు కూడా. జగన్ ఇపుడు ఎక్కడ ఉన్నారు అంటే బహుశా వైసీపీ నేతలకు కూడా తెలియదేమో. ఆయన బెంగళూరులో ఉన్నారు అని టీడీపీ మంత్రులు చెబుతున్నారు.

వారు చెబుతున్నారు అంటే నమ్మాల్సిందే. ఎందుకంటే వారి వద్ద అలాంటి నిఘా వ్యవస్థ ఉంటుంది కదా. ప్రత్యర్ధి మీదనే ఆ నిఘా కళ్ళు చాలా చురుగ్గా పనిచేస్తాయి కాబట్టి పక్కా ఇన్ఫర్మేషన్ వారి దగ్గర ఉంటుందని అనుకోవాలి. జగన్ బెంగళూరులో కూర్చుని పులిహోర కబుర్లు చెబుతున్నారు అని హోం మంత్రి అనిత హాట్ కామెంట్స్ చేశారు.

లోకేష్ అయితే ఒక ట్వీట్ చేస్తూ బెంగళూరు లో జగన్ ఉంటున్నారని జనం ఎలా పోయినా ఆయనకు అక్కరలేదు అని గట్టిగానే విసుర్లు విసిరారు. మరి వైసీపీ ఊరుకుంటుందా వారు కూడా లోకేష్ గుట్టును బయటేశారు. లోకేష్ హైదరాబాద్ టూ విజయవాడ షటిల్ సర్వీస్ చేస్తున్నారని అది కూడా స్పెషల్ ఫ్లైట్ లో చేస్తున్నారు అని కూడా వైసీపీ హీటెత్తించే విమర్శ చేసింది.

ఒక పక్కన ప్రజలు వరదలలో చనిపోతున్నా కూడా లోకేష్ ప్రతీ రోజూ విజయవాడ నుంచి హైదరాబాద్ కి స్పెషల్ ఫ్లైట్ లో తిరగలేదా అని వైసీపీ నిలదీస్తోంది. మ్యాన్ మేడ్ విపత్తుగా బెజవాడ వరదలను వైసీపీ పేర్కొంటూ ఎంతో మంది నిరాశ్రయులు అయ్యారని మరెంతో మంది చనిపోయారని అయినా ఎనిమిది రోజులు గడచినా సహాయ చర్యలు పూర్తి స్థాయిలో చేయలేకపోయారు అని లోకేష్ మీద వైసీపీ మండిపడింది.

జగన్ హుందాతనం నేర్చుకోవాలి లోకేష్ అంటే లోకేష్ కి హుందా అన్న పదానికి అర్థం తెలుసా అని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఎర్రబుక్కుతో పిచ్చి పాలనను టీడీపీ చేస్తోంది అని కూడా అంటోంది. ఇవన్నీ పక్కన పెడితే చంద్రబాబు విజవాడ కలెక్టరేట్ లోనే ఉంటున్నారు. ఆయన ఏడున్నర పదుల వయసులో బాధ్యతలను నెత్తిన పెట్టుకుని పనిచేస్తున్నారు.

అయితే లోకేష్ హైదరాబాద్ లో ఉంటున్నారు అని టీడీపీ అంటోంది. అలాగే జగన్ రెండు సార్లు వరద ప్రాంతాలలో పర్యటించారు. ఆ మీదట ఆయన చేయాల్సింది ఏమైనా ఉందా అన్నది వైసీపీ ఆలోచించుకోవాలి. కేవలం ప్రభుత్వం మాత్రమే చేస్తే తీరే బాధ కాదు, మరి జగన్ తన పార్టీ వారి చేత వరద ప్రాంతాల్లో సహాయ చర్యలకు ఆదేశాలు ఇవ్వడం వైసీపీ వరద సహాయాన్ని అందించడం ఇలా నిన్నటి దాకా అధికారంలో ఉన్న పార్టీగా నేటి విపక్షంగా చేయవచ్చు.

మరి అధినేత బెంగళూరు లో ఉన్నారు అని టీడీపీ అంటోంది. దాంతో పార్టీ శ్రేణులకు ఏమి పడుతుంది అన్నది కూడా ఒక చర్చ. అలాగే చంద్రబాబు ఏడున్నర పదుల వయసులో పనిచేస్తున్నారు అని లోకేష్ గొప్పగా చెబుతున్నారు. మరి ఆయన కూడా తన పాత్ర నిర్వహిస్తే బాగుంటుంది అన్నది కూడా వస్తున్న సూచన.

ఇక్కడ ఇంకో విషయం ఉంది. ఏపీ నాయకులు ఎవరూ ఓడాక సొంత స్టేట్ లో పెద్దగా కనిపించరు అని. గతంలో వైసీపీ ఈ విధంగా టీడీపీ వారిని పక్క రాష్ట్రం వారు అని విమర్శించింది. ఇపుడు వైసీపీ పెద్దలూ అదే చేస్తున్నారు. ఇక టీడీపీ కూటమిలో కీలక నేతలు అధినాయకులు అంతా హైదరాబాద్ లోనే నివాసాలు ఏర్పాటు చేసుకుని అక్కడే ఉంటున్నారు.

ఇది ఏపీ ప్రజల ఖర్మ అనుకోవాలో ఏమిటో అర్ధం కాదు. దేశంలో ఏ రాష్ట్రంలో అయినా అధికార ప్రతిపక్షాలకు చెందిన వారు సొంత స్టేట్ లోనే ఉంటూ పాలిటిక్స్ చేస్తారు. ఒక్క ఏపీయే దానికి భిన్నం. అందువల్ల మీరు అక్కడికి వెళ్లారు అంటే మీరు అక్కడ ఉన్నారు అని ఒకరిని ఒకరు అనుకోవాల్సింది లేదు. ఎందుకంటే దొందుకు దొందే కాబట్టి. ఇవన్నీ పక్కన పెట్టి ఏపీ వరద సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు అయినా అంతా ఏపీలో ఉండి ఈ బాధ నుంచి జనాలను బయటపడేస్తే వారికి ఎంతో కొంత ఉపశమనం కలుగుతుంది అన్నదే అందరి మాటగా ఉంది.

Tags:    

Similar News