రాజేష్ మహాసేన స్థానంలో తెరపైకి మరో పేరు!!

ఈ క్రమంలో ఆయన స్థానంలో మరోకరు అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తుంది.

Update: 2024-03-07 11:11 GMT

ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలు నియోజకవర్గాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... టిక్కెట్లు దక్కక కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే.. మరికొంతమంది రెబల్స్ గా మారుతున్నారని తెలుస్తుంది. ఈ సమయంలో టిక్కెట్ దక్కించుకుని కూడా పోటీ చేయలేని పరిస్థితి రాజేష్ మహాసేన కు ఎదురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన స్థానంలో మరోకరు అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తుంది.

అవును... నారా లోకేష్ వీరాభిమానిగా పేరున్న మహాసేన రాజేష్ కు ఇటీవల టీడీపీ టిక్కెట్ దక్కిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం టీడీపీ అభ్యర్థిగా రాజేష్ బరిలోకి దిగితున్నట్లు చంద్రబాబు తమ అభ్యర్థుల తొలిజాబితా విడుదల సందర్భంగా ప్రకటించారు. ఈ సమయంలో స్థానిక జనసేన కార్యకర్తలు నానా హడావిడీ చేసిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా రాజేష్ మహాసేన కు టిక్కెట్ ఇస్తే ఊరుకునేది లేదంటూ.. అమలాపురం టీడీపీ పార్లమెంట్ ఇన్ ఛార్జ్ గంటి హరీష్ మాధుర్ సమక్షంలో తీవ్ర నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో హరీష్ మాధుర్ వాహనం అద్దాలు కూడా ధ్వంస మయ్యాయి. దీంతో...రాజేష్ మహాసేనను స్థానిక జనసైనికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారనే సంకేతాలు అధిష్టాణానికి చేరాయని అంటున్నారు.

ఈ సమయంలో పరిస్థితిని అర్ధం చేసుకున్నారో ఏమో కానీ... తన ఎంపికను ఈ స్థాయిలో వ్యతిరేకిస్తున్నప్పుడు తాను పోటీ చేయకపోవడమే బెటర్ అని చెబుతూ.. ఆయన పోటీ విరమించుకున్నారు. దీంతో ఈ విషయం పి.గన్నవరం నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. దీంతో... పి.గన్నవరం నియోజకవర్గం టీడీపీకే అని అంటున్న నేపథ్యంలో... ఇక్కడ నుంచి పోటీచేసే మరో అభ్యర్థి ఎవరు అనే చర్చ మొదలైంది.

ఈ సమయంలో పి.గన్నవరం టీడీపీ అభ్యర్థిగా మహాసేన రాజేష్ స్థానంలో అయితాబత్తుల ఆనందరావును బరిలోకి దింపే అవకాశం ఉందని అంటున్నారు. 2009, 2014, 2019 ఎన్నికల్లో అమలాపురం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ టిక్కెట్ పై మూడు సార్లు పోటీ చేసిన ఆనందరావు 2014 ఎన్నికల్లో గెలిచారు. పైగా... ఈయనకు పార్టీకి అత్యంత విధేయుడిగా పేరుంది! దీంతో ఈయనను అమలాపురం నుంచి పి.గన్నవరంకు తరలించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

Tags:    

Similar News