మద్యం మజా...జస్ట్ మూడు రోజుల్లోనే ?

కేవలం మూడు రోజుల వ్యవధిలో జరిగిన మద్యం అమ్మకాలు ఏపీవ్యాప్తంగా చూసుకుంటే కనుక అక్షరాలా 541 కోట్ల రూపాయలు జరిగాయని లెక్కలు చెబుతున్నాయి.

Update: 2024-10-20 05:30 GMT

మందు తాగని వాడు ఏమై పుడతాడో మహాకవి గురజాడ అప్పారావు గారు ఎక్కడా చెప్పలేదు. ఆయన పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్ అని చెప్పి వదిలేశారు. సో మందు విషయంలో ఎవరి చాయిస్ వారికి ఇచ్చేశారు అన్న మాట.

అయినా సరే పోగతాగని వాడే దున్నపోతై పుడితే మందు తాగని వాడు ఇంకా ఎలా పుడతారో అన్న కంగారూ భయాలు ఉంటాయి కదా. సో అలా మందుకు బానిస కానివారు ఎవరూ అన్న చర్చ ఉండనే ఉంది. ఇది కల్చర్, ఇది ఫ్యాషన్ ఇది ఒక నాగరికత. ఇది ఒక హాబీ. ఇలా ఎన్ని చెప్పుకున్నా కూడా మందు గ్లాస్ ని చూస్తే వచ్చే కిక్కే వేరు.

దానికి మన రాజకీయ పార్టీల అధినేతలు కూడా బాగానే సహకరిస్తున్నారాయే. పొద్దల్లా కష్టపడి సాయంత్రం వేళకు ఇంత చుక్క వేసుకోవాలని ఉంటుంది కదా ఆ మందుని కూడా నాణ్యతతో ఇవ్వకుండా ఎలా అని ఎన్నికల వేళ గొంతు చించుకుని విపక్షాలు జనం ముందే చెప్పాయి.

తాము అధికారంలోకి వస్తే నాణ్యమైన మందుని ఇస్తామని ప్రామిస్ కూడా చేశాయి. ఇపుడు ఇస్తున్నాయి. కూడా. విషయానికి వస్తే ఈ నెల 16 నుంచి ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ రూపంలో తెరచుకున్న మందు షాపులు మహా కిక్కే ఇస్తున్నాయి.

అవి లక్ష్మీ కళతో ఉట్టిపడుస్తున్నాయి. చూడాలి కానీ ప్రతీ షాపూ కిటకిటలాడుతోంది. అదేమి మోజో అదేమి వ్యామోహమో లేక అదేమి ఆకర్షణో తెలియదు కానీ మద్యం దుకాణాలు మాత్రం బ్రహ్మాండంగా కొత్త కళతో వెలిగిపోతున్నాయి.

మరి మద్యం ద్వారా ఆదాయం ఎలా వస్తోంది. అమ్మకాలు ఎలా సాగుతున్నాయన్న ఆసక్తి ఉంటుంది. కదా ఈ లెక్కలు తీస్తే మందు కిక్కి ఒక్క లెక్కన షాకించ్చేలాగానే ఉందిట. కేవలం మూడు రోజుల వ్యవధిలో జరిగిన మద్యం అమ్మకాలు ఏపీవ్యాప్తంగా చూసుకుంటే కనుక అక్షరాలా 541 కోట్ల రూపాయలు జరిగాయని లెక్కలు చెబుతున్నాయి.

అంటే సగటున రోజుకు నూటాభై నుంచి రెండు వందల కోట్ల దాకా మద్యం అమ్మకాలు జరిగాయన్న మాట. దసరా పండుగ వెళ్లిపోయింది అయినా కొత్త సరదా పండుగగా మారి మద్యం దుకాణాలకు కాసుల పంట కురిపిస్తోంది అని అంటున్నారు.

ఇక కేవలం మూడు రోజుల వ్యవధిలో 7,843 మంది మద్యం వ్యాపారులు స్టాక్ ని తీసుకుని వెళ్ళారు అని అంటున్నారు. స్టాక్ అయిపోయింది అని ఒక్కసారి కాదు రెండు మూడు సార్లు తీసుకెళ్ళిన వ్యాపారులూ ఉన్నారు అంటే కనుక ఏ విధంగా మద్యం సేల్ అవుతుందో ఊహించుకోండి అనే అంటున్నారు.

ఇక కొత్త లిక్కర్ పాలసీని అమలు చేసిన తరువాత చూస్తే కనుక ఇప్పటి వరకూ 6 లక్షల 77 వేల 511 కేసుల లిక్కర్ అమ్ముడైందని ఎక్సైజ్ శాఖ అధికార వర్గాల లెక్కలు చెబుతున్నాయి. అంతే కాదు ఇందులో చూస్తే కనుక ఒక లక్షా 94 వేల 261 కేసుల బీర్లు అమ్మడయ్యాయని చెబుతున్నారు. ఇక మందు షాపులను పక్కన పెడితే . రాష్ట్రంలోని బార్లకు కేవలం ఈ మూడు రోజులలోనే ఎక్సైజ్ శాఖ నుంచి 77 కోట్ల విలువైన అమ్మకాలు జరిపిందని కూడా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇదే తీరున మద్యం ఊపు కొనసాగితే ఏపీకి కాసుల పంటే అని చెబుతున్నారు.

అంతా బాగానే ఉంది కదా ఇంతలా తాగుతున్నారు కదా మరి హెల్త్ సంగతి ఏంటి అంటే ఆ ఒక్కటీ అడక్కు అనే అనుకోవాలి. తాగేవాడు స్పృహ ఉండే తాగుతున్నాడు. అది వాడి బలహీనత. మరి దానిని సొమ్ము చేసుకుంటున్నారు అంటే ఏమో నైతికంగా తప్పూ ఒప్పూ చెప్పేవారు ఎవరు. అది అంతే. ఇది ఇంతే. దట్సాల్.

Tags:    

Similar News