మంత్రుల‌కు ర్యాంకులు స‌రే.. ఏంటి ప్రాతిప‌దిక‌?

ఏపీ సీఎం చంద్ర‌బాబు కూట‌మి స‌ర్కారులోని ప్ర‌తి ఒక్క మంత్రికీ ర్యాంకులు ఇచ్చారు. రాష్ట్రంలో ప్ర‌భుత్వం ఏర్ప‌డి వాస్త‌వానికి ఏడు నెల‌లు పూర్త‌య్యాయి.

Update: 2025-02-06 14:25 GMT

ఏపీ సీఎం చంద్ర‌బాబు కూట‌మి స‌ర్కారులోని ప్ర‌తి ఒక్క మంత్రికీ ర్యాంకులు ఇచ్చారు. రాష్ట్రంలో ప్ర‌భుత్వం ఏర్ప‌డి వాస్త‌వానికి ఏడు నెల‌లు పూర్త‌య్యాయి. అయితే.. ఆయ‌న ఆరు మాసాల ప్రాతిప‌దిక‌న ఈ ర్యాంకులు ఇచ్చిన‌ట్టు సీఎంవో వ‌ర్గాలు తెలిపాయి. తొలి ఆరు మాసాల్లో ఏయే శాఖల మంత్రులు ఎలా ప‌నిచేశారు? ఎలాంటి రిజ‌ల్ట్ చూపించారు? ఏ విధంగా ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌య్యార‌న్న అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ఈ ర్యాంకులు ఇచ్చిన‌ట్టు సీఎంవో పేర్కొంది.

అయితే.. ఇలా చూసుకుంటే.. మంత్రి నారా లోకేష్‌.. అంద‌రిక‌న్నీ ముందుండాలి. కానీ, ఆయ‌న 8వ స్థానం లో ఉన్నారు. ఇక‌, నిరంత‌రం.. అధికారుల‌తో స‌మీక్ష‌లు, గ్రామ స‌భ‌లు నిర్వ‌హించి.. రికార్డు నెల‌కొల్పిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా.. అంద‌రిక‌న్నా తొలి స్థానంలో ఉండాలి. పైగా ఆయ‌న ట్ర‌బుల్ షూటర్‌గా కూడా ప‌నిచేస్తున్నారు. తిరుమ‌ల ల‌డ్డూ వివాదం వ‌చ్చిన‌ప్పుడు.. ధ‌ర్మ దీక్ష చేప‌ట్టారు. తిరుప‌తి తొక్కిస‌లాట జ‌రిగిన‌ప్పుడు.. ప్ర‌తిప‌క్షానికి ఛాన్స్ ఇవ్వ‌కుండా.. స‌ర్కారును కాపాడార‌న్న వాద‌న ఉంది.

మ‌రోవైపు.. సీఎం చంద్ర‌బాబు కూడా.. ఫ‌స్ట్ ప్లేస్‌కు అర్హులే. ఎందుకంటే.. ఆయ‌న 18-19 గంట‌ల పాటు ప‌నిచేస్తున్నారు. ప్ర‌తి నెలా 1వ తేదీన ఠంచ‌నుగా పింఛ‌ను దారుల ఇళ్ల‌కు వెళ్లి పింఛ‌ను అందిస్తున్నారు. కానీ, చంద్ర‌బాబు మాత్రం 6వ ర్యాంకులో ఉన్నారు. అదేవిధంగా మ‌రో మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌.. కీల‌క‌మైన రేష‌న్ బియ్యం మాఫియాపై ఉక్కుపాదం మోపారు. ప్ర‌జ‌ల‌కు అందాల్సిన బియ్యాన్ని ప‌క్క‌దారి ప‌ట్ట‌కుండా.. నిరంత‌రం స‌మీక్షిస్తున్నారు. ఆక‌స్మిక దాడులు, త‌నిఖీలు కూడా చేస్తున్నారు. కానీ, ఈయ‌న కూడా 4వ స్థానంలో ఉన్నారు.

సో.. మంత్రుల‌కు ఇచ్చిన ర్యాంకుల‌ను ప‌రిశీలిస్తే.. సీఎంవో వ‌ర్గాలు చెబుతున్న ప్రాతిప‌దిక ఏమాత్రం పోల‌డం లేదు. దీనివెనుక మ‌రో ప్రాతిప‌దిక ఏదో ఉండి ఉంటుంద‌ని అంటున్నారు త‌మ్ముళ్లు. వివాద ర‌హితులు, పెట్టుబ‌డులు తెచ్చేందుకు ఉత్సాహం చూపించేవారు.. ప‌నితీరును మెరుగు ప‌రుచుకుని ఆదాయార్జ‌న శాఖ‌ల‌ను ప‌రుగులు పెట్టించేవారు.. ఇలా కొన్ని నిర్దిష్ట‌మైన అంశాల‌ను చంద్ర‌బాబు ప్రాతిప‌దిక‌గా తీసుకుని ఉంటార‌ని అంటున్నారు. తాజాగా ఇచ్చిన ర్యాంకుల్లో త‌ర‌చుగా వివాదాల్లో ఉన్న మంత్రి వాసంశెట్టి సుభాష్ చివ‌రిస్థానంలో ఉండ‌డాన్ని బ‌ట్టి.. ఇదే ప్రాతిప‌దిక‌న చంద్ర‌బాబు ర్యాంకులు నిర్దేశించి ఉంటార‌ని అంటున్నారు.

Tags:    

Similar News