కూటమి సర్కార్ కి రిటైర్మెంట్ గండం ?

కొద్ది నెలలలో వీరిలో అత్యధికులు రిటైర్ అయిపోతారు అని అంటున్నారు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు ఆరు లక్షల దాకా ఉంటే అందులో ఈ సంఖ్య 12 శాతం అన్న మాట.

Update: 2025-01-12 04:10 GMT

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఆర్ధికంగా ఇబ్బందులు పడుతోంది అన్నది తెలిసిందే. ప్రతీ మంగళవారం రిజర్వ్ బ్యాంక్ కి వెళ్ళి సెక్యూరిటీ బాండ్లను తాకట్టు పెట్టి మరీ అప్పులు తెచ్చుకునే పరిస్థితి ఉంది. గడచిన ఏడు నెలలుగా ఇదే జరుగుతోంది. ఈ అప్పు ఎంత అంటే వైసీపీ నేతలు అయితే లక్ష కోట్లు అంటున్నారు. కానీ కనీసంగా డెబ్బై వేల పై దాటి ఉంటుందని సర్కార్ వైపు నుంచి వినిపిస్తున్న మాట.

ఇదిలా ఉంటే అప్పులు బడ్జెట్ లో పలు రంగాలకు భారీ ఎత్తున నిధులు కేటాయించాలనుకున్నా వీలు కాని పరిస్థితి. అలాగే కేటాయించినా నిధులు విడుదల చేసేందుకు ఆస్కారం లేకపోవడం అభివృద్ధి మౌలిక సదుపాయాలకు సైతం నిధులు వెచ్చించలేని పరిస్థితి ఉంది.

ఇక గత ప్రభుత్వం తెచ్చిన అప్పుల మీద వడ్డీలు ప్రతీ నెలా చివరి శుక్రవారం నేరుగా ఆర్ధిక మంత్రిత్వ శాఖకు చెల్లించాలని డిమాండ్లుగా వస్తున్నాయి. ఇలా చాలా ఆర్ధిక ఇబ్బందులతో ఏపీ ప్రభుత్వం ఉంది. అంతే కాదు సంక్షేమ పధకాలను సైతం కొత్తవాటిని ప్రకటించలేని దుస్థితి ఉంది.

ఇలాంటి నేపథ్యంలో సంపద సృష్టి అన్నది ఒక్క రోజులో అయ్యేది కాదు అది మెల్లగా జరిగే ప్రక్రియ. మరి అంతవరకూ ఏమిటి అంటే ఇలాగే సాగాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ క్రమంలో మరో గండం ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని పొంచి ఉందని అంటున్నారు. ఏంటంటే ఏకంగా ఈ ఏడాది నలభై నుంచి యాభై వేల పై చిలుకు ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు అని.

కొద్ది నెలలలో వీరిలో అత్యధికులు రిటైర్ అయిపోతారు అని అంటున్నారు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు ఆరు లక్షల దాకా ఉంటే అందులో ఈ సంఖ్య 12 శాతం అన్న మాట. ఈ అర లక్ష ఉద్యోగులలో ఒక్క పంచాయతీ రాజ్ శాఖలోనే నలభై వేల మంది దాకా ఉద్యోగులు రిటైర్ అవుతారు అని ప్రచారం అయితే సాగుతోంది. వీరంతా జగన్ ప్రభుత్వం అప్పట్లో అంటే 2022లో 60 ఏళ్ళ పదవీ విరమణ వయసుని ఏకంగా 62కి పెంచిన తరువాత ఈ రోజు దాకా కొనసాగుతున్న వారే అని అంటున్నారు.

జగన్ ప్రభుత్వం కరోనా సంక్షోభం ఎదుర్కొంటూ ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న వేళ అప్పట్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పదవీ విరమణ చేస్తారు అని వార్తలు వచ్చాయి. అయితే వారు కోరుకున్నారో లేదో తెలియదు కానీ నాతి ప్రభుత్వం మరో రెండేళ్ల పాటు పదవీ విరమణ వయసుని పొడిగిస్తున్నట్లుగా ప్రకటించింది. ఆ విధంగా రిటైర్మెంట్ గండం నుంచి తప్పించుకుంది.

ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు ఒకేసారి వేలల్లో రిటైర్ అయిత వారికి వచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా కలిపి కూడితే వందల కోట్ల రూపాయలు ఒకేసారి వారికి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ బాధ నుంచి తప్పించుకోవడానికి ఒకసారి 58 నుంచి 60గా పదవీ విరమణ వయసు పెంచారు. మరోసారి అది కాస్తా 62కి చేశారు. అయితే ఇపుడు ఏమి చేస్తారు అన్నదే చర్చగా ఉంది. మరో ఏడాది పొడిగిస్తారా లేక రిటైర్ అయిన వారికి బెనిఫిట్స్ కోసం వందల వేల కోట్లు అప్పు చేసి అయినా చెల్లిస్తారా అన్నది చర్చగా సాగుతోంది. చూడాలి మరి ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News