గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తే కేంద్రం ఇచ్చే ప్రోత్సాహకం తెలుసా?
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని రక్షించి.. ఆసుపత్రికి తరలించే వారిని గుర్తించి.. వారికి ప్రోత్సాహాకాన్ని అందించే ఈ పథకం పేరు.. "గుడ్ సమరిటన్".
రోడ్డు ప్రమాదానికి గురై.. గాయపడిన వారిని గంట వ్యవధిలో ఆసుపత్రికి తరలించే పెద్ద మనసున్న వారికి కేంద్రం ఒక ప్రోత్సాహకాన్ని అమలు చేస్తుంది. నిజానికి ఈ విషయం గురించి చాలామందికి తెలీదు. రోడ్డు మీద ప్రమాదానికి గురై.. తీవ్ర గాయాలైన వారిని అలానే రోడ్డు మీద వదిలేసే వారు.. లేదంటే వీడియోలు.. ఫోటోలు తీసే వారే తప్పించి.. వారికి అప్పడు అవసరమైన సాయాన్ని అందించేవారు తక్కువ మంది ఉంటారు. కొందరికి అలా చేయాలన్న ఆలోచన ఉన్నప్పటికి.. పోలీసులు.. కేసులు అన్న భయంతో వెనకడుగు వేస్తుంటారు.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని గోల్డెన్ అవర్ (ప్రమాదం జరిగిన గంట లోపు) ఆసుపత్రికి తరలిస్తే బతికేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 108 అంబులెన్స్ సర్వీసు ఉన్నప్పటికీ.. ప్రమాదం జరిగిన వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలిస్తే.. ఆ వ్యక్తి ప్రాణాలు పోకుండా నిలిపే వీలుంది. ఈ నేపథ్యంలో అలా సాయం చేసే పెద్ద మనసున్న వారిని ప్రోత్సహించటంతో పాటు.. అలాంటి వారికి అనవసరమైన కేసులు.. న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకోకుండా ఉండేందుకు మూడేళ్ల క్రితం కేంద్రం ఒక పథకాన్ని తీసుకొచ్చింది. బ్యాడ్ లక్ ఏమంటే.. ఈ పథకంపై పెద్దగా ప్రచారం లేకపోవటంతో.. దీని గురించి ప్రజల్లో అవగాహన లేకుండా పోయింది.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని రక్షించి.. ఆసుపత్రికి తరలించే వారిని గుర్తించి.. వారికి ప్రోత్సాహాకాన్ని అందించే ఈ పథకం పేరు.. "గుడ్ సమరిటన్". ఈ పథకంలో భాగంగా రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తే.. ఈ పథకం కింద రూ.5వేల నగదుతో పాటు ప్రశంసాపత్రాన్ని అందిస్తారు. ఏడాది వ్యవధిలో ఎక్కువ మందిని కాపాడిన పది మందికి ఏటా రూ.లక్ష చొప్పున ప్రోత్సాహాన్ని అందిస్తారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ పథకం 2026 మార్చి 31 వరకు అమల్లో ఉండనుంది.
ప్రమాదం బారిన పడి..వారిని వెంటనే (గంట లోపు) ఆసుపత్రికి తరలించిన తర్వాత.. స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తే.. స్టేషన్ అధికారిక లెటర్ ప్యాడ్ మీద ‘ప్రాణదాత’ అంటూ సేవ్ చేసిన వారి పేరు.. చిరునామాతో పాటు.. వారు చేసిన సాయాన్ని ధ్రువీకరిస్తూ లేఖ ఇస్తారు. ఆసుపత్రి వర్గాలు సైతం ప్రాణదాత వివరాల్ని ధ్రువీకరిస్తూ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందిస్తాయి. అనంతరం పోలీసులు ఆ వివరాల్ని పరిశీలించి.. జిల్లాస్థాయి అఫ్రైజల్ కమిటీకి పంపుతారు.
అక్కడి నుంచి ప్రాణదాతకు ప్రోత్సహం అందించాలని జిల్లా స్థాయి అఫ్రైజల్ కమిటీకి పంపుతారు. అక్కడి నుంచి ప్రాణదాతకు ప్రోత్సాహం అందించాలంటూ రాష్ట్ర రవాణా కమిషనర్ కు సిఫార్సు చేస్తారు. ఆపై.. సంబంధిత వ్యక్తికి రవాణా శాఖ అతడి బ్యాంక్ ఖాతాలో రూ.5వేలు జమ చేయటంతో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేస్తారు. ఒక వ్యక్తి ఏడాదిలో గరిష్ఠంగా ఐదుసార్లు ఈ అవార్డు పొందే వీలుంది.
ఇలా సాయం చేసే వారికి ఎలాంటి వేధింపులు.. నిర్బంధం లాంటి వాటి నుంచి గుడ్ సమరిటన్ చట్టం రక్షణ కల్పిస్తుంది. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చిన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవచ్చు. వ్యక్తిగత వివరాల్ని సైతం ఇవ్వాల్సిన అవసరం లేదు. బాధితుడి చికిత్స కోసం ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఆసుపత్రికి తీసుకెళ్లిన వారు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి ఉంటుందన్నది కూడా ఉత్త అపోహ మాత్రమే. అంబులెన్సుకు సమాచారం అందించి.. బాధితుల్ని ఆసుపత్రికి వెళ్లేలా చేసినా.. పోలీసుల నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదని పోలీసు ఉన్నతాధికారులు సైతం స్పష్టం చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మనం కూడా గుడ్ సమరిటన్ అవుదాం. దానికి ముందు.. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాం.