చంద్రబాబు ఇంటికి అధికార ముద్ర.. షరతులు వర్తిస్తాయి!
తాజాగా చంద్రబాబు ప్రభుత్వం దరఖాస్తును పరిష్కరించింది. సీఎం ప్రస్తుతం ఉన్న ఇంటిని గతంలో ప్రతపక్ష నేత నివాసంగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సీఎం చంద్రబాబు కరకట్ట నివాసంపై వివాదానికి ముగింపు పలకాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో చంద్రబాబు విపక్ష నేతగా ఉండగా, ఆ ఇంటిని అధికారిక నివాసంగా గుర్తించాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే అప్పటి ప్రభుత్వం ఆ దరఖాస్తును పెండింగులో పెట్టగా, తాజాగా చంద్రబాబు ప్రభుత్వం దరఖాస్తును పరిష్కరించింది. సీఎం ప్రస్తుతం ఉన్న ఇంటిని గతంలో ప్రతపక్ష నేత నివాసంగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులు కోర్టు ఆదేశాలకు లోబడి ఉంటాయని తెలిపింది.
రాజధాని అమరావతి ప్రాంతంలోని ఉండవల్లిలో క్రిష్ణా నది కరకట్ట సమీపంలో సీఎం చంద్రబాబు నివాసం ఉంది. పారిశ్రామిక వేత్త లింగమనేని రమేశ్ కి చెందిన ఈ ఇంటిని చంద్రబాబు లీజుకు తీసుకున్నారని చెబుతున్నారు. అయితే లీజు ఒప్పందం ఉందో లేదో కానీ, క్రిష్ణా నది ఎఫ్టీఎల్ కింద ఆ భవనం ఉన్నట్లు గత ప్రభుత్వం నోటీసులిచ్చింది. ఇదేకారణంతో గతంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్మించిన ప్రజా వేదికను వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలగించింది. అదే సమయంలో చంద్రబాబు కరకట్ట నివాసాన్ని కూల్చేస్తామని వైసీపీ హడావుడి చేసింది. అయితే భవన యజమాని లింగమేని రమేశ్ హైకోర్టును ఆశ్రయించడంతో స్టే విధించారు. ఇప్పటికీ ఈ కేసు హైకోర్టులో పెండింగులోనే ఉంది.
ఇలాంటి సమయంలో చంద్రబాబు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సీఎం నివసిస్తున్న ఉండవల్లి కరకట్ట ఇంటిని గతంలో విపక్ష నేత అధికారిక నివాసంగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీఏడీ కార్యదర్శి వాణి మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. 2019 జూన్ 13 నుంచి 2024 జూన్ 11 వరకు కరకట్ట నివాసం ప్రతిపక్ష నేత అధికారిక నివాసంగా గుర్తిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అయితే ఈ వ్యవహారం కోర్టులో ఉన్నందున తుది ఉత్తర్వులకు లోబడి ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు జీవోలో వెల్లడించారు. అంటే చంద్రబాబు ఇంటికి షరతులు వర్తిసాయనే పరోక్షంగా చెప్పినట్లైందని అంటున్నారు.
హైదరాబాద్ నుంచి ఏపీకి తరలివచ్చినప్పుడు సీఎంగా చంద్రబాబు కరకట్టపై పారిశ్రామిక వేత్త లింగమనేని రమేశ్ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అయితే దీనిపై లీజు ఒప్పందం ఉందా? లేదా? అనేది సస్పెన్స్ గానే ఉంది. కానీ, ఇది చంద్రబాబు నివాసంగానే పరిగణించి గత ప్రభుత్వం కూల్చేయాలని హడావుడి చేయడం అప్పట్లో సంచలనం రేపింది. అయితే ఈ వివాదానికి ముగింపు పలికేలా ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోందని అంటున్నారు.