సీఎం సీటుకు ముప్పు? ఎర్రబెల్లి లీక్స్

రాజకీయంగా సీఎం రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టేందుకే ఎర్రబెల్లి అలాంటి వ్యాఖ్యలు చేశారా? లేక నిజంగానే అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనేది చర్చకు దారితీస్తోంది.

Update: 2025-02-13 11:52 GMT

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పొలిటికల్ బాంబ్ పేల్చారు. సీఎం రేవంత్ రెడ్డిని గద్దె దించేందుకు కాంగ్రెస్లో కుట్ర జరుగుతోందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డిని పదవి నుంచి దించేయడానికి కాంగ్రెస్ పార్టీలో 25 మంది ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఎర్రబెల్లి మాటలతో తెలంగాణ రాజకీయాలు తీవ్ర చర్చకు దారితీశాయి. రాజకీయంగా సీఎం రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టేందుకే ఎర్రబెల్లి అలాంటి వ్యాఖ్యలు చేశారా? లేక నిజంగానే అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనేది చర్చకు దారితీస్తోంది.

ఎర్రబెల్లి సొంత నియోజకవర్గం పాలకుర్తిలో తొర్రూరులో గురువారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసహనం పెరిగిపోతోందని చెప్పిన ఆయన.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ వంద సీట్లలో గెలుస్తుందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు సరిగా లేదన్న కారణంతోనే స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నారని ఆరోపించారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విశ్వాసం కోల్పోయిన 25 మంది ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు ఉపసహంరించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని సంచలన ప్రకటన చేశారు.

ఎర్రబెల్లి ప్రకటన రాజకీయ వర్గాలను ఆకర్షించింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమయ్యారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి వలస వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా సీఎల్పీ సమావేశానికి గైర్హాజరయ్యారు. వీరిపై అనర్హత వేటు పడుతుందనే ఆందోళన ఓ కారణం కాగా, హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలతో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వంటివారు దూరంగా ఉంటున్నారు. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ఇప్పటివరకు సీఎం రేవంత్ రెడ్డిని అసలు కలవలేదని చెబుతున్నారు. సీఎం జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఆయన ఎడముఖం పెడముఖంగానే ఉంటున్నారు. దీంతో ఎర్రబెల్లి చెప్పిన మాటల్లో నిజం ఉందా? అనే చర్చ జరుగుతోంది.

సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరకముందు టీడీపీలో ఉండేవారు. అప్పట్లో ఎర్రబెల్లి కూడా అదే పార్టీ నేతగా వ్యవహరించేవారు. టీడీపీలో ఉండగా, ఈ ఇద్దరి మధ్య తీవ్ర విభేదాలు ఉండేవని చెబుతారు. అంతేకాకుండా ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డి ఇరుక్కునేందుకు ఎర్రబెల్లి కారణమని ఇప్పటికీ సీఎం అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పలు సభల్లో ప్రకటించారు. దీంతో ఎర్రబెల్లి మాటలు తాజాగా హీట్ పుట్టిస్తున్నాయి. ఆయన కేవలం రాజకీయంగానే ఈ కామెంట్లు చేశారా? లేకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుట్రపై ఆయనకు ఏమైనా ఉప్పు అందిందా? అనేది తీవ్ర చర్చకు దారితీసింది. ఏదిఏమైనా చాలా రోజుల తర్వాత నోరు విప్పిన ఎర్రబెల్లి తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం లేపారంటున్నారు.

Tags:    

Similar News